వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చుక్కా రామయ్య కాలమ్: ఈ నేల విలసిల్లాలంటే....

By Pratap
|
Google Oneindia TeluguNews

మా నాయన తన గుడిసెను ఏ కారణం చేతనో కమ్మరి, వడ్రంగి వాళ్ల ఇళ్ల మధ్యలో కట్టాడు. బహుశా మా వూళ్లో ఉన్న ఇతర బ్రాహ్మల కన్నా మా నాయన పేదవాడు కావటమే అందుకు కారణం కావచ్చును. మాకు భూమి లేదాయే, పౌరహిత్యం లేదాయే కాబట్టి మా ఇంటికి ఇరువైపులా కమ్మరి యాదగిరి, వడ్ల బ్రహ్మయ్యలుండేవి. కమ్మరి యాదగిరి బ్రెయిన్‌ హ్యుమరేజ్‌తో చనిపోయాడు. అతనికి ముగ్గురు పిల్లలున్నారు. ఒకతను లెక్చరర్‌ అయ్యాడు. రెండో అతను ఇంజనీర్‌ అయ్యాడు. చివరి పిల్లవాడు స్టేషన్‌ ఘనాపురంలో బి.ఏ. చదువుకుని వూళ్లోనే ఉంటున్నాడు.

చివరకు ఒక అనాధ వృద్ధులకు వూళ్లో బియ్యం జమచేసి అన్నం వండి వాళ్లకు పెట్టేవాడు. అతని సేవాతత్పరతను చూసి ఆ పిల్లవాడు ఆంజనేయులును హైద్రాబాద్‌కు తీసుకవచ్చాను. ఆ పిల్లవాడు ఇపుడు గ్రూప్‌వన్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఏ ఇనిస్టిట్యూట్‌లో చేరాలన్నా 15000 రూపాయల దాకా చెల్లించాలి. వాళ్ల అన్నయ్యలు కొంత సాయం చేశారు. ఇది కేవలం మా వూరు ఆంజనేయుల పరిస్థితే కాదు. తెలంగాణలో వున్న యువకుల పరిస్థితి ఇది. తెలంగాణలో 90 శాతం మంది భూమిలేని వాళ్లున్నారు. చేతివృత్తిదారులు వడ్రంగి, కమ్మరి, మేర, కుమ్మరి, కంసాలి, మంగలి, చాకలి తదితర కులాల వారందరూ వ్యవసాయదారులపైననే ఆధారపడేది. వారు కుప్పకొట్టే కల్లం దగ్గర వారిచ్చిన వడ్లతో, జొన్నలు, ధాన్యాలతో జీవనోపాధి చేసేవారు.

Chukka Ramaiah

ఆ వ్యవసాయదారులు కూడా కౌలుదారులేనన్న విషయం మరువకూడదు. ఒక పూట బువ్వతిని ఇంకోపూట తినక అర్థాకలితో పరమ దరిద్రంతో ఎందరెందరో చనిపోయారు. ఆ తల్లిదండ్రులు కొడుకులకు ఏం ఆస్తిపాస్తులు మిగుల్చుతారు చెప్పండి. చాలా మంది యువకులు వేరే వృత్తులు చూసుకోవలసి వచ్చింది. ఈనాడు వృత్తులంటే ఒకటే వృత్తి పంతులు పనేనని చెప్పాలి. అవి కూడా ఎన్నికల ముందే ఎలక్షన్‌ డిఎస్‌సీలు పెడతారు. ఒంటె ఒంటిలో నీరును జమచేసుకున్నట్లు రాజకీయ నాయకులు ఎన్నికల కోసం పోస్టులు జమచేసుకుంటారు.

బహుశా ప్రజలు తమను మరిచిపోతే ఓటు వేయరేమోనని ఎలక్షన్‌ సంవత్సరంలోనే నియామకాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టే ఈ తెలంగాణ యువకులు పడుతూ లేస్తూ డిగ్రీ వరకూ చదువుకుని ఏ ప్రైవేట్‌ స్కూల్లోనో టీచర్లుగా చేరారు. మా గూడూరు దగ్గర పాలకుర్తి ఉండటం వలన దానికితోడు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ రావటం వలన ఈ యువకుల్లో కొందరు ఇంజనీర్లు అయ్యారు. రెండో అబ్బాయి ఇంజనీర్‌ అవ్వటం వలన ఆంజనేయులు గ్రూప్‌వన్‌ పరీక్ష కోచింగ్‌కు డబ్బు కట్టగలిగాడు. కానీ ఈనాడు ఆ ఇంజనీర్లకు కూడా ఉద్యోగాలు లేవు. కాబట్టే గ్రూప్‌వన్‌ పరీక్షకే ఎదగబడవలసి వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి యువకులు బతకాలంటే గ్రూప్‌వన్‌ పరీక్షలే శరణ్యంగా మారింది. తమ భుక్తి కోసమై నానారకాల పనులు చేస్తూ ఈ పోటీ పరీక్షలకు తయారవుతున్నారు. ఈనాడు తెలంగాణలో యువకుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

తెలంగాణలో ఉన్నతకులాలన్నీ 15 శాతం కన్నా ఎక్కువగా లేరు. తెలంగాణలో భూమంతా ఇప్పటికీ కొన్ని వర్గాల చేతుల్లోనే ఉంది. 80 శాతం మంది మాల, మాదిగ, వెనుకబడిన వర్గాల వారే ఉన్నారు. అదృష్టవశాత్తు కుల ఘర్షణలు అంతగా లేవు. కాకపోతే ఫ్యూడల్‌ ఆధిపత్యం మాత్రం యధేచ్ఛగా కొనసాగుతూ ఉంది. గ్రామాలలో దళితుల పరిస్థితి ఒకేలాగా ఉంది. సంక్షేమ హాస్టళ్లు రావటం వలన ఈ పిల్లలు బడికి పోగలుగుతున్నారు. తొడుక్కునే బట్టలు కూడా సంక్షేమశాఖ ఇవ్వటం వలన కాసంత వెసలుబాటు ఉంది. రాబోయే తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లు ప్రస్తుత సంఖ్యకన్నా రెట్టింపు చేయగలగాలి. ఇలా చేయగలిగితేనే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బహుజనవర్గాలు బడిగడపతొక్కగలుగుతారు.
చేతులిరిగిపోయిన తెలంగాణ వృత్తిదారుల పరిస్థితి దారుణంగా అయోమయంగా ఉంది.

చేనేత కార్మికుల ఆత్మహత్యలు, విశ్వకర్మ మనుమయకులాల కుటుంబాల ఆత్మహత్యలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. పలు చేతివృత్తుల వారు జీవనం సాగించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల లెక్కలను ప్రభుత్వం బైటపెట్టటం లేదు. తెలంగాణలో వసూలైన శిస్తులన్నీ కూడా హైద్రాబాద్‌ మహా నగరీకరణకు, సుందర రోడ్లకు, సౌందర్యవంతమైన పార్కులకే ఖర్చు చేశారు. ఇపుడు అందమైన నగరానికి అందరూ యజమానులే. కానీ కడుపు చంపుకుని ఏ ప్రజలైతే ఈ హైద్రాబాద్‌ను నిర్మించారో వారి తరుఫున నిలబడి కలబడే వారు లేరు. ఇక తెలంగాణ రాష్ట్రమే ఆ ప్రజలను కాపాడాలి. తెలంగాణ గ్రామాల్లోపల ఎక్కడ చూసినా మా గూడూరు ఆంజనేయులలాంటివారే కనిపిస్తారు. లక్షలాది యువకుల భవితవ్యానికి కొత్త రాష్ట్రమే దోహదపడాలి. ఆ మానవ సంపదను ఉపయోగించుకుని తెలంగాణ విలసిల్లాలి. వర్థిల్లాలి.

English summary
Educationsit and former MLC Chukka Ramaiah writes about the demolishion of caste based proffessions in the villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X