T20 World Cup 2024: పసికూన చేతిలో మట్టికరిచిన పాకిస్తాన్: థ్రిల్లింగ్ సూపర్ ఓవర్
USA vs PAK: టీ20 వరల్డ్ కప్ 2024లో పెను సంచలనం. పసికూన చేతిలో పాకిస్తాన్ మట్టికరిచింంది. పైగా ఈ టోర్నమెంట్‌లో ఆ జట్టుకు ఇదే తొలి మ్యాచ్ కూడా. తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ కప్‌ను అత్యంత అవమానకరంగా ఆరంభించింది.
ఇప్పుడిప్పుడే ప్రపంచ క్రికెట్‌లో బుడిబుడి అడుగులు వేస్తోన్న యూఎస్ఏ.. కొమ్ములు తిరిగిన పాకిస్తాన్‌ను ఓడించింది. ఆ జట్టుకు ఇది రెండో విజయం. ఈ విజయంతో సూపర్ 8కు మరింత చేరువ అయిందీ పసికూన. సౌరభ్ నేత్రవల్కర్.. ఈ మ్యాచ్ అసలు సిసలు హీరో. సూపర్ ఓవర్‌లో బాబర్ ఆజమ్ సేనను కట్టడి చేయగలిగాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఇన్నింగ్ పడుతూ లేస్తూ సాగింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అంచనాలకు భిన్నంగా.. బ్యాటర్లు ఏ మాత్రం రాణించలేకపోయారు. ఓపెనర్ కమ్ కేప్టెన్ బాబర్ ఆజమ్- 44, మిడిలార్డర్‌లో షాదబ్ ఖాన్- 40, చివర్లో షహీన్ షా అఫ్రిది- 23, ఇఫ్తికర్ అహ్మద్- 18 పరుగులు చేయగలిగారంతే.
అనంతరం ఛేజింగ్‌లో యూఎస్ఏ బ్యాటర్లు సత్తా చాటారు. ఓపెనర్ కేప్టెన్ మోనాంక్ పటేల్ హాఫ్ సెంచరీ చేశాడు. 38 బంతుల్లో ఒక సిక్స్, ఏడు ఫోర్లతో సరిగ్గా 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆండ్రీస్ గౌస్- 35, ఆరోన్ జోన్స్- 36 పరుగులు చేయడం 20 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి సరిగ్గా 159 పరుగులు చేసింది యూఎస్.
టై కావడంతో మ్యాచ్.. సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఇందులో తొలుత పాక్ బౌలింగ్‌కు దిగింది. పాక్ ఏస్ బౌలర్ మహ్మద్ అమీర్ బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతిని ఆరోన్ జోన్స బౌండరీ తరలించాడు. దీనితో అమీర్‌పై ఒత్తిడి పెరిగింది. పూర్తిగా తడబడ్డాడు. సూపర్ ఓవర్‌లో ఏకంగా మూడు వైడ్లను వేయడం దీనికి నిదర్శనం.
4వ బంతి వైడ్ ప్లస్ 2 పరుగులు, అయిదో బంతి వైడ్ ప్లస్ 2, 6వ బంతి వైడ్ ప్లస్ 3 పరుగులొచ్చాయి. సూపర్ ఓవర్‌లో యూఎస్ బ్యాటర్లు పెద్దగా కష్టపడకపోయినా 18 పరుగులొచ్చాయంటే.. అతని బౌలింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీల్డర్లు సైతం విఫలం అయ్యారీ ఓవర్‌లో.
మ్యాచ్ గెలవాలంటే 6 బంతుల్లో 18 పరుగుల చేయాల్సిన దశలో ఇఫ్తికర్ అహ్మద్, ఫకర్ జమాన్ బ్యాటింగ్‌కు దిగారు. అక్కడా చేతులెత్తేశారు. వికెట్ సైతం కోల్పోయింది. సూపర్ ఓవర్ మూడో బంతికి ఇఫ్తికర్ అహ్మద్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అతని తరువాత వచ్చిన షాదబ్ ఖాన్ ఆ వేగాన్ని కొనసాగించలేకపోయాడు. మొత్తంగా ఆ ఓవర్‌లో పాకిస్తాన్‌కు లభించింది 13 పరుగులే.












Click it and Unblock the Notifications