ఇమ్రాన్ ఖాన్ కోసం ఏకమైన లెజెండరీ ప్లేయర్లు- పాకిస్తాన్ పీఎంకు లేఖ
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, ఆ దేశ జట్టు మాజీ కేప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కోసం క్రికెట్ ప్రపంచం ఏకమైంది. 1992లోనే తన దేశానికి వరల్డ్ కప్ ను అందించిన ఇమ్రాన్ ఖాన్ సంక్షేమం కోసం గళమెత్తింది. ఆయనకు తక్షణమే వైద్య సేవలు అందించాలని అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కు లేఖ రాశారు. భారత్‌తో సహా పలు దేశాలకు చెందిన 14 మంది లెజెండరీ ప్లేయర్లు, ఆయా దేశాల జాతీయ జట్ల మాజీ కేప్టెన్లు లేఖ రాసిన వారిలో ఉన్నారు.
భారత్ తరఫున మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ ఈ లేఖపై సంతకాలు చేశారు. వారితో పాటు గ్రెగ్ చాపెల్, బెలిండా క్లార్క్, మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్, ఇయాన్ చాపెల్, అలెన్ బోర్డర్, మైఖేల్ బ్రేర్లీ, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూజ్, క్లైవ్ లాయిడ్, స్టీవ్ వా, జాన్ రైట్ వంటి హేమాహేమీలు సంయుక్తంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ లేఖను పంపించారు. వారందరూ దీనిపై సంతకం చేశారు. ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని ముక్తకంఠంతో నినదించారు.

ప్రస్తుతం జైలు ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, ముఖ్యంగా కుడి కంటి చూపు దెబ్బతిన్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ కెప్టెన్లు తమ లేఖలో పేర్కొన్నారు. జైలు పరిస్థితులు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. అర్హత కలిగిన నిపుణుల ద్వారా ఇమ్రాన్‌కు తక్షణమే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందించాలని లేఖ డిమాండ్ చేశారు. ఆయన వయస్సును దృష్టిలో ఉంచుకోవాలని, మానవతాదృక్పథంతో వ్యవహరించాలని కోరారు.
నిర్బంధ పరిస్థితులు, ఆయన ఎదుర్కొంటోన్న జైలు వాతావరణం.. అంతర్జాతీయస్థాయి చట్టాలు/ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అన్నారు. కుటుంబ సభ్యులతో ములాఖత్ కు అనుమతించాలని కూడా మాజీ కేప్టెన్లు విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ మాజీ కేప్టెన్లు ఎవరూ కూడా ఈ పిటిషన్‌పై సంతకం చేయలేదు గానీ వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షాహిద్ అఫ్రిది వంటి ఆటగాళ్లు మాత్రం ఇమ్రాన్ కు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలంటూ సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను కలుసుకోవడానికి కుటుంబ సభ్యులకు కూడా అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు.
1992లో పాకిస్తాన్‌కు ప్రపంచ కప్ అందించారు ఇమ్రాన్ ఖాన్. నాటి జట్టును కేప్టెన్ గా ముందుండి నడిపించారు. అద్భుతమైన ఆల్ రౌండర్. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టారు. పాకిస్తాన్ తెహ్రీక్- ఇ- ఇన్సాఫ్ పార్టీని నెలకొల్పారు. ఆ దేశ ప్రధాన మంత్రిగా పనిచేశారు. 2022లో అధికారం కోల్పోయారు. ఆ మరుసటి ఏడాదే అరెస్ట్ అయ్యారు. 2023 ఆగస్టు నుంచి జైలులో ఉంటోన్నారు. వివిధ నేరాల కింద 31 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటోన్నారు.












Click it and Unblock the Notifications