వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా పంచాయతి ఎందుకు తెగడం లేదు ?

By Pratap
|
Google Oneindia TeluguNews

why Telangana is not getting solution?
వస్తుంది అనుకున్న తెలంగాణా రాకుండా పోయింది. ‘‘నవ్వేవారి ముందు జారి పడ్డట్టూ'' అయ్యింది తెలంగాణా వారి పరిస్థితి. జనవరి 28న తెలంగాణా సంగతి తేల్చివేస్తామని చెప్పిన కేంద్రహోం మంత్రి సుషీల్‌ కుమార్‌ షిండే మాట తప్పడంతో తెలంగాణా జాయింట్‌ ఆక్షన్‌ కమిటి అనవాయితీగా రెండు రోజుల ‘సమరదీక్ష' నిర్వహించింది. వివిధ జాక్‌ల వారు రెండు రోజులు విడివిడిగా తెలంగాణా బంద్‌ పిలుపునిచ్చారు.

1. సమరదీక్ష తర్వాత పరిస్థితి ఏమిటంటే .... , కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు (పొన్నం ప్రభాకర గౌడ్‌, మధుగౌడ్‌, సిరిసిల్ల రాజయ్య, మంద జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జి. వివేక్‌, రాజ్‌గోపాల్‌రెడ్డి) తమ ఎం.పి. పదవులకు రాజీనామాలు చేస్తామని అన్నారు. కాని అది చిత్త శుద్ధిలేని ప్రకటన మాత్రమే. వారికే చిత్తశుద్ధి ఉంటే రాజీనామాను స్పీకర్‌కు పంపించి, ప్రభుత్వ సౌకర్యాలను పరిత్యజించాలి కాని వారు అలా చేయరు. రాజినామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాకు పంపిస్తామన్నారు.

2. కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీ మాట తప్పినందుకు తెలంగాణా మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని కేసిఆర్‌ సూచించారు. తీవ్ర పరుష పదజాలంతో తెలంగాణా రాష్ట్ర మంత్రులను ఏద్దెవా చేశారు. ‘‘ఇజ్జత్‌, మానం లేదా చీమునెత్తురు లేదా ? పదవులు లేకుంటే చస్తారా ? తెలంగాణా ఇవ్వని అధిష్టానానికి ఎంతకాలం గులాంగిరి చేస్తారు ? చిల్లర పదవులకు ఆత్మను అమ్ముకుంటారా?'' అని కేసిఆర్‌ కాంగ్రెస్‌ మంత్రులను ఎంఎల్‌ఏలను, ఎంపిలను తిట్టిపోశారు. కారణం ఏమిటో కాని కేసిఆర్‌ ఒక్క జానారెడ్డిని ఉద్దేశించి ప్రత్యేకంగా విమర్శిస్తూ మాట్లాడారు. కేంద్రమంత్రులు జైపాల్‌రెడ్డి, బలరాంనాయక్‌, సర్వే సత్యనారాయణ గురించి గాని, తెలంగాణ ఉద్యమంతో కలిసిరాని సికింద్రాబాద్‌ ఎంపి అంజన్‌ కుమార్‌ యాదవ్‌, జహిరాబాద్‌ ఎంపి సురేష్‌ షెట్కార్‌ లాంటి వారి ఊసే ఎత్తకపోవడం గమనించాలి. చివరగా తెలంగాణా ప్రాంత ఎం.ఎల్‌.ఏలు, ఎంపీలు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయాలని ఒకమాట అన్నారు. నిజంగా తెలంగాణాకు అడ్డుపడుతున్న కె.వి.పి., లగడపాటి లాంటి వారిని పూర్తిగా వదిలేశారు. తెలుగు దేశం పార్టీని, సీమాంధ్ర నాయకులను ఆయన పల్లెత్తుమాట అనలేదు, పనిలో పని ఉండవల్లిని ఉతికేశారు.

3. ‘‘మూడు తరాలుగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాకు శాపంగా మారింది. విలీనం, విశాలాంధ్ర ద్వారా తెలంగాణాను నెహ్రూ ముంచిండు, ఆయన కూతురు ఇందిరాగాంధీ ఉద్యమకారులను చంపింది, ఆమె కోడలు సోనియా గాంధీ తెలంగాణాను తేల్చకుండా రాచిరంపాన పెడుతుంది'' అని విమర్శించారు.

4. కాంగ్రెస్‌ టార్గెట్‌గా ప్రజా ఉద్యమం ఉంటుందని చెప్పారు. టిజేఏసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం వచ్చే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. విజయవాడ, కర్నూలు జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని ప్రకటించారు. గ్రామాల్లోకి టీ కాంగ్రెస్‌ నాయకులు రావొద్దంటూ పోస్టర్లు అంటించి, వారిని రాజకీయంగా బహిష్కరించాలని అన్నారు. తెలంగాణ ప్రజల మనసులలో బల్లెం గుచ్చిన కాంగ్రెస్‌కు తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ఆజాద్‌ మళ్ళీ సంప్రదింపుల మాట ఎత్తడం బూటకమని అభివర్ణించారు.

‘‘కాంగ్రెస్‌ కో ఖతం కరో .. తెలంగాణ హిసిల్‌ కరో'' అని జె.ఏ.సి. నినాదం ఇచ్చింది. తెలంగాణా విషయంలో మోసం చేసిన కాంగ్రెస్‌కు కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలు ఎమ్మేల్సీలు రాజీనామాలు చేయాలని జాక్‌ డిమాండ్‌ చేసింది. అయితే జాక్‌ మాట్లాడుతున్న మాటలను కార్యచరణలోకి తేవడానికి వలసిన సామర్థ్యం సంతరించుకున్నదా అన్నది సందేహాం. జాక్‌ను రాజకీయ ఉపకరణంగా వాడుకోవడంలో రాజకీయవాదులు ఏ మాత్రం వెనకాడడం లేదు. ఎందుకంటే జాక్‌కు పటిష్ట నిర్మాణం, ఆర్థికపుష్టి లేకపోవడం, ప్రధానలోపం. అక్కడ ప్రజాస్వామిక వాతావరణం కూడా లేదు.

తెలంగాణా సీనియర్‌ మంత్రి కె. జానారెడ్డి చాంబర్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, డి. శ్రీధర్‌బాబు, డీ.కే. అరుణ, గడ్డం ప్రసాద్‌కుమార్‌, సునీతా లక్ష్మారెడ్డి, బస్వరాజు సారయ్య, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాంరెడ్డి వెంకట్‌ రెడ్డి, దానం నాగేందర్‌,, ఎం.ముఖేష్‌ తదితరులు ఈ భేటీకి దూరంగా ఉన్నారు.

జానారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన కొందరు తెలంగాణా మంత్రులు ససేమిరా రాజీనామ చెయ్యం అని అన్నారు. పార్టీ అధిష్టానం పై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఇంకొంతకాలం వేచి చూస్తామని ప్రకటించారు. ముక్తాయింపుగా కనీసం మూడు నెలలు అయినా వేచిచూస్తామని ఆయన వివరించారు. తెలంగాణా రాష్ట్ర సమితి చెప్పుచేతుల్లో ఉన్న ‘టి జాక్‌' డిమాండ్‌ మేరకు లేదా టిఆర్‌ఎస్‌ డిమాండ్‌ మేరకు రాజీనామా చేస్తే ఆ ఖ్యాతి వాటికి పోతుంది. రాజకీయంగా టిఆర్‌ఎస్‌ బలపడుతుంది అన్నది వారి భావన. ఇవన్నీ చెప్పుకోడానికి బయటికి వెల్లడి అయిన ఉద్యమ కార్యక్రమాలు. కానీ లోపల ఎవరి ఉద్దేశ్యాలు, వ్యూహాలు వారికున్నాయి.

రాజకీయవాదుల పరమావధి జీవితంలో ఒక్కసారి అయినా ఎంపి., ఎంఎల్‌ఏ కావాలి, కుదరకపోతే కనీసం ఎం.ఎల్‌.సి. లేదా రాజ్యసభకైనా వెళ్ళాలి అన్నది. ఈ పదవులకోసం చాలా మంది రాజకీయ జీవులు జీవితకాలం ఎదురుచూస్తారు. చావబోయే ముందు ఒక్కరోజైన ఆ రెండు మూడు పొడి అక్షరాలు అంటించుకోవాలని చూస్తారు. ఎంపి., ఎంఎల్‌ఏ అయిన ప్రతి ఒక్కరికి ఇంకొ కోరిక ఉంటుంది. వీలయితే మంత్రి కావాలని, మంత్రి కావడానికి ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు. కులం, మతం, డబ్బు, అవిననీతి, బ్లాక్‌మెయిల్‌, బెదిరించడం, మనుష్యుల్ని లేపేయడం, పార్టీ పిరాయించడం ఇంకా ఇలాంటి అనేక అనైతిక పనులు చేయడానికి వెనకాడరు. రాజకీయాల్లో ఆ పదవులకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఆ మంత్రి పదవులను తెలంగాణా కోసం రాజీనామ చేయమంటే ఎందుకు చేస్తారు. పైకి ఎన్ని మాటలు చెప్పినా వ్యూహాలు, దూరపు ఆలోచనలు లేకుండా ఎవరు అలాంటి పని చేయరు. తెలంగాణా కోసం అస్సలు చేయరు. మళ్ళీ తప్పనిసరిగా గెలుస్తామన్న ధీమా లేకుండా ఉండి ఉంటే కేసిఆర్‌తో సహా గతంలో ఎవరూ అలా చేసి ఉండే వారు కాదు.

ఇంతకీ తెలంగాణా పంచాయతి ఎందుకు తెగడం లేదు? సమాధానం చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ కావాలి అనే వారి బలం ముందు ఆపే వారి బలం ఎక్కువగా ఉంది. కావాలి అనుకునే వారి ఐఖ్యతకన్నా ఆపే వారి ఐక్యత దృఢంగా ఉంది. కావాలి అనుకునే వారికి ఒనగూడే తక్షణ లాభాలకన్న వద్దు అనుకునే వారి తక్షణ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణా ఇస్తే రాష్ట్రంలో వచ్చే అస్తిరత కన్నా ఇవ్వకపోతే జరిగే అస్తిరత తక్కువ. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఇలా అన్ని రకాల నష్టాలు వారికి ఎక్కువగా ఉన్నాయి. అందుకే వారు శక్తివంచన లేకుండా తెలంగాణాను ఆపేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణా అడిగే ప్రజలు బలంగా ఐక్యంగా ఉన్నారు. కాని నాయకులు ఇక్కడ బలహీనంగా అనైక్యతగా ఉన్నారు. అక్కడి ప్రజలు తెలంగాణాను అడ్డుకోవడం లేదు కాని నాయకులు బలంగా అడ్డుకుంటున్నారు. అపే వారికి ధనబలం ఉంది. అడిగే వారు రూపాయి ఇవ్వరు. వద్దనే వారు వందల వేలకోట్ల ముడుపులిస్తారు.

ప్రజాబలం ముందు ఇవన్నీ బలాదూరే కానీ .., తెలంగాణ ఆకాంక్ష ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది కాని వారి ఆకాంక్షను నెరవేరుద్దాం అనే ఉద్దేశ్యం, చిత్తశుద్ధి నాయకుల్లో కొరవడిరది. ఇక్కడ, ఆకాంక్షను ఓట్లుగా మార్చుకునే పనిలో రాజకీయవాదులున్నారు. తెలంగాణ అంశానికి కులాల గొడవ, పార్టీల గొడవ కూడా ముడిపడి ఉంది. తెలంగాణాలోని ప్రధాన పాలక కులానికి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేకుండా పోయింది. దీనికి తోడు కొందరు నాయకులు ఉద్యమకారులు తక్షణ ప్రయోజనాలవైపు మొగ్గు చూపుతున్నారు. నాయకుల్లో అనైక్యత ఉద్యమానికి మరో ప్రతిబంధకంగా మారింది. ఉదాహరణకు జాక్‌.

జాక్‌ అంటేనే జాయింట్‌ ఆక్షన్‌ కమిటి. కానీ ‘‘జాయింట్‌ ఆక్షన్‌ కమిటి'' అనే పదానికున్న అర్థాన్ని అపహస్యం చేసే రీతిలో అనేక జాక్‌లు ఏర్పడ్డాయి. డాక్టర్ల జాక్‌, టీచర్ల జాక్‌, ప్రజాసంఘాలజాక్‌, లెక్చరర్ల జాక్‌, ఉద్యోగుల జాక్‌, నిరుద్యోగుల జాక్‌, యువజన సంఘాల జాక్‌, కళాకారుల జాక్‌,.. ఇలా అనేక జాక్‌లు పుట్టుకొచ్చాయి. కొన్ని కేవలం ఉద్యమంకోసం పుట్టాయి మరికొన్ని కొందరి ప్రయోజనాలకోసం పుట్టాయి. ఇంకొన్ని అవతలి వారిచే పుట్టించబడ్డాయి. అంతో ఇంతో లోకజ్ఞానం, రాజకీయాలు తెలిసిన విద్యార్థుల్లోనే అర డజన్‌ జాక్‌లు ఆవిర్భవించాయి. ఇన్ని జాక్‌లు వద్దు, ఒకే జాక్‌ ఉండాలి అని చెప్పగలిగే పట్టు కోదండరాం ఆధ్వర్యంలోని రాజకీయ జాక్‌కు గానీ, తెలంగాణ రాష్ట్ర సమితికి గాని లేకుండా పోయింది. ఎవరి దుకాణం వారిదే అయ్యింది. విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసిలుగా చీలిపోయారు. మైనార్టీ, ఓసి విద్యార్థులు ఉద్యమానికి దాదాపుగా దూరంగా ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి విభాగాలు జాక్‌లో లేవు. ఎస్సీల్లో మళ్ళీ రెండు గ్రూపులు, బీసీల్లో సబ్బండ కులాలకు సబ్బండ జాక్‌లు ఏర్పడ్డాయి. దీనికి తోడు పోలీసుల పీడన, రాజకీయవాదుల ప్రలోబాలు ఉద్యమానికి గొడ్డలి పెట్టులా పరిణమించాయి.

తెలంగాణా విద్యార్థుల అద్భుతమైన ఐక్యతను రాజ్యం, రాజకీయ పార్టీల వారు వ్యూహాత్మకంగా దెబ్బతీయ గలిగారు. ఒక దశలో టిఆర్‌ఎస్‌తో సహా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా విద్యార్థి నాయకత్వ అనుమతి లేకుండా తెలంగాణలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడిరది. అప్పుడు విద్యార్థుల నాయకత్వం ప్రధానమైపోయింది. ఉద్యమ నాయకత్వం పూర్తిగా విద్యార్థుల చేతుల్లో కెళ్లింది. ఉద్యమ కార్యక్రమాన్ని ఉస్మానియా కాంపస్‌ విద్యార్థులు నిర్దేశించారు. నాగం జనార్దనరెడ్డి పై దాడి జరిగింది. దాడి తర్వాత విద్యార్థి నాయకత్వాన్ని వారు పనిగట్టుకొని వ్యూహాత్మకంగా విచ్ఛిన్నం చేశారు.

ఇదిలా ఉండగా కొంత మంది ఉద్యమ, విద్యార్థి నాయకులు ఈ ఉద్యమంను అసెంబ్లీలోకి అడుగిడడానికి తొక్కుడు బండగా వినియోగిద్దాం అనుకుంటున్నారు. ఇందులో తప్పేమి లేదు కానీ, ఆ అసెంబ్లీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీనా, సమైక్యాంధ్ర అసెంబ్లీనా అన్నదే ప్రశ్న. ఏ అసెంబ్లీ అయినా ఫరవాలేదు అని కొందరు భావించడం ఈ ఉద్యమానికి అరిష్టంగా మారింది. వివిధ జాక్‌ల పేరుతో చలామణి అవుతున్న పలువురు ఉద్యమ నాయకుల ఉద్దేశ్యం కూడా ఇలాగే ఉంది.

తొలిరోజుల్లో ఉద్యమాన్ని ప్రారంభించిన వారు, సాహిత్యాన్ని సృష్టించిన వారు, సమావేశాలు ఏర్పర్చిన వారు ఇప్పుడు ఉద్యమ వేదికల మీద కానరావడం లేదు. వారు ఏ జాక్‌లోను లేరు. శుద్ధ రాజకీయ ప్రయోజనాలు ఆశించే వారితో జాక్‌లు నిండిపోయాయి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర కాంక్ష క్షుద్ర రాజకీయాలకు, కులాల గొడవకు, కొందరి తక్షణ, స్వల్ప ప్రయోజనాలకు బలి అవుతున్నది. అందుకే తెలంగాణా పంచాయతి తెగడం లేదు.

దుర్గం రవిందర్‌, సీనియర్ జర్నలిస్టు

English summary
Durgam Ravinder, a senior journalist from Telangana analyses on why Telangana is not getting a solution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X