చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ - టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..!!
IPL 2026 సీజన్‌లో వరుస విజయాలతో మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న తరుణంలో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే కీలక ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతున్న చెన్నైకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలో వరుసగా మూడు ఓటములతో కుదేలైన చెన్నై సూపర్ కింగ్స్,గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది.అయితే,తాజాగా ఆ జట్టు ప్రధాన పేసర్ ఖలీల్ అహ్మద్ క్వాడ్రిసెప్స్ (Quadriceps) గాయం కారణంగా లీగ్ నుంచి వైదొలగడం ఆ జట్టు యాజమాన్యాన్ని,అభిమానులను ఆందోళనలో పడేసింది.

ఏం జరిగింది?
కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన గత మ్యాచ్‌లో చెన్నై 32 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, ఆ మ్యాచ్‌లోనే ఖలీల్‌కు గాయమైంది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేస్తున్న సమయంలో తన కుడి తుంటి భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో,కేవలం ఐదు బంతులు మాత్రమే వేసి ఖలీల్ మైదానాన్ని వీడాల్సి వచ్చింది.మిగిలిన ఒక బంతిని గుర్జప్‌నీత్ సింగ్ పూర్తి చేశాడు.
రికవరీకి 12 వారాల సమయం..
"ఖలీల్‌కు గ్రేడ్ 2 టియర్ అయినట్లు నిర్ధారణ అయింది.దీని నుండి కోలుకోవడానికి కనీసం 10 నుండి 12 వారాల సమయం పడుతుంది"అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.ఈ సీజన్‌లో ఖలీల్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 2 వికెట్లు తీసినప్పటికీ,8.67 ఎకానమీతో చెన్నై బౌలర్లలో రెండో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.ముఖ్యంగా కొత్త బంతితో స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో ఆయనది కీలక పాత్ర.
గాయాల 'సూపర్' కింగ్స్
ఈ సీజన్ ప్రారంభం నుండి సిఎస్‌కేను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి:
- ఎంఎస్ ధోనీ: జట్టు వెన్నెముక ధోనీ 'కాఫ్ ఇంజూరీ'కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
- నాథన్ ఎల్లిస్:సీజన్ ప్రారంభానికి ముందే టోర్నీ నుండి వైదొలగగా,అతని స్థానంలో వచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా గాయం కారణంగా ప్రస్తుతం అందుబాటులో లేడు.
- డెవాల్డ్ బ్రెవిస్:ఈ యువ సంచలనం కూడా గాయం కారణంగా మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు తప్పవా?
ఖలీల్ స్థానంలో చెన్నై యాజమాన్యం కొత్త ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంది.ప్రస్తుతానికి జట్టులో ఉన్న సిమర్జీత్ సింగ్ లేదా తుషార్ దేశ్‌పాండేపై జట్టు మరింత భారం వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు స్పెన్సర్ జాన్సన్ కోలుకోకపోతే,చెన్నై బౌలింగ్ విభాగం మరింత బలహీనపడే అవకాశం ఉంది.
వరుస విజయాలతో టైటిల్ రేసులోకి దూసుకువద్దామనుకున్న సిఎస్‌కేకు,ఖలీల్ దూరం కావడం ఒక పెద్ద సవాలే.బౌలింగ్ విభాగంలో కొత్త బంతిని పంచుకునే ప్రధాన అస్త్రం లేకపోవడం ఆ జట్టు కెప్టెన్‌కు తలనొప్పిగా మారింది.అయితే,సంక్షోభంలో ఉన్నప్పుడు సరికొత్త వ్యూహాలతో తిరుగుబాటు చేయడం చెన్నైకి అలవాటే.మరి ఈ గాయాల గండం నుండి గట్టెక్కి 'ఎల్లో ఆర్మీ' ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుందో లేదో వేచి చూడాలి.














Click it and Unblock the Notifications