కాటేరమ్మ కొడుక్కి డేంజరస్ వైరస్..!!
SRH vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస షాకులను ఎదుర్కొంటోంది. దారుణ ఓటములను చవి చూసింది. ఈ టోర్నమెంట్ నుంచి ఇప్పటికే వైదొలగింది కూడా. ఈ సీజన్ ఏ మాత్రం అచ్చిరావట్లేదా జట్టుకు. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకొంది.
తొలి మ్యాచ్ అద్భుతంగా ఆడినప్పటికీ ఆ తరువాత చతికిలపడిందీ ఆరెంజ్ ఆర్మీ. ఇప్పటివరకు 11 మ్యాచ్ లను ఆడిన సన్ రైజర్స్.. గెలిచింది మూడింట్లోనే. ఏడు మ్యాచ్ లల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. వర్షం వల్ల ఒక మ్యాచ్ రద్దయింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్ అది. అది రద్దవడంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవాల్సొచ్చింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలివున్నాయి. ఈ నెల 19వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడాల్సి ఉంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్ దీనికి వేదిక. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
23వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 25న కోల్ కత నైట్ రైడర్స్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటితో లీగ్స్ దశ ముగిసిపోతుంది. చివరి మూడు మ్యాచ్ లల్లో గెలిచి పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది.
డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ జట్టుకు దూరం అయ్యాడు. ప్రమాదకర కోవిడ్ 19 వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరీ వెల్లడించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటోన్నాడు ట్రావిస్ హెడ్. భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 తాత్కాలికంగా వాయిదా పడిన నేపథ్యంలో తన స్వదేశానికి వెళ్లాడతను.
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉన్నందున ఇక్కడికి తిరిగి రావాల్సి ఉంది. కోవిడ్ బారిన పడటం వల్ల ప్రస్తుతం హెడ్.. ఐసొలేషన్ లో ఉంటోన్నాడని, సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదని డేనియల్ వెటోరీ తెలిపాడు. మిగిలిన మ్యాచ్ లల్లో ఆడతాడా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నాడు.












Click it and Unblock the Notifications