ఆజామూ.. నీకెక్కడో సుడి ఉందిరా: భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ జట్టులో భారీ ప్రక్షాళన
దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త జట్టును ప్రకటించింది. మొన్నటి ఆసియా కప్ ఫైనల్ లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న టీమ్ లో భారీగా మార్పులు చేర్పులు చేసింది. ఈ జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. అనుభవజ్ఞుడైన బాబర్ ఆజమ్‌కు తిరిగి జట్టులో చోటు లభించింది. షహీన్ షా అఫ్రిది కూడా సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి పునరాగమనం చేశాడు.
వెస్టిండీస్‌తో జరిగిన గత టెస్టు సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 45 పరుగులు మాత్రమే చేశాడు బాబర్ ఆజమ్. దీని దెబ్బకు జట్టులో స్థానం కోల్పోయాడు. టీ20 స్పెషలిస్ట్ గా పేరున్నప్పటికీ.. అదే ఫార్మట్ లో కొనసాగిన ఆసియా కప్ లో చోటు దక్కించుకోలేకపోయాడు ఆజమ్. దాదాపుగా అతని కేరీర్ ముగిసినట్టేననే అభిప్రాయాలు సైతం వెలువడ్డాయి. అతన్ని పూర్తిగా పక్కన పెట్టొచ్చనే ప్రచారమూ జరిగింది.

ఆసియా కప్ ఫైనల్ రిజల్ట్ మాత్రం పూర్తి భిన్నం. బాబర్ స్థానంలో జట్టులోకి వచ్చిన సయీం అయూబ్ ఘోరంగా విఫలం అయ్యాడీ టోర్నమెంట్ లో. ఫలితంగా మరోసారి బాబర్ ఆజమ్ నే నమ్ముకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేసింది. షహీన్ షా అఫ్రిది కూడా టెస్ట్ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత అతను టెస్ట్ మ్యాచ్ లు ఆడబోతోన్నాడు. ఆసియా కప్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన దీనికి కారణం.
లెఫ్ట్ హ్యాండర్ షాన్ మసూద్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడీ జట్టుకు. అతని నాయకత్వంలో పాకిస్థాన్ ఇప్పటివరకు ఆడిన 12 టెస్ట్ మ్యాచ్ లల్లో గెలిచింది మూడు మాత్రమే. అయినప్పటికీ పీసీబీ అతనిపై నమ్మకం ఉంచింది. అతనికే జట్టు పగ్గాలను అప్పగించింది. టెస్ట్ స్పెషలిస్టులను జట్టులోకి తీసుకుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో పాకిస్థాన్ రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి టెస్టుకు లాహోర్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ రావల్పిండిలో జరుగుతుంది. దీని తర్వాత అక్టోబర్ 28 నుండి నవంబర్ 8 వరకు ఈ రెండు జట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరుగుతాయి.
పీసీబీ తాజాగా ప్రకటించిన ఈ జట్టులో- షాన్ మసూద్ (కేప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆసిఫ్ అఫ్రిది, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హసన్ అలీ, ఇమాముల్ హక్, కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నౌమాన్ అలీ, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, సవూద్ షకీల్, షహీన్ షా అఫ్రిది ఉన్నారు.












Click it and Unblock the Notifications