• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నివాళి: యుద్ధభూమిలో ఉండీ....

By Pratap
|

పేరు ప్రఖ్యాతులతో నిమిత్తం లేకుండా తన మానాన తాను పని చేసుకుంటూ స్థానికుల జీవితాలకు పేరు తెచ్చే పనిలో అవిశ్రాంతంగా శ్రమించిన గ్రామీణ పాత్రికేయ సోదరుడు తవుటు నాగభూషణం అన్న. నిరాడంబరతకు, నిర్మొహ మాటత్వానికి, ఆత్మీయ వ్యక్తిత్వానికి నిలువుటద్దం తాను. భద్ర జీవితప్రపంచానికి ఆయన వ్యతిరేకి. పనిలోనే విశ్రాంతి పొందే అచ్చమైన జానపదుడు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగానే కాదు, సామాజికంగానూ పెద్ద వెలితి.

-కందుకూరి రమేష్ బాబు

ఆంధ్రప్రదేశ్ నుంచి విడివడి తెలంగాణ తన దారిని తాను వెతుక్కుంటున్న ఈ సమయంలో వలసలు, ఆత్మహత్యలు, నిరుద్యోగం, వనరుల దోపిడీ తదితర సమస్యలు పోయి జీవితం ఆకుపచ్చగా మారే ఈ అరుదైన సంధికాలంలో ఆయన వెళ్లిపోవడం వల్ల మనకు ఊర్లలో వచ్చే మంచి చెడులు తెలియకుండా అవుతాయని నా రంది. భార్య పద్మక్క, ఇద్దరు కూతుళ్లు, కొడుకూ, తల్లీ-రక్త సంబంధీకులైన వీళ్లకే కాదు, ఉచ్ఛాస నిశ్వాసాలుగా శబ్దించే మగ్గం బతుకుల సిరిసిల్లకు రెక్కలు విరిగినట్లే అనిపిస్తున్నది. సెస్ వెలుగులు ఉన్నప్పటికీ, బతుకులో ఇప్పటికీ తొలగని చీకట్లు ఉన్నట్లు...ఆ భయాందోళనలు మానిపోవని నేను విలవిలలాడుతున్న.

ఆయన గురించి ఒక పుస్తకమే రాయాలి. తన రచనలు పరిష్కరించి మంచి మంచి బుక్కులే తేవాలి. అంతేకాదు, తనను విశ్లేషిస్తే జగిత్యాల, సిరిసిల్ల పోరాటాల తర్వాత కూడా తెలంగాణలో నిరుపేదలు ఎట్లా తల్లడ మల్లడమయ్యారో, దొరికిని చిన్న ఉపాధితోనే ఎట్లా సగబెట్టుకున్నారో, చిన్న పని చేతికందితేనే ఎన్ని అద్భుతాలు చేసి చూపిండ్రో, ఆ క్రమంలో వాళ్లు తమకు తాము కాకుండా -సమాజానికి మాత్రమే ఎంత అక్కరకు వచ్చిండ్రో కూడా తెలిసివస్తుంది. ఇదంతా లోతుగా పరిశీలిస్తే తెలంగాణ బిడ్డలు ప్రశాంతంగా జీవించకుండానే అకాల మరణాలు పొందుతున్నారన్న సత్యం కూడా అవగతమైతుంది. జీవితం సఫలం అయ్యేదెప్పుడా అన్న బాధ మనసును పిండేస్తుంది.

Tributes payed to journalist Tavutu NagaBhushanam

విలేకరిగా చెప్పుకుంటే తనది కొవ్వొత్తిలా వెలుగునిచ్చి కాలిపోయిన కార్యం అనాలి. అవిసిపోయిన కిడ్నీలనాలి. 'స్వయంకృతం' అంటారు తన మరణాన్ని. కానీ, యుద్ధభూమిలో ఉండి రెండు దశాబ్దాలు బతకడమే ఎక్కవ. అటువంటిది ఆయన రెండున్నర దశాబ్దాలు ఊపిరి సలపని విధంగా పని చేసి బతికిండు. అట్లా చేయవలసిన దుస్థితి ఉన్న తెలంగాణలో ఎవరి మరణమైనా సామాజిక మరణమే. ఎవడి బతుకు కూడా వ్యక్తిగతం కానే కాదు. ఇక ఈ విలేకరి బతుకు సంగతి చెప్పేదేముంటుంది! తనని మాత్రం అట్లా నిందించడం ఎందుకు? ఈ లెక్కన బతుకంతా వార్తగా బతికిన నాగభూషణం అన్న సిసలైన బతికిన మనిషే. పాత్రికేయంలో ఉజ్వలంగా సాగిన అరుదైన కలం. మూయని కలం. సిరిసిల్లలో పాత్రికేయ విప్లవానికి బీజం వేసిన వాళ్లలో తాను దీర్ఘదర్శి. అందుకే తనది అకాల మరణం కానే కాదు.

+++

మీకు తెలుసు. గ్రామీణ విలేకరులు వార్తలు ఇస్తారు. వార్తలు ఇచ్చినంత కాలమే వాళ్లు విలేకరులు. ఇవ్వనప్పుడు వాళ్ల ఉనికి ఉండదు. కానీ, నాగభూషణం అన్న వార్తలు ఉనికిలోకి రాక ముందరి నుంచీ ఉన్నట్టే, చిరు వార్తగా ఆయన మృత్యు వార్త అచ్చయినంక కూడా తన ఉనికి ఉండనే ఉన్నది. ఉంటది. అది మాసిపోదు. ఎందుకంటే, ఆయన మానేరు వాగులో నిశ్శబ్దంగా ఇంకిన కన్నీరే కాదు, ఆనందభాష్ఫం కూడా. ఎంతమందికి లైఫ్ ఇచ్చిండో అందరికీ తెలుసు. అందుకే అనడం..తాను బతికిన మనిషి అని! మానేటి వానలో, అక్కడి మట్టి పరిమళంలో ఆత్మగల్ల ఆయన చిరునవ్వు పొకడ మనల్ని వీడిపోదు.

+++

సిరిసిల్ల ఒకనాడు గ్రామం. తర్వాత పాత తాలూకా కేంద్రం. అటు తర్వాత డివిజన్. ఇటీవల జిల్లా కేంద్రం కూడా. ఆయన ఈనాడు జిల్లా స్టాఫర్ కూడా. అయినప్పటికీ తాను 27 ఏళ్ల క్రితం ఎట్లయితే చిరు విలేకరిగా ప్రస్థానం ప్రారంభించారో గత పది రోజుల క్రితం మరణించినప్పుడూ అట్లే అప్రాధాన్యంగా వెళ్లిపోయారనిపిస్తుంది. కానీ, ఆయన 'వార్త' కాదు. వార్తలకు ప్రాతిపదిక అయిన ప్రజల్లో ఒకరు. ప్రజల మనిషి. తానే ప్రజగా మసలిన వ్యక్తి. అందుకే ఆయన చచ్చిపోడు. మనిషిగానే కాక విలేకరిగా కూడా ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటడు. తాను దిద్దిన ఒరవడి తెలంగాణ పునర్నిర్మాణంలో మరింత దీక్షతో పాత్రికేయులు పని చేయాల్సిన అవసరాన్ని కూడా తన స్మృతి గుర్తు చేస్తూనే ఉంటది.

+++

సిరిసిల్లలోని సేవ్స్ స్వచ్ఛంద సంస్థలో కార్యలయ కార్యదర్శిగా పనిచేస్తున్న రోజుల్లో అన్న తొలి పరిచయం. తాను విలేకరిగానే పరిచయం. తర్వాత నేను గూడ విలేకరిగా సుప్రభాతం పత్రికలో చేరానంటే అందుకు నాలో ఉన్న ఆసక్తికి, అభిరుచికి ప్రోత్సాహం అందించిన తొలి విలేకరి ఆయనే. నిజానికి నేను, నా భార్యా కలిసి సైక్లోస్టయిల్డ్ రూపేణా ఒక దినపత్రికను మూడు మాసాలు నిరాటంకంగా నడపినప్పుడు తాను మాపై తొలి వార్త రాసిండు. అదిచ్చిన స్ఫూర్తితోనే నేను నేను ఉద్యోగం మానేసి హైదరాబాద్‌కి చేరుకున్నాను. పాత్రికేయంలో స్థిరపడ్డానని గర్వంగా చెప్పుకుంటాను.

హైదరాబాద్ వచ్చాక వాక్యాన్ని సరళంగా, విషయాన్ని నాన్చకుండా చెప్పడంలో గుర్తుకు వచ్చే ముఖ్య విలేకరిగా అన్ననే ఉన్నడు. తర్వాత్తర్వాత పాత్రికేయ జీవితంలో కుదురుకున్నాక రచయిత అవుతున్న క్రమంలో కూడా ఏ విషయాలను రచనలుగా మలుచుకోవాలీ? అన్న అంశంలో కూడా తవుటు నాగభూషణం అన్ననే నాకు స్ఫూర్తి. 'సామాన్యశాస్త్రం' ఒరవడికి నాకు తొలి బీజం ఇచ్చిన అక్షరశిల్పి అన్ననే. తన తర్వాతే నాకు అలిశెట్టి ప్రభాకర్ అన్న గురించి తెలిసింది. ఆ లెక్కన 'తొలి అలిశెట్టి ప్రభాకర్' నాకు ఈ 'అన్ననే' అని సగర్వంగా చెప్పుకుంటాను.

జూకంటి జగన్నాథం గారు, నలిమెల భాస్కర్ గారు, వారాల ఆనంద్ గారు. బి.ఎస్.రాములు గారు, మద్దికుంట లక్ష్మణ్ గారు...పత్తిపాక మోహన్, పెద్దింటి అశోక్ కుమార్ తదితరులెంత మంది ఉన్నా కూడా వారు రచనలతో మన ప్రాంతీయ జీవనాన్ని విశ్వదర్శనం గావిస్తూ ఉన్నప్పుడు, దీర్ఘకాలం ఉపయోగపడే సారస్వతంగా మలుస్తున్నప్పుడు తవుటు నాగభూషణం అన్న వార్తలు రచిస్తూ జనసామాన్యానికి తక్షణం అక్కరకు వచ్చే పాత్రికేయ రచయితగా ఉన్నాడు. వీళ్లకూ వాళ్లకూ అని కాకుండా అందరికీ తలలో నాలుకలా మెసిలిండు. అట్లాంటి వ్యక్తి మరణంతో సిరిసిల్ల ఒక అరుదైన పాత్రికేయ నేతకారుడిని కోల్పోయింది. ఒక ఆత్మీయ కరచాలనం స్నేహితులకు దూరమైంది.

+++

నాగభూషణం అన్న సునాయాసంగా పని చేసినట్లే ఉండేది. కానీ, ఆయన తనలోనే ఆలోచనలు పేనుకునేవాడు. లోలోన ఎడిట్ చేసుకునేవాడు. చాలా షార్ప్‌గా రియాక్ట్ అయ్యేటోడు. రిటార్ట్ ఇవ్వడంలోనూ చురుకైన వాడు. అయితే అవతలి వ్యక్తిగా కాకుండా తన పారాంతానికి, జీవితానికి లోపలి వ్యక్తిగా ఉండేవాడు. అందుకే తనకి రచన అన్నది లైవ్లీహుడ్ మాత్రమే కాదు, లివింగ్. బతుకు దెరువు కాదు, బతకడమే.

ఏక కాలంలో ఆయన సబ్జెక్ట్, ఆబ్జెక్ట్.

అందుకే తాను అబ్జెక్టివ్‌గా చూసి, తన సబ్జెక్ట్‌ను అపూర్వంగా వార్తలుగా మలిచేవాడు. ఈ ప్రత్యేక లక్షణం కారణంగానే స్థానిక విషయాల్లో నలుగురి దృష్టికి రాని విషయాలను ఆయన మొట్టమొదట వార్తలుగా మలిచేవాడు. తొలిసారిగా ఆయా అంశాలపై వార్తా కథనాలుగా అందించేవాడు. అందుకు తగ్గ విషయ సేకరణ ఎప్పుడు జరిపేవాడో ఎవరికీ తెలిసేది కాదు. కానీ, పని జరుగుతూనే ఉండేది. అందుకు చక్కటి డాక్యుమెంటేషన్ వుండాలన్న తపనతో అవసరమైన ఫొటోలనూ జత చేసేవాడు. ఇదంతా చాలా ప్రేమతో చేసేవాడు. అందుకోసం జీవితాన్ని సన్నిహితంగా గమనిస్తూ ఉండేటోడు. ఒక రకంగా ఇదంతా రచయిత తాలూకు నైపుణ్యం. దాన్ని ఆయన వార్తలకు ధారపోసే అరుదైన జాతిరత్నం.

నిజం. మనలోనే ఉండే రచయితను విలేకరిని చేయడం అంటే అదొక అనవార్యత. త్యాగం కూడా. ఆ పని చేస్తున్న గ్రామీణ పాత్రికేయ ప్రపంచంలో తవుటు నాగభూషణం అన్న ఒక మేలైన మార్గదర్శి.

+++

తాను చాలా గంభీరమైన విషయాలను కూడా ఆ గాంభీర్యత సడలకుండా వార్తలుగా ఇచ్చేటోడు. పీపుల్స్‌వార్, జనశక్తి వంటి రాజకీయ యుద్ధ వార్తలనూ ఎంతో బాధ్యతగా వార్తలు చేసేటోడు. స్థానిక జీవన విధ్వంసం ఎంత పెద్ద స్థాయిలో ఉందో ఆత్మహత్యల నేపథ్యంలో ఆదినుంచీ అందజేస్తూ నిరంతరం సమాజాన్ని హెచ్చరించిండు. అట్లే అగ్గిపెట్టెలో పట్టు చీరనేసిన పరంధాములు వంటి అపూర్వమైన కళాకారులు, అధో జగత్ సృజనశీలుర గురించి ముచ్చటగా రాసి, వాళ్ల విలువేమిటో వాళ్లకే కాక మనందరికీ తెలియజెప్పిండు. నా గురించే కాదు, ఇవ్వాళ సిరిషాలలో పేరెల్లిన వాళ్లకు తొలి అభినందన అక్షరం రాసింది అన్ననే అంటే అతిశయోక్తి కాదు. అందుకే అనడం, తనది వెన్నుతట్టే కలం అని, దానికి మరణం ఎట్లుంటదని!?

ఆల్రెడీ పేపర్లలో ప్రింటయిన వాళ్లకూ - అంటే రచయితలకు, కవులకు కొత్త ముఖాన్ని అద్దింది తానే. కొత్త ముఖం అంటే వాళ్లు బయట గెలిచినా ఇంట గెలిచేలా చేసే ఒరవడి అని! దాంతో అన్న మన సాహిత్య కారుల అరుదైన వ్యక్తిత్వాన్ని కూడా తానే ఎంతో ఆసక్తిగా రచించి వెల్లడించిన సూక్ష్మదర్శిని.

ఇవన్నీ ఒకెత్తయితే దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయంగా మారిన సిరిసిల్ల రూపురేఖల్లో తన వార్తలవల్ల బతకి బట్టకట్టి, పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ఎంతోమంది. అవును, వాళ్లు తెల్లబట్టలు వేసుకుని తిరుగుతున్నారంటే అది ఆయన వారిని గుర్తించి తగిన రీతిలో వాళ్ల గురించి అనేక వార్తలు రాయడం వల్లే అనాలి. అంతేకాదు, ఎదుటి వాళ్లలో ఉన్న గొప్పతనాన్ని అక్షరాలా అభినందించడమే కాదు, వాళ్ల పుస్తకాలను పరిష్కరించి ఎడిట్ చేసిచ్చిన వ్యక్తి కూడా తవుటు. ఇట్లా తానొక 'డిస్కవర్ చానల్‌'గా సిరిసిల్లలో పాత్రికేయ ప్రపంచంలో జీవించి మరణించిన వ్యక్తి. మహారాష్ట్ర గవర్నర్ అయిన విద్యాసాగర్ రావు గారి పుస్తకం బయటకు రావడంలోనే కాదు, అందరి పుస్తకాల్లో కనపడని నెమలీక మా నాగభూషణం అన్న అని ఆభిమానంగా చెప్పుకోవాలనిపిస్తోంది.

+++

అంతేకాదు, తాను చురుకైన వ్యక్తి. ఓపిక గల మనిషి. కష్టజీవి. ఆయా మనుషులను, స్థలాలను దూరం ఎంతైనా, ప్రయాస ఎంత పడినా అది తన ఇష్టమైన కార్యంగా చేసుకుని చేసి పెట్టేవాడు. ఇదంతా కూడా ఎంతో శ్రద్ధగా, అభిరుచితో, సృజనాత్మకంగా చేసేవాడు. అట్లా సిరిసిల్ల డివిజన్‌లో తాను డిస్కవర్ చేసిన వార్తలు, వార్తా కథనాలు, ప్రత్యేక కథనాలు అన్నీ కూడా మిగతా వాళ్లను అబ్బుర పరిచినట్లే నన్నూ అశ్చర్య చకితుడిని చేసేవి. అయితే, నేను వాటినుంచి ప్రేరణ పొంది, సామాన్యుల జీవితాల్లోని అసామాన్యతను, మామూలు విషయాల్లోని విశిష్టతను దర్శించేటోడిని. ఈ నైపుణ్యం నేను సంతరించుకోవడంలో కవులు, కళాకారులు, రచయితలు, దర్శకులు ఎంతమంది ఉన్నా కూడా నాకు తవుటు నాగభూషణం అన్ననే తొలుత మనసులోకి వచ్చేటోడు. అన్న దీన్ని ఎట్లా చూస్తాడు? దీన్ని ఎంత చక్కగా రాస్తాడు? ఎట్లా ప్రచురించి ప్రజల వద్దకు చేరుస్తాడు? అని ఆలోచించేటోడిని. ఆయన ఆలోచనా దృక్పథాన్ని నేను కొంచెం కొంచెం అవగాహనలో పెట్టుకుంటూ చిన్నగా నేనూ ఒక విలేకరిగా, తర్వాత ఫీచర్ రైటర్‌గా, అటు తర్వాత రచయితగా, ఫొటోగ్రాఫర్‌గా మారగలిగానంటే, ఈ మార్పులో తన అందెవేసిన చేయిని నేను అందుకుని నడిచానని చెప్పాలి.

+++

'కోళ్ల మంగారం మరికొందరు' పుస్తకం నుంచి మీరు సామాన్యులు కావడం ఎలా? అన్న నా పుస్తకం దాకా ప్రత్యేకంగా మెన్షన్ చేయకుండా ఆయన నుంచి నేను తీసుకున్న రచనా వ్యక్తిత్వానికి ఇవ్వాళ నేను నిర్భయంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే, ఆయన బతికున్నప్పుడు అంగీకరించేవాడు కాదు. 'ఏ...నాదేం ఉంది?' అని తిరస్కరించేటోడు. 'మనం సామాన్యులం' అని ఆయన చెప్పకనే చెప్పేటోడు. దాన్ని బట్టి నేను మౌనంగా ఉండేవాడిని. కారణం, ఎవరైనా తాను సామాన్యుడిని అని అంటే నాకు అర్థమయ్యేది...ఆ వ్యక్తి ఎంత బాధ్యతగల పౌరుడో అని!

నిజంగానే ఆయన చాలా సామాన్యంగా అద్భుతంగా కనిపించేటోడు. ఉల్లాసంగా ఉంటేటేడో. ఎప్పుడు చూసినా ఆశావాదిగా కనిపించేటోడు. నిర్భయంగా సంచరించేటోడు. శషభిషలు లేకుండా ప్రవర్తించేటోడు. ఎంత వారైనా కూడా వాళ్లను సామాన్యంగానే చూసేవాడు. ఏదీ అద్భుతం, అపూర్వం కాదు తన దృష్టిలో. అందువల్లే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా తన వద్ద సామాన్యంగా ప్రవర్తించేవారు. సామాన్యతే సిసలైన వార్త, వార్తా కథనం, రచనా-ఫొటో అని ఆయన చెప్పకనే చెప్పేటోడు. అట్లా తన ప్రవర్తన ద్వార ఒదిగి ఉండటం అంటే ఏందో తాను మనల్ని ఎదిగిస్తూ గ్రహింపజేసేటోడు.

+++

పాత్రికేయాన్ని 'లిటరేచర్ ఇన్ హర్రీ' అంటాం. తక్షణ సాహిత్యంగా పేరు పడిన పాత్రికేయంలో ఆయన ఒదిగి, ఒరిగి పోయిన కారణంగా తాను రాసింది సాహిత్యం కాకుండా పోయింది గానీ, పాత్రికేయ రచనలో ఆయన అత్యుత్తమ రచయితా, కవి అని నేనీ సందర్భంగా రాస్తున్న. విషయాన్ని ముందుగా పసిగట్టడంలో, విషయ సేకరణ విషయంలో ఏక వ్యక్తి సైన్యంలా చొరవ చూపడంలో, అర్థం చేసుకున్నదాన్ని సాకల్యంగా విశ్లేషించుకుని ఏది అవసరమో, దేన్ని ఎంత ఇవ్వాలో తెలిసి, అంత మాత్రమే తెల్లారితే ప్రింటయ్యే దృష్టితో ఇచ్చి పని పూర్తి చేయడంలో, ఒక్క మాటలో డెడ్‌లైన్‌లోగా విషయాన్ని వార్తగా రాసి, అచ్చుకు పంపి, అచ్చయిన వార్తతో పని జరిగేలా చేసిన తక్షణ సాహిత్యవేత్త, పాత్రికేయుడు తవుటు నాగభూషణం.

నాకు బాగా గుర్తుంది. ఆయన దగ్గర తొలినాళ్లలో రాసుకున్న రచనలు ఉన్నయి. నోట్స్‌కూడా ఉన్నయి. వాటిని మళ్లీ చూడాలి. గమనించాలి. అంతేకాదు, ఆయన ఫీల్డ్‌స్టోరీలు చాలా విశిష్టమైనవి. లాథూర్ భూకంప కథనాలు కూడా గొప్పవి. తన రచనలన్నీ గమనిస్తే 'ఈనాడు' విలేకరి పరిధిలో తనను తాను కుదించుకోకుండా ఉంచుకునేందుకు తాను పడ్డ కష్టం కనిపిస్తుంది. వాటిని వెలికితెస్తే తనదైన 'విలేఖనం' ఎంత విశిష్టమైందో భవిష్యత్తరాలకు అందజేసిన వాళ్లం అవుతాం. అప్పుడుగానీ తాను ఈనాడు మాత్రమే కాదని, నిన్నా-రేపుల మధ్య బతికిన నేడు అనీ రుజువవుతుంది. ఆ నమ్మకంతోనే ఆయనకు నివాళి రాయడం అంటే తాను ఒక వార్తగా మసక బారడం కానే కాదని, అది చిరకాలం బతికే రచన. అందుకే, ఈ వ్యాసం శీర్షిక -'రేపు', 'మాపు', 'ఈనాడు' -అని పెట్టుకోవచ్చు. కానీ, 'అన్న'ను మించిన మాట లేదు. అందుకే 'అన్నా'...నీకీ వ్యాసం.

చివరకు మొదటికే వస్త. ఆయన భార్య పద్మక్కకు, ఇద్దరు కూతుళ్లకు, కొడుకుకు, తన తల్లికీ, టివి. నారాయణ మిగతా సోదరులకు, బంధుమిత్రులం అయిన మా అందరికీ తన మరణం పెద్ద లోటు. దాన్ని అనుక్షణం ఫీలవడమో మేం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ముగింపు పలుకులు చెప్పబుద్దవుతున్నది.

నాకూ, నా శ్రీమతి సుమబాలకు తోడబుట్టిన సొంత అన్నలు లేరు. నిజంగానే ఆయన మరణంతో ఇక లేరని రాయక తప్పడం లేదు. పద్మక్కా! వచ్చి కలుస్తం...తొందర్లోనే.

+++

English summary
Tributes payed to journalist Tavutu NagaBhushanam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X