కవిత 'బిట్స్ అండ్ క్లిక్స్'

ఈ మెయిల్, ఈ గవర్నెన్స్
ఈ ఫైలింగ్
అఫ్గనిస్తాన్ నుంచి లాడెన్ వరకు
అంతా మానిటరే
అమ్మను చూడాలన్నా
అమ్మాయితో మాట్లాడాలన్నా
మానిటరే
ఆటలు ఆనందాలు
అన్నీ మానిటర్‌లోనే
లెక్కలు చేయాలన్నా
లేడీలా పరిగెట్టాలన్నా మానిటరే
ఇక,
మట్టికి, సున్నానికి స్థానం లేదట
మాంసానికి రక్తానికి విలువ లేదట
అంతా బిట్స్ అండ్ క్లిక్స్
ఒక్క క్లిక్‌తో ప్రాణాన్ని రక్షించడమే కాదు
ప్రాణాలని తీయవచ్చట
ఒక్క క్లిక్‌తో
ప్రపంచ గమనాన్నే కాదు
పరిణామ క్రమాన్నే మార్చవచ్చట
ఇక,
ప్రపంచం మౌస్‌కి దాసోహమట
ఏదీ కరప్ట్ కాదట
కరప్ట్ అయినా కొత్తది సృష్టించవచ్చట
సృష్టి ఎక్కడో లేదట
కంప్యూటర్‌లోనే ఉందట
అంతా ఆన్‌లైన్
మనిషి మౌస్ అయి కుంచించుకుపోయినట్టు
మౌస్ మనిషై శాసిస్తున్నట్టు
మౌసే మనిషిని కాటేస్తున్నట్టు ఫీలింగ్
అంతా బిట్స్ అండ్ క్లిక్స్
మనిషి గుండె ఆగిపోయినా
ఫర్వా లేదట
కంప్యూటర్ల గుండె ఆగిపోకూడదట
ఒక్క క్షణం కంప్యూటర్ ఆగిపోతే
ప్రపంచం గుండె విస్ఫోటనం
అవుతుందట
- రాజేందర్ జింబో












Click it and Unblock the Notifications