• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిఎం కిరణ్‌ ఎత్తుల ముందు జగన్ చిత్తు?

By Srinivas
|
Google Oneindia TeluguNews
Kiran Kumar Reddy
మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఎత్తుల ముందు చిత్తవుతున్నాడా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటు కిరణ్ ప్రభుత్వం క్రమంగా పదిలంగా తయారవుతుంటే అటు జగన్ వర్గం ఆందోళన చెందుతుంది. తన దయాదాక్షిణ్యాలపైనే ప్రభుత్వం ఆధారపడి ఉందన్న జగన్ వ్యాఖ్యలకు కిరణ్ కొత్త పొత్తులతో సమాధానం చెప్పడంతో జగన్ వర్గం ఖంగుతింటున్నట్టుగా కనిపిస్తోంది.

అయితే తమ ఆందోళన బయటకు కనిపించకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. పీఆర్పీ, కాంగ్రెస్ పొత్తును విమర్శిస్తోంది. అయితే పీఆర్పీతో కాంగ్రెస్ పొత్తు దివంగత వైఎస్ సమయంలోనే జరిగిందని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ లేఖ బయట పెట్టడంతో ఆత్మరక్షణలో పడింది. తాము ఏం మాట్లాడినా ఎదురు దెబ్బ తగలడంతో జగన్ వర్గం కొత్త కొత్త పాచికలు వేస్తుంది. దానిని కాంగ్రెస్ పార్టీ తిప్పి కొట్టడంతో జగన్ వర్గం అయోమయానికి గురవుతున్నట్టుగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి కిరణ్ రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజలలోకి వెళ్లడం, పార్టీ నేతలలో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులు, కాంగ్రెస్ నేతలు జగన్ పార్టీలో ఉంటూనే విమర్శలు చేసినప్పటికీ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. అయితే కిరణ్ పగ్గాలు చేపట్టిన తర్వాత జగన్‌పై కాంగ్రెస్ పార్టీ నేతలు విరుచుకు పడుతున్నారు. జగన్ పార్టీ వీడినప్పటికీ ఆయన చిన్నాన్న వ్యవసాయ శాఖమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్‌ను వీడక పోవడం జగన్‌కు పెద్ద షాక్. అయితే పదవులతో కుటుంబాన్ని చీల్చారనే ఆరోపణలు గుప్పించినప్పటికీ జగన్ ఏకంగా ముఖ్యమంత్రి పీఠం కోసమే పార్టీని వదిలాడని విషయం అర్థమైన ప్రజలు దానిని అంతగా పట్టించుకోలేదు.

ఆ తర్వాత జగన్‌కు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. 2014లో వైఎస్ పాలన తీసుకు వస్తానని చెబుతున్న జగన్ కడప జిల్లాలోనే సవాళ్లు ఎదుర్కొంటున్నాడు. దీంతో దివంగత ముఖ్యమంత్రి తనయుడు జగన్ ప్రత్యేక నియోజవకవర్గానికి పరిమితమై తన గెలుపుకు, తన తల్లి గెలుపుకు సమావేశాలు, రహస్య భేటీలు ఏర్పాటు చేస్తున్నారు. పరిస్థితిని దృష్ట్యా రోజుల తరబడి జిల్లాలో మకాం వేస్తున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ గెలుపుకోసం అభ్యర్థిస్తున్నారు.

పీఆర్పీ కలయికతో ప్రభుత్వం 2014 వరకు సాగిపోతుందని స్పష్టం కావటంతో జగన్ వర్గం ఎమ్మెల్యేలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ప్రత్యక్షంగా లక్ష్యదీక్షలో, జలదీక్షలో, జనదీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కొక్కరుగా జగన్‌కు అనుకూలంగా మాట్లాడటం తగ్గించినట్లుగా కనిపిస్తోంది. సిఎం సీమాంధ్ర రచ్చబండలో జగన్ వర్గం ఎమ్మెల్యేల పాల్గొనటం ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి కిరణ్ సైతం రాజకీయం ప్రదర్శిస్తూ అటు జగన్ వర్గం ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తూ మాట్లాడుతున్నారు.

జగన్ వర్గంవైపు పూర్తిగా వెళ్లారనుకున్న నియోజకవర్గాల్లో సిఎం ఇప్పటినుండే ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి సారించారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల విషయంపై కూడా మాట్లాడారు. తాము సిఎంకు దగ్గరగా లేకుంటే తమ వర్గం వారికి పోస్టులు లేకుండా పోతాయని కూడా పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కాంగ్రెస్‌తో చేతులు కలపడం వల్ల ఆయనకున్న ఇమేజ్‌ను కూడా దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు జగన్‌తో నడవడానికి వెనుకుంజ వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

వీటన్నింటికంటే క్రమంగా బయటపడుతున్న జగన్ అక్రమాలు ఎమ్మెల్యేలను బయట పెడుతున్నాయి. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ వేలకోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జగన్‌పై కఠినంగా వ్యవహరించవచ్చుననే భావనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. నిన్నటి వరకు ముప్పైకి పైగా ఉన్న జగన్ వర్గం ఇప్పుడు ఇరవైకి కాస్త అటూ ఇటూగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సిఎం కిరణ్ చాతుర్యంతో జగన్ వర్గం ఎమ్మెల్యేలు చివరకు మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

సిఎం రచ్చబండలో పాల్గొని ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడంతో పాటు బహిరంగ సభ ద్వారా ప్రభుత్వం, కాంగ్రెస్‌ విధానాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు వైఎస్‌ సొంతం కాదని, అవి కాంగ్రెస్ పథకాలనే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయడానికి సిఎం ప్రధాన్యత ఇస్తున్నారు. దీంతో ప్రజలు కూడా ఆ పథకాలు కాంగ్రెస్‌వి మాత్రమేనని, వైఎస్‌వి కాదనే వాస్తవం బోధపడుతోంది. దీంతో వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.

జగన్ పార్టీనుండి వెళ్లిపోయినప్పటికి చిన్నాన్న వివేకానంద కాంగ్రెస్‌తో ఉండటం, వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు కాంగ్రెస్‌వి అనే వాస్తవాన్ని ప్రజలు తెలుసుకోవటం, ఎంఐఎం, ప్రజారాజ్యం పార్టీల కలయికతో ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వెనకడుగు వేయడం, జగన్ వర్గం చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం నుండి ధీటుగా సమాధానం రావడం వంటి కారణంగా జగన్ వర్గం బెంబేలెత్తుతున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో జగన్ కొత్తవారిని తన వర్గంలో చేర్చుకోవడం కాకుండా ఇప్పుడు తన వద్ద ఉన్న వారినే రక్షించుకోవడానికి కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X