ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్- ఐఐటీ మద్రాస్, సోనీతో కలిసి ఉచిత స్కిల్ కోర్సు..!
దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధులను ఇప్పుడు నైపుణ్యాల కొరత వేధిస్తోంది. ఇందులో పలు కాలేజీలు ఈ లోటును అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొన్ని మాత్రం ఇందులో విఫలమవుతున్నాయి. దీంతో ఇంజనీరింగ్ చదువులు చదివి కూడా కంపెనీలకు అవసరమైన స్కిల్స్ కరవై చిన్నా చితకా ఉద్యోగాల కోసం వెంపర్లాడాల్సిన పరిస్దితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్, సోనీ ఇండియా ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఓ ఉచిత కోర్సు ఆఫర్ చేస్తున్నాయి.
IIT మద్రాస్ ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ఇవాళ సోనీ ఇండియా సాఫ్ట్‌వేర్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఓ కీలక కోర్సును ప్రకటించింది. పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా విద్యార్ధులను సన్నద్ధం చేసేందుకు వీలుగా సాంకేతిక విద్యతో ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడానికి ఇరు సంస్ధలూ ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. IIT-M ప్రకారం AI/ML, ప్రొడక్ట్ సెక్యూరిటీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ వంటి ఎంపిక చేసిన విభాగాలలో ఇరు సంస్ధలూ కలిసి సంయుక్తంగా శిక్షణ ఇస్తాయి. అలాగే ఈ కోర్సు కూడా పూర్తిగా ఉచితం. విద్యార్థులకు నిర్ణీత ప్రమాణాల ఆధారంగా స్టైపెండ్‌లు కూడా ఇవ్వనున్నారు. ఫినిషింగ్ స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం IIT-M ప్రవర్తక్, సోనీ ఇండియా 30 మంది విద్యార్థులను ఎంపిక చేస్తాయి.

ఈ కోర్సులో ట్రైనింగ్ రెండవ బ్యాచ్ ఈ నెల మూడవ వారంలో ప్రారంభమవుతుంది. దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 10, 2024. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sonyfs.pravartak.org.in ను చూడవచ్చు. IITM ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ అనేది సెన్సార్లు, నెట్‌వర్కింగ్, యాక్యుయేటర్స్, కంట్రోల్ సిస్టమ్స్‌పై టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌ను కలిగి ఉన్న సెక్షన్ 8 కంపెనీ. ఇది ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్‌పై నేషనల్ మిషన్ కింద భారత ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా నిధులు సమకూరుస్తుంది. అలాగే IIT మద్రాస్ ద్వారా నిర్వహింపబడుతోంది.












Click it and Unblock the Notifications