Shubman Gill: గిల్ రీఎంట్రీ ఎప్పుడు ? గుజరాత్ బిగ్ అప్డేట్ ..!
ఐపీఎల్ 2026 (IPL 2026)లో ఆరంభ దశ మ్యాచ్ లు జరుగుతున్నాయి. వీటిలో పలు జట్లు బోణీలతో ముందంజ వేస్తుండగా.. మరికొన్ని జట్లు మాత్రం ఓటముల బాటలో ఉన్నాయి. ఇందులో ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిన గుజరాత్ టైటాన్స్ (gujarat titans) కూడా ఉంది. జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ (Shubman Gill) తాజాగా రాజస్థాన్ తో మ్యాచ్ కు ముందు కండరాలు పట్టేయడంతో ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో గిల్ లేకపోతే గుజరాత్ గాడిన పడటం కష్టమని ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గిల్ పై అప్డేట్ ఇచ్చింది.
తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గిల్ లేకపోవడంతో 211 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక గుజరాత్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రెగ్యులర్ కెప్టెన్ గిల్ గైర్హాజరీలో రషీద్ ఖాన్ కెప్టెన్సీ బాధ్యత చూసుకున్నాడు. ఈ నేపథ్యంలో గిల్ గాయంపై స్పందించిన రషీద్ ఖాన్.. అతను కండరాల నొప్పితో బాధపడుతున్నాడని, త్వరలోనే తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు. జీటీ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 8న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనుంది. గిల్ ఈ మ్యాచ్ కల్లా అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ పార్థివ్ పటేల్ వెల్లడించాడు.

గిల్ కు గతేడాది నవంబర్ లో జరిగిన భారత్-దక్షిణాఫ్రికా టెస్టులో మెడ బెణికింది. రెండు రోజుల క్రితం కండరాలు పట్టేసాయి. రాబోయే మ్యాచ్ నాటికి అతను ఫిట్‌గా ఉంటాడని తాము ఆశిస్తున్నట్లు పార్దివ్ తెలిపాడు. ఇది అంత తీవ్రంగా కనిపించడం లేదు, కానీ గాయాల నిర్వహణ తన నైపుణ్యం కాదన్నాడు. అతను ఖచ్చితంగా కోలుకుంటాడని మాత్రం చెప్పగలనని పార్దివ్ వెల్లడించాడు. అంతకుముందు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్ మాథ్యూ హేడెన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక బ్యాటర్‌గా నాయకుడిగా ఎదిగిన తీరును ప్రశంసించాడు. అతని ఆలోచనా స్పష్టత, ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉంటూ అతని ఎదుగుదలకు దోహదపడ్డాయని అన్నాడు.












Click it and Unblock the Notifications