CA Exams 2024: సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలు, రిజిస్ట్రేషన్ల తేదీల ప్రకటన..!
ఈ ఏడాది మే నెలలో నిర్వహించే సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్ మీడియట్, సీఏ ఫైనల్ పరీక్షల తేదీల్ని, రిజిస్ట్రేషన్ల తేదీల్ని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏయే తేదీల్లో పరీక్షలు ఉంటాయి, నిబంధనలు ఏంటనే అంశాలపై కూడా ఐసీఏఐ స్పష్టత ఇచ్చింది. అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించిన వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ మే పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదల చేసింది. వీటిని అధికారిక వెబ్ సైట్ icai.orgలో అందుబాటులో ఉంచింది. దీని ప్రకారం సీఏ ఫౌండేషన్ కోర్సు పరీక్ష జూన్ 20, 22, 24, 26 తేదీల్లో నిర్వహించనున్నారు. సీఏ ఇంటర్మీడియట్ గ్రూప్ 1 పరీక్షలు మే 3, 5, 7 తేదీల్లో నిర్వహిస్తారు. అలాగే గ్రూప్ 2 పరీక్ష మే 9,11, 13 తేదీల్లో ఉంటుంది. సీఏలో తుది పరీక్ష అయిన ఫైనల్ పరీక్షల్లో గ్రూప్ 1 మే 2, 4, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 12 తేదీలలో ఉంటుంది.

ఆయా పరీక్షల కోసం రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 2న ప్రారంభమవుతాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 23తో ముగియనుంది. ఆన్‌లైన్ పరీక్ష దరఖాస్తు ఫారమ్‌లను 600 రూపాయల జరిమానాతో సమర్పించడానికి చివరి తేదీ మార్చి 2గా ప్రకటించారు.ఇంటర్మీడియట్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్క గ్రూప్‌కు రూ. 1500, రెండు గ్రూపులకు రూ.2700గా నిర్ణయించారు. ఫైనల్ ఒక్క గ్రూపుకు రూ.1800, రెండు గ్రూపులకు రూ.3300గా నిర్ణయించారు. ఫౌండేషన్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1500గా నిర్ణయించారు.
ఈసారి ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల అభ్యర్థులు జవాబు పత్రాల కోసం ఇంగ్లీష్ లేదా హిందీ మీడియాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉన్నందున సీఏ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. సార్వత్రిక ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత దీనిపై ఐసీఏఐ క్లారిటీ ఇవ్వనుంది.ఈసారి సీఏ పరీక్షలు అబుదాబి, బహ్రెయిన్, థింపు (భూటాన్), దోహా, దుబాయ్, ఖాట్మండు (నేపాల్), కువైట్, మస్కట్ వంటి ఎనిమిది విదేశీ పరీక్షా కేంద్రాలలో కూడా నిర్వహిస్తారు. అక్కడి స్ధానిక సమయాల ఆధారంగా పరీక్షలుంటాయి.












Click it and Unblock the Notifications