రోహిత్ మెడపై క్లీన్ స్వీప్ కత్తి
IND vs NZ: భారత్‌పై టెస్ట్ సిరీస్‌ను గెలిచిన ఉత్సాహంలో ఉంది న్యూజిలాండ్. బెంగళూరు, పుణేల్లో జరిగిన రెండు టెస్టుల్లో విజయఢంకా మోగించింది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక మూడో టెస్ట్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన రెండింట్లోనూ న్యూజిలాండ్ తిరుగులేని విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో, రెండో గేమ్‌లో 107 పరుగులతో భారత్‌ను మట్టికరిపించింది. అదే ఊపులో మూడో టెస్ట్ కోసం సన్నాహకాల్లో నిమగ్నమైంది.

ముంబైలోని వాంఖడే స్టేడియం దీనికి వేదిక. నవంబర్ 24వ తేదీన ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. వరుస పరాజయాల బారిన పడిన టీమిండియాను ఇక్కడ కూడా ఓటమి రుచి చూపించాలనే పట్టుదలతో ఉన్నారు బ్లాక్ క్యాప్స్. ఈ టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో గెలుచుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది భారత జట్టు. క్లీన్ స్వీప్‌ను తప్పించుకోవాలంటే ఖచ్చితంగా గెలవడమో లేక మ్యాచ్‌ను డ్రా చేసుకోవడమో జరిగి తీరాలల్సిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. పైగా కేప్టెన్ రోహిత్ శర్మ బాగా అచ్చొచ్చిన హోమ్ పిచ్‌పై మూడో టెస్ట్‌ను ఆడనుంది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కీలక మార్పులు చేర్పులు చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. జట్టులోకి స్టార్ పేస్ బౌలర్ హర్షిత్ రాణాను తీసుకుంది. హుటాహుటిన అతన్ని ముంబైకి పిలిపించుకుంది. జట్టుతో చేరాల్సిందిగా సూచించింది. తుదిజట్టులోకి హర్షిత్ రాణాను తీసుకుంటే జస్‌ప్రీత్ బుమ్రా లేదా మహ్మద్ సిరాజ్‌లల్లో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి.
తొలి రెండు టెస్టుల్లో పరాజయంతో తీవ్ర ఒత్తిడిలో టీమిండియా. సొంత గడ్డపై క్లీన్ స్వీప్ బారి నుంచి తప్పించుకోవడానికి సర్వశక్తులనూ ఒడ్డాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి- కేప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ బ్యాక్‌బోన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై అందరి దృష్టీ నిలిచింది. ఈ త్రిమూర్తులు ఎలాంటి మేజిక్ చేస్తారనే ఉత్కంఠత నెలకొంది.
రెండు మ్యాచ్‌లల్లో ఓటమితో రోహిత్ శర్మ తీవ్ర విమర్శలకు గురయ్యాడు. బెంగళూరు టెస్ట్ రెండో ఇన్నింగ్ తప్పితే ఏ మాత్రం తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా అతనిపై ముప్పేట దాడికి దిగారు నెటిజన్లు. రిటైర్ కావాలనే డిమాండ్ సైతం వినిపించింది.
వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే రోహిత్ మళ్లీ గాడిన పడక తప్పదు. కత్తి మీద సాములా మారిందతని పరిస్థితి. అటు కేప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా సత్తా చాటాల్సిందే. ఇందులోనూ విఫలమైతే ఇక రిటైర్మెంట్ తప్పకపోవచ్చనే అభిప్రాయాలు సైతం జోరుగా వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications