వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన: అధికారుల అభీష్టమే, జివోఎం పెద్దన్న

By Pratap
|
Google Oneindia TeluguNews

Durgam Ravinder
రాష్ట్రాన్ని విభజించే విధివిధానాలను రూపొందించే జీవోఎం (గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌) రెండు సమావేశాలను విశ్వసించింది. నవంబర్‌ ఐదున మూడవ సమావేశం జరగనుంది. కీలక అంశాలపై నివేదిక తయారుచేసే బాధ్యతను జీఓఎం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులకు అప్పగించింది. వారు అగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ఈ నివేదికల ఆధారంగా విభజన విధానాలను రూపొందిస్తారు. వీటి ఆధారంగా డిసెంబర్‌లో విభజన ప్రక్రియ తుదిరూపు దాలుస్తుందని జిఓఎం ప్రకటించింది.

జిఓఎం మొదటి సమావేశం 45 నిమిషాల్లో ముగియగా రెండో సమావేశం గంటన్నర (90 నిమిషాలు) సాగింది. గంటన్నరలో మొదటి పది నిమిషాలు సర్దుకొని కూర్చోటానికి, ప్రారంభోత్సవాలకు పోతుంది. పలకరింపులు, కరస్పర్షలు మామూలే. ఇలా కనీసం అరగంట సమయం సర్దుకోవడానికి, ముగించడానికిపోగా గరిష్టంగా ఒక గంట విభజన ప్రక్రియ, విధివిధానాలపై మాట్లాడి ఉంటారు. ఇంత ముఖ్య సమస్యపై గంట గంటన్నర చర్చ ఎలా సరిపోతుందో మంత్రులకే తెలియాలి. అసలు సంగతి ఏమిటంటే ఈ వ్యవహారంలో మంత్రులు చేసేది చాలా స్వల్పమే, మొత్తం వ్యవహారం నడిపేది కార్యదర్శులే. రాష్ట్రం నుండి ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నోడల్‌ ఆఫీసర్‌గా నియమిస్తున్నారు. వీరు అందించే సమాచారం మేరకు కేంద్ర కార్యదర్శుల బృందం విధానాలను రూపొందిస్తుంది.
హైదరాబాద్‌ నగరంపై శాంతిభద్రతల యంత్రాంగాన్ని పూర్తిగా తన పర్యవేక్షణలోకి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్వయంగా ఈ ప్రతిపాదన చేశారు. రెండు రాష్ట్రాలు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్‌ పాలనా వ్యవస్థ, శాంతిభద్రతల పరిరక్షణ, నగరంతోపాటు తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రుల భద్రతకు తీసుకోవాల్సిన చట్టబద్ధమైన చర్యలపై హోంశాఖ ప్రతిపాదనలతో కూడిన ప్రాథమిక నివేదికను జీవోఎం ముందుంచింది. రెవెన్యూ విభాగాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చే అంశం ప్రతిపాదనలు ఇంకా సిద్ధం కాలేదు. ఈ విషయంపై స్పష్టమైన ప్రతిపాదనలను మూడో సమావేశంలో చర్చకు రావచ్చు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాల కేటాయింపులను బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ప్రాతిపదికగా నిర్ధారించాలని, దాంతోపాటు వాటి అమలుకోసం అంతర్రాష్ట్ర వివాద పరిష్కార ట్రిబ్యునళ్లకు బదులు చట్టబద్ధమైన నదీజలాల వినియోగ బోర్డును ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన కూడా జీవోఎం పరిశీలనకు వచ్చింది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే క్రమంలో ప్రాజెక్టు నిర్మాణంలో ఇమిడిఉన్న న్యాయపరమైన చిక్కులను, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎదురయ్యే అభ్యంతరాలను అధిగమించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై కూడా ప్రాథమిక చర్చ జరిపారు. రెండు, రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులపై తీసుకోవాల్సిన చర్యలను కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం వివరించారు. ఇంత ముఖ్యంశాలపై గంట గంటన్నరలో పూర్తిచేయడం గమనార్హం.
రాష్ట్ర విభజన కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్య లక్షలాది మంది సీమాంధ్రులు అనేక సక్రమ, అక్రమ పద్ధతుల్లో తెలంగాణలోకి వచ్చారు.

1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడక ముందునుండే వీరి వలసలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ నగరంలోనే కాకుండా తెలంగాణలోని దాదాపు ప్రతి మండలంలో సెటిలర్స్‌ ఉన్నారు వీరిలో అత్యధికుల మూలాలు సీమాంధ్రలోనే ఉన్నాయి. హైదరాబాద్‌ చుట్టుప్రక్కల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన సీమాంధ్రుల ఆర్థిక మూలాలన్ని ఇక్కడే ఉన్నాయి. వీరే తెలంగాణ ఏర్పాటుపట్ల ఎక్కువ నష్టపోతున్నది. ఏదిఏమైనా ఈ పరిస్థితులను కూడా ఎంత మూల్యం చెల్లించి అయినా తెలంగాణాను ఆపాలని అనుకుంటున్న వర్గం ఇదే. గతంలో ప్రతిసారి అడ్డుకున్నది కూడా వీరే. వారికింకా దింపుడు కళ్ళం ఆశ ఉంది. వీరి అభిష్టానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరిగిపోతున్నది. వీరికి ఇప్పుడు వారి వ్యక్తిగత ఆస్తుల విషయమై ఆందోళన ఉంది తప్ప కొత్త రాష్ట్రంలో సీమాంధ్రుల లబ్ధికోసం ఏం చేయాలి, కేంద్రాన్ని ఏం అడగాలి అనే విషయాలను పట్టించుకోవడం లేదు.

కొత్త రాజధాని ఎక్కడుండాలి, ఎలా ఉండాంలి అనే విషయాన్ని వారు ఆలోచించడమే లేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఎన్ని ఏళ్ళు ఉన్నా సీమాంధ్రులకు అంతా నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదు. అసలు రాష్ట్రం బయట రాజధాని ఉండడం ఎవరికి సౌకర్యం. నాయకులకా, ప్రజలకా? అయ్యింది ఏదో ఐపోయింది పూర్తిగా తెగతెంపులు చేసుకొని కొత్త రాజధానిని సర్వాంగ సుందరంగా, ఆధునికంగా నిర్మించకుందాం అనుకునే వారి సంఖ్య కొంతయినా కానరాకపోవడం విచిత్రం.
ఇటు తెలంగాణ వారు కూడా నూతన రాష్ట్ర పునర్‌నిర్మాణంపై నామమాత్రపు పనులు, ప్రకటనలకు పరిమితం అవుతున్నారు. ఆర్థిక, రాజకీయ అంశాలతోపాటు ఇతర అంశాలపట్ల ఇరు ప్రాంతాల వారు మరింత మథనం చేయాల్సి ఉంది. కేంద్ర ప్రకటనలతో అంత అయిపోయిందని రాష్ట్రం ఏర్పడుతుందని కాళ్ళు పారజాపుకొని ఇరు ప్రాంతాల వారు కూర్చుంటే కుదరదు. భవిష్తత్‌లో ఏర్పడబోయే సమస్యలపై దృష్టి సారించాలి.

జిఓఎం వారు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలపై సూచనలు, అభ్యంతరాలను తమకు నివేదించవచ్చని అన్నారు. రాష్ట్రంలోని పలు పార్టీలు, ప్రజాప్రతినిధులు, పౌరులు, ప్రజా సంఘాలు జీవోఎం పరిశీలనాంశాలపై తమ అభిప్రాయాలను నవంబర్‌ 5 వరకూ తెలియజేయవచ్చని వాటిని కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్‌ చిరునామాకు ఇమెయిల్‌ ద్వారాగానీ, న్యూఢల్లీి జైల్‌సింగ్‌ రోడ్‌లోని ఎన్‌డీసీసీ 11 బిల్డింగ్‌లో ఉన్న హోంశాఖ కేంద్ర రాష్ట్ర విభాగానికి పోస్టు ద్వారా గానీ పంపవచ్చు.
- దుర్గం రవిందర్‌
రచయిత సీనియర్ జర్నలిస్టు

English summary
A senior journalist Durgam Ravinder writes on the process of bifurcation process of AndhraPradesh and creation of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X