64 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్: స్టార్క్ నిప్పు కణికలు
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్‌లో మరోసారి తన సంచలన బౌలింగ్‌తో విరుచుకుపడ్డాడు. మెకాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజే నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. వెన్నులో వణుకు పుట్టించాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే లైన్ అండ్ లెంగ్త్ తో విజృంభించాడు. 22 బంతుల వ్యవధిలోనే అయిదు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. అతని బౌలింగ్ ధాటికి రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్ లో 64 పరుగులకే చాప చుట్టేసింది బంగ్లాదేశ్.
డార్విన్‌లో జరిగిన మొదటి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైన అనంతరం పుంజుకొంది ఆస్ట్రేలియా. తన తడాఖా చూపించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టులో బ్యాటింగ్ ఎంచుకుని విమర్శలు ఎదుర్కొన్న రికీ పాంటింగ్ వంటి దిగ్గజాల వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని కమిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ స్టార్క్ ఇన్నింగ్స్ మొదటి బంతికే షాద్మాన్ ఇస్లాంను పెవిలియన్ దారి పట్టించాడు.

ఈ అద్భుతమైన వికెట్‌తో టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక సార్లు వికెట్ తీసిన ఏకైక బౌలర్‌గా స్టార్క్ సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కెరీర్‌లో ఇలా మొదటి బంతికే వికెట్ తీయడం స్టార్క్‌కు ఇది నాలుగోసారి కావడం విశేషం. గతంలో శ్రీలంక, ఇంగ్లాండ్, భారత్‌పై ఈ అరుదైన ఘనతను సాధించాడు స్టార్క్.
అక్కడితో ఆగిపోలేదీ లెఫ్ట్ హ్యాండ్ పేసర్. బంగ్లాదేశ్ బ్యాటర్లపై మరింత ఒత్తిడి పెంచాడు. తన తదుపరి ఓవర్లలో తన్జీద్ హసన్, కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటోలను అవుట్ చేశాడు. ఆ తర్వాత మోమినుల్ హక్, లిటన్ దాస్‌లను పెవిలియన్‌కు పంపి 12 పరుగులకే బంగ్లాదేశ్ సగం వికెట్లు కోల్పోయేలా చేశాడు. 22 బంతుల్లోనే అయిదు వికెట్లు సాధించాడు. అలాగే.. టెస్టుల్లో అత్యంత వేగంగా అయిదు వికెట్లను పడగొట్టిన బౌలర్ గా రికార్డు నెకొల్పాడు.
చిట్టచివరి బ్యాటర్ షొరిఫుల్ ఇస్లాం చేసిన 14 పరుగులే బంగ్లాదేశ్ ఇన్నింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ అయిందంటే ఆస్ట్రేలియా బౌలింగ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. షాద్మన్ ఇస్లాం, తన్జీద్ హసన్, నాజ్ముల్ హొస్సైన్, లిట్టన్ దాస్.. డకౌట్ అయ్యారు. మొమినుల్ హక్- 9, ముష్ఫికుర్ రహీం- 5, మెహదీ హసన్ మిరాజ్- 11, హసన్ మహమూద్- 10, తైజుల్ ఇస్లాం- 11, తస్కిన్ అహ్మద్- ఒక పరుగు చేశారు.
ఈ అద్భుతమైన ప్రదర్శనతో స్టార్క్ టెస్టుల్లో మరో మైలురాయిని అధిగమించాడు. తన కెరీర్‌లో 440వ వికెట్ సాధించడం ద్వారా సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ (439 వికెట్లు) రికార్డును దాటేశాడు. ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టార్క్ పదో స్థానానికి చేరుకున్నాడు.













Click it and Unblock the Notifications