హాకీ వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన భారత్.. 52 ఏళ్ల నిరీక్షణకు తెర!
Hockey World Cup 2026: బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ వరల్డ్ కప్ 2026లో భారత మహిళల హాకీ జట్టు చారిత్రాత్మక ప్రదర్శన చేసింది. ఈ టోర్నీలో ఐదో స్థానంలో నిలిచి.. గత 52 ఏళ్లలో టోర్నీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసినందుకు గానూ భారత జట్టుకు హాకీ ఇండియా రూ.50 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది.
సలీమా టేటే కెప్టెన్సీ భారత హాకీ జట్టు 5,6 స్థానాల కోసం జరిగిన పోరులో ప్రపంచ 5వ ర్యాంక్ జట్టు జర్మనీని 3-1 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. 1974లో జరిగిన మొదటి ఎడిషన్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరల్డ్ కప్ లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ముగింపు కావడం విశేషం. ఈ టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రతిభ చూపిన భారత మహిళల హాకీ జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడిపోయింది. చైనా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో మ్యాచ్‌లను డ్రా చేసుకోగా.. దక్షిణాఫ్రికాపై 6-1 తేడాతో భారీ విజయం సాధించింది. చివరిగా చీఫ్ కోచ్ జోర్డ్ మారిన్ పర్యవేక్షణలో జర్మనీని చిత్తు చేసి ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది.

భారత మహిళ హాకీ జట్టు సాధించిన ఈ చారిత్రక విజయంపై హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీ ప్రశంసలు కురిపించారు. "ఇది భారత మహిళల హాకీకి అత్యంత చారిత్రాత్మక ఘట్టం. 52 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ లో ఐదో స్థానంలో నిలవడం అనేది ఆటగాళ్ల కష్టానికి, పట్టుదలకు, పోరాట పటిమకు నిదర్శనం. హాకీ ఇండియా తరఫున జట్టుకు రూ.50 లక్షల నగదు బహుమతిని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోత్సాహం భవిష్యత్తులో ఆటగాళ్లు మరింత మెరుగ్గా రాణించేందుకు స్ఫూర్తి ఇస్తుందని భావిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి భోలా నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని మేటి జట్లకు గట్టి పోటీనిస్తూ సలీమా బృందం దేశం గర్వపడేలా చేసిందని ఆయన ప్రశంసలు కురిపించారు. వారి శ్రమకు గుర్తింపుగానే ఈ బహుమతిని అందిస్తున్నామని.. రాబోయే ఆసియా క్రీడలపై దృష్టి సారించనున్న భారత జట్టుకు ఈ విజయం మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications