IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్..!
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఏదో వెలితి కనిపిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ గా ధోనీ స్ధానంలో రుతురాజ్ గైక్వాడ్ ను తీసుకొచ్చిన సీఎస్కే ఆడిన ఆరు మ్యాచ్ ల్లో నాలుగు గెలిచి రెండు ఓడిపోయింది. కెప్టెన్సీ ఒత్తిడి నుంచి బయటపడ్డ ధోనీ మెరుపులు మెరిపిస్తున్నా పాయింట్ల పట్టికలో మాత్రం చెన్నై ఆగ్రస్ధానానికి చేరుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో జట్టుకు తాజాగా మరో షాక్ తగిలింది.
ఈసారి జట్టులో కీలకంగా భావిస్తున్న న్యూజీలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే బొటన వేలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఐపీఎల్ కు ముందే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 టోర్నీలో బొటన వేలికి గాయం కావడంతో చికిత్స పొందుతున్న డెవాన్ కాన్వే ఇంకా జట్టులోకి రాలేదు. గాయం తీవ్రత దృష్టా అతను టోర్నీకి దూరం కానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అంతే కాదు కాన్వే స్ధానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా ఎంపిక చేసింది.

చెన్నె సూపర్ కింగ్స్ బ్యాటర్ డెవాన్ కాన్వే గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతని స్ధానంలో ఇంగ్లండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్ ను తీసుకునేందుకు బీసీసీఐ అంగీకరించింది. కాన్వే సీఎస్కే తరఫున గత రెండు సీజన్లు ఆడాడు. వీటిలో 23 మ్యాచ్ లు ఆడి 924 పరుగులు చేసాడు. ఇందులో 9 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. గత సీజన్ లో చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించిన కాన్వే.. మరోసారి టైటిల్ నిలబెట్టుకోవడంలో కీలకమవుతాడని భావించినా గాయం వల్ల టోర్నీకే దూరమయ్యాడు.












Click it and Unblock the Notifications