సచిన్ తరువాత రచిన్- అరంగేట్రంలోని అరుదైన రికార్డ్..!!
సిమ్లా: ఐసీసీ ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ మరో ఓటమిని అందుకుంది. ఆస్ట్రేలియాపై పోరాడి ఓడింది. గెలవాలంటే 389 పరుగులు చేయాల్సిన స్థితిలో బ్లాక్ క్యాప్స్ చూపిన తెగింపు అద్భుతం. అంత భారీ స్కోర్ చేసినప్పటికీ.. అయిదు పరుగుల తేడాతో మాత్రమే ఆస్ట్రేలియా నెగ్గిందంటే.. న్యూజిలాండ్ ఏ స్థాయిలో పోరాడిందో అర్థం చేసుకోవచ్చు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లల్లో 388 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్- 109, డేవిడ్ వార్నర్- 81 పరుగులతో చెలరేగారు. వారిద్దరూ అవుట్ అయిన తరువాత స్కోర్ బోర్డ కొంచెం నెమ్మదించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్- 41, జోష్ ఇంగ్లిస్- 38, కేప్టెన్ పాట్ కమ్మిన్స్- 37, మిఛెల్ మార్ష్-36 పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఏ దశలోనూ మడమ తిప్పలేదు. ఓపెనర్లు డెవాన్ కాన్వే- 28, విల్ యంగ్- 32 పరుగులతో మంచి పునాది వేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర-116, డారిల్ మిఛెల్- 54, జేమ్స్ నీషమ్- 56 పరుగులతో చెలరేగారు. చివరి ఓవర్ వరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లగలిగారు. ఆస్ట్రేలియాకు వెన్నులో వణుకు పుట్టించారు.
ఈ మ్యాచ్‌లో మరోసారి రచిన్ రవీంద్ర మరోసారి చెలరేగాడు. సెంచరీతో కదం తొక్కాడు. 89 బంతుల్లో అయిదు భారీ సిక్సర్లు, తొమ్మిది బౌండరీలతో 116 పరుగులు చేశాడు. పాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో లాంబుషెన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కమ్మిన్స్ సంధించిన స్లోయర్ డెలివరీని భారీ షాట్ ఆడాడు గానీ పవర్ సరిపోలేదు. గాల్లోకి లేచిన బంతిని లాంగ్ ఆన్ బౌండరీ లైన్ వద్ద లాంబుషేన్ అందుకున్నాడు.
ఈ వరల్డ్ కప్‌లో రచిన్ రవీంద్ర సాధించిన రెండో సెంచరీ ఇది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై అతను వంద పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇదే ధర్మశాల స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతను హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 87 బంతుల్లో 75 పరుగులు చేశాడు.
ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో రచిన్ రవీంద్ర 406 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 23 సంవత్సరాల వయస్సులో ఓ ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో 400లకు పైగా పరుగులు చేసిన క్రికెటర్లల్లో అతను రెండోవాడు. గతంలో సచిన్ టెండుల్కర్ ఈ ఘనతను సాధించాడు. ఇప్పుడు వరల్డ్ కప్ అరంగేట్రంలోనే ఈ రికార్డును సమం చేశాడు రచిన్.












Click it and Unblock the Notifications