మస్క్ మామ ఇచ్చిపడేశాడు: వాట్సాప్‌కు గుడ్ బై.. XChatకు వెల్కమ్!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. సోషల్ మీడియా దిగ్గజం 'X' (గతంలో ట్విట్టర్) నుంచి సరికొత్త మెసేజింగ్ యాప్ 'XChat'ను ఏప్రిల్ 17న విడుదల చేయబోతున్నారు. గోప్యతకు పెద్దపీట వేస్తూ, వాట్సాప్ వంటి యాప్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా దీనిని రూపొందించారు.
ప్రారంభంలో ఈ యాప్ కేవలం ఐఫోన్, ఐప్యాడ్ (iOS) వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వెర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆపిల్ యాప్ స్టోర్‌లో ఇప్పటికే ఈ యాప్ లిస్ట్ అయింది, ఆసక్తి గల వారు ముందస్తు నమోదు (Pre-register) చేసుకోవచ్చు. దీని ఇంటర్‌ఫేస్ చూడటానికి ఆపిల్ 'ఐమెసేజ్' లాగే చాలా సింపుల్‌గా, ఆకర్షణీయంగా ఉండబోతోంది.

XChat ప్రత్యేకతలు ఇవే:
- నో ఫోన్ నంబర్: ఈ యాప్‌లో సైన్ అప్ అవ్వడానికి మీ ఫోన్ నంబర్ అవసరం లేదు. మీ 'X' ఖాతాతో నేరుగా లాగిన్ అవ్వొచ్చు.
- నిజమైన గోప్యత: ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. మీ డేటాను ట్రాక్ చేయడం కానీ, ప్రకటనలు చూపించడం కానీ ఉండవు.
- స్క్రీన్‌షాట్ బ్లాకింగ్: అవతలి వ్యక్తి మీ చాటింగ్‌ను స్క్రీన్‌షాట్ తీయకుండా అడ్డుకునే ఫీచర్ ఇందులో ఉంది.
- పెద్ద గ్రూపులు: ఒకే గ్రూప్‌లో గరిష్టంగా 481 మందితో చాట్ చేయవచ్చు. సందేశాలను ఎడిట్ చేసే లేదా డిలీట్ చేసే సదుపాయం కూడా ఉంది.
- అదృశ్యమయ్యే సందేశాలు: నిర్ణీత సమయం తర్వాత సందేశాలు వాటంతట అవే డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. హిబ్రూతో సహా 46 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది.
వివాదాల్లో వాట్సాప్.. మస్క్ విమర్శలు
మరోవైపు, ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం అమెరికా కోర్టులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటోంది. మెటా సంస్థ తన వినియోగదారుల సందేశాలను రహస్యంగా మూడవ పక్షాలతో పంచుకుంటోందని, ఇందుకోసం ఒక 'బ్యాక్‌డోర్'ను వాడుతోందని క్లాస్-యాక్షన్ వ్యాజ్యం దాఖలైంది. మెటా ఈ ఆరోపణలను కొట్టిపారేసినప్పటికీ, ఎలాన్ మస్క్ మాత్రం "మెటాను నమ్మలేము" అంటూ ఘాటుగా విమర్శించారు. టెలిగ్రామ్ అధినేత పావెల్ దురోవ్ కూడా వాట్సాప్ భద్రతపై గతంలోనే అనుమానాలు వ్యక్తం చేశారు.
మస్క్ 'సూపర్ యాప్' కల
X ను కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా కాకుండా, అన్ని సేవలు అందించే ఒకే ఒక్క 'సూపర్ యాప్'గా మార్చాలనేది మస్క్ లక్ష్యం. ఇందులో భాగంగానే ఇప్పుడు మెసేజింగ్ యాప్‌ను తెస్తున్నారు. భవిష్యత్తులో ఈ యాప్ ద్వారానే ఒకరికొకరు డబ్బులు పంపుకునే (పీర్-టు-పీర్ చెల్లింపులు) ఆర్థిక సేవలను కూడా ప్రారంభించే సంకేతాలు ఇచ్చారు.
వాట్సాప్ చుట్టూ భద్రతా పరమైన అనుమానాలు ఉన్న తరుణంలో, మస్క్ తీసుకొస్తున్న ఈ 'XChat' ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications