దెబ్బ కొట్టిన ఏజ్ ఫ్యాక్టర్- ఆ క్రికెటర్ పై బీసీసీఐ బ్యాన్: ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తొలగింపు
దేశవాళీ క్రికెట్‌లో వయో పరిమితి మోసాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. వయసు దాచిపెట్టిన పలువురు క్రికెటర్లపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిషేధం విధించింది. టీమిండియా అండర్-19 లెగ్‌స్పిన్నర్ రోహిత్ యాదవ్‌తో పాటు మరో 64 మంది ఈ జాబితాలో ఉన్నారు. ఈ మేరకు బీసీసీఐ తరఫున క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నిషేధిత ఆటగాళ్ల జాబితాలో 2022 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యుడు, పేసర్ రవికుమార్ కూడా ఉండటం సంచలనంగా మారింది.
క్యాబ్ దేశవాళీ సీజన్ కంటే ముందే నిర్వహించిన క్రీడాకారుల వయస్సు నిర్ధారిత పత్రాల పరిశీలన సమయంలో ఈ తీవ్ర ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత అండర్-19 జట్టులో రోహిత్ యాదవ్ సభ్యుడు కూడా. అతని వయస్సు వ్యత్యాసం బయటపడటంతో త్వరలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగాల్సిన ప్రతిష్టాత్మక వన్డే, నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్ ముందే రోహిత్‌ను సెలక్టర్లు జట్టు నుండి తప్పించారు.

బెంగాల్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రోహిత్ యాదవ్ సమర్పించిన పత్రాలకు, అతని వాస్తవ వయసుకు మధ్య దాదాపు 27 నెలల భారీ వ్యత్యాసం ఉన్నట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధారాలతో సహా నిర్ధారించింది. ఈ రెండేళ్ల నిషేధ నిర్ణయాన్ని తక్షణమే అమలు కానుంది. దీనిపై బీసీసీఐ అనుబంధంగా ఉన్న దేశంలోని అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు సమాచారం అందించారు. రోహిత్ సహా ఆ 64 మంది క్రికెటర్లు కూడా దేశంలో ఏ జట్టు తరఫున కూడా అధికారిక మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకుండా పోయింది.
రోహిత్ యాదవ్ వయో వ్యత్యాసంతో పాటు ఎడమచేతి వాటం స్టార్ పేసర్ రవికుమార్ వ్యవహారం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. 2022 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుపై అత్యుత్తమ బౌలింగ్ ను ప్రదర్శించాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజా తనిఖీలలో రవికుమార్ అసలు వయసుకు, క్యాబ్ కు సమర్పించిన డాక్యుమెంట్ల మధ్య ఏకంగా 40 నెలలకు పైగా తేడా ఉన్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో అండర్-19 విభాగంలో రవికుమార్ మొదటి నుంచి సాధించిన ఘనతలు, రికార్డులన్నింటినీ 2025-26 సీజన్ వరకు రద్దు చేస్తున్నట్లు క్యాబ్ ప్రకటించింది. 2022లో బెంగాల్ సీనియర్ జట్టులో అరంగేట్రం చేసిన రవికుమార్ 2023 తర్వాత బరిలోకి దిగలేదు. ప్రస్తుతం రవికుమార్, రోహిత్‌లతో పాటు అసోసియేషన్ పరిధిలోని దాదాపు 64 మంది క్రికెటర్ల గుర్తింపులను క్యాబ్ వయో మోసాల తనిఖీలలో పూర్తిగా రద్దు చేసింది.













Click it and Unblock the Notifications