• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యక్తిత్వ వికాసం: దేశీయ దృక్పథాలు, దేహభాష

By Pratap
|

మనదేశంలో చేతి కష్టంతో ఎవరు కోటీశ్వరులు కారు అని ప్రజలు నమ్ముతారు. కోటీశ్వరులయ్యే ప్రతి ఒక్కరూ మందిని దోచి సంపాదించిందని భావిస్తారు. ఎందుకంటే వారు కష్టజీవులు. వారి జీవితంలో ఎంత కష్టపడినా లక్షలు, కోట్లు సంపాదించడం సాధ్యం కాలేదు. తమకు తెలిసి ఎదిగినవారు ఇలా మందిని ముంచి, మందిని దోచి ఎదిగినవారుగా భావించారు. రాజు లైనా, వర్తకులైనా, పూజారులైనా అలా వారు సంపాదించడం నేరంగా, దోపిడీగా సంపన్నులు, దుర్మార్గులుగా, పాపాత్ములుగా భావిస్తూ వారిని శపిస్తూ వచ్చారు. అందుకే రాజుల సొమ్ము రాళ్ల పాలని ఈసడించారు. 'లండన్‌కు పోవడం' అనేదాన్ని దొడ్డికి పోవడంగా మార్చారు. 'లండన్‌ పోతా' అని దొడ్డికి పోవడం అనేది ఒక ఈసడింపులో భాగంగా పుట్టింది.

ధనవంతులంతా పాపులే...

పైసలు సంపాదించడం పాపం అని, ధనవంతులు పాపులు అని అనుకోవడం ఎందుకు జరిగిందంటే... జైనం, బౌద్ధం, శైవం, ప్రజలకు నిరాడంబర జీవితాన్ని, సంస్కృతిని, మానవీయ విలువలను, పరోపకారాన్ని, ఆదర్శ వ్యక్తిత్వ నమూనాగా, తాత్విక సిద్ధాంతాలను, ఆచరణను, కుల వ్యవస్థ నిర్మించిన గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, వారసత్వ కులవృత్తుల అభివృద్ధి నమూనాలను ముందుకు తెచ్చాయి.

పారిశ్రామిక విప్లవం యూరప్‌, అమెరికాల్లో ప్రారంభమైన యాభై ఏళ్ళ తర్వాత కూడా 1810 దాకా ప్రపంచానికి భారతదేశంనుండే ఎగుమతులు సాగాయి. కులవృత్తులు, కుల సంబంధాలు, కులవృత్తి ఉత్పత్తి విధానాలు, ఆలోచనా విధానాలు వాటి ప్రభావం, ఆచరణ నేటికీ ప్రజలపై బలంగా కొనసాగుతున్నది. ఎంత పేదరికంలోనైనా బతకగలగడానికి నేపథ్యం ఈ చరిత్రే. సాధారణంగా ఈ తాత్వికధార లేకపోయి ఉంటే పేదలు వెంటనే తిరుగుబాటు చేస్తారు. యుద్ధంలో చనిపోతారు తప్ప అణచివేయబడే హింసించబడే, అవమానించే జీవితాన్ని బతకడానికి అంగీకరించరు. కానీ, బతుకుతున్నారు. అందుకు జైనం, బౌద్ధం, శైవం, వర్ణ, కుల వ్యవస్థల సిద్ధాంతాలు, ప్రధాన భూమిక ఏర్పరిచాయి.

డబ్బు సంపాదించడం తప్పు కాదు...

డబ్బు సంపాదించడం తప్పు కాదు. దేవుడే ఎన్నో నగలు పెట్టుకుంటాడు. తిరుపతి వెంకన్న దగ్గర వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి దేవాలయంలో దేశ బడ్జెట్‌ కన్నా ఎన్నోరెట్లు సంపద తాళాలు వేసి దాచిపెట్టారట. గుజరాత్‌లోని సోమనాథ్‌ దేవాలయంలో టన్నులకొద్ది బంగారం, దేవుళ్ళు దాచుకున్నారు. ఇతర ప్రాంతాల నుండి దాడులు చేసి దోచుకుపోతుంటే దేవుళ్ళు చూస్తూ ఉండిపోయారు. వందలాది గుళ్ళలో, కోట్లాది సంపద దాచుకున్నారు. ఊళ్ళకు ఊళ్ళు వేల ఎకరాలు అగ్రహారాలుగా దేవుళ్ళు కైంకర్యం చేశారు. అందరి కన్నా ఎక్కువ దేవుళ్ళే సంపన్ను లయ్యారు. కనుక మనం కూడా మస్తు సంపాదించాలని ఇటీవల ఒకాయన వాదించాడు. ఎంత సంపాదిస్తే అంత దానం చేయవచ్చు. త్యాగం చేయవచ్చు. మంచి కోసం ఉపయోగించవచ్చు.

personality development: Indignious perspectives

కుల వివక్ష, కర్మ, పునర్జన్మ సిద్ధాంతంతో దోపిడీ, అణచివేత...

ఈ దేశంలో తరతరాలుగా మన కర్మ అని భావించి, ఓటమిలో, దుఃఖంలో, కష్టాల్లో సహజీవనం చేశారు. కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు, ఒక కులం గొప్ప, ఒక కులం చిన్నది అనే కుల వివక్ష, వర్ణ వివక్ష ప్రజలను శతాబ్దాలుగా అణచివేశాయి. అవమానించాయి. కొందరే ప్రతిభావంతులు అని వారు పెట్టి పుట్టారని అంగీకరించడాన్ని అనివార్యం చేశాయి. అలా సమస్థ సంపదలను సృష్టించిన శూద్రులు, అతిశూద్రులు పేదరికాన్ని అనుభవించారు. అంగీకరించారు. చివరకు అంటరానితనాన్ని కూడా భరిస్తూ వచ్చారు. అగ్రవర్ణాలు, సంపదను అనుభవించారే తప్ప వారు సంపదను సృష్టించలేదని భారతీయ చరిత్ర నిర్మాతలు, ఉత్పత్తి శక్తుల, ఉత్పత్తి సాధనాల నిర్మాతలు, శూద్రులు, అతిశూద్రులు, ఆదివాసీలే అని తమ స్వీయ చరిత్రను, స్వీయ చైతన్యాన్ని మరిచిపోయారు. గుళ్ళల్లో రాజులవద్ద పేరుకుపోయిన సంపదంతా తాము సృష్టించిందే అని శూద్రులు, అతిశూద్రులు, ఆదివాసీలు మర్చిపోయారు. సంపన్నుల సంపదంతా తాము సృష్టించిందే అని కొందరు కార్మికులు, కార్మికవాదులు అంటూ ఉంటారు.

'లీడర్‌షిప్‌' అనే గ్రంథంలో...

'లీడర్‌షిప్‌' అనే గ్రంథంలో డా. బి.వి. పట్టాభిరామ్‌ ఇలా పేర్కొన్నారు. 'మన దేశంలో 1900 సంవత్సరాలపాటు ఒక నమ్మకం సమాజ అభివృద్ధిని అణచివేసింది. ఏ కులంవారు ఆ కులం వృత్తే చేయాలి. మరొకటి చెయ్య కూడదు. చేసినా ఫలితం ఉండదు. పైగా అనర్థాలు జరుగుతాయి అని నమ్మారు. మత్స్యకారుల పిల్లలు అదే వృత్తి, వైశ్య కుటుంబంలో వారు వ్యాపారం, స్వర్ణకారుల పిల్లలు అదే వృత్తి... అలా కులవృత్తులే చేపట్టేవారు. అలాగే గ్రామాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో ఫలానా కులంవారే అధిపతిగా ఉండాలి. వారికి సలహాదారులుగా ఫలానా కులంవాళ్ళే ఉండాలి అనేవారు. అందరూ అదే నమ్మేవారు. ఫలానా కులాలవాళ్ళు ఊరికి దూరంగా వేరే వాడలో ఉండాలి అనేవారు. నిజమేననుకుని వారుకూడా అలాగే ఉండేవారు.

ఇదంతా నాన్సెన్స్‌ అని 20వ శతాబ్దంలో రుజువైంది. ఎవరైనా ఏదైనా చెయ్యగలరు. ఎవరైనా ఏ రంగమైనా చేపట్టవచ్చు. ఎవరైనా నాయకులు కాగలరు అని ఎందరో వ్యక్తులు రుజువు చేశారు. ఈనాడు ఏ రంగంలో ఏ కులంవారు లేరో చెప్పగలరా? అసాధ్యం. ఎందుకంటే అన్ని కులాలవారు అన్ని రంగాల్లో ఆధిపత్యం వహిస్తున్నారు'.

అయితే పట్టాభిరామ్‌ ఒకమాట మరిచారు. ఇప్పుడేకాదు... శతాబ్దాలుగా సమస్థ సంపదలు సృష్టిస్తున్నది పైన చెప్పిన అశేష ప్రజలే. రాజులు, రాజా శ్రితులు, పూజారులు, వ్యాపారులు, అశేష ప్రజలు సృష్టించే సకల సంపద లను అనుభవించేవారే తప్ప వారు సంపదలు సృష్టించలేదు. ఉత్పత్తి చేయ లేదు. పారిశ్రామిక విప్లవం ప్రారంభమై ఎభై ఏళ్ళు గడిచాక కూడ 1810దాక భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతులు జరిగాయి. భారతీయ సమాజ నిర్మాతలు అశేష ప్రజలే. భాష, సంస్కృతి, కళలు ప్రజలే తమ జీవితంలో భాగంగా రూపొందించుకున్నారు.

వనమూలికల స్వభావం కనుక్కొని ఔషధులుగా మార్చుకున్నారు. చరిత్రకు అందుతున్న పురావస్తు అవశేషాలు, కోటలు, గుళ్ళు మొదలైనవన్నీ అశేష ప్రజల శ్రమశక్తి నిర్మితాలు.

వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ తాలూకు మత విశ్వాసాలు, కర్మ, పునర్జన్మ భావాలు, సంస్కృతి అలవాట్లు, కులవృత్తి ఉత్పత్తి విధానం, కుల వ్యవస్థ నిర్మించిన గ్రామీణ స్వయం పోషక ఉత్పత్తి విధానం, కులాలవారీ రక్త సంబంధాలు, ఆలోచనా విధానం, ఒక గుదిబండగా వారి వ్యక్తిత్వాలను, జీవితాలను శాసిస్తూ వస్తున్నది. వారి జీవిత లక్ష్యాల్లో, వ్యక్తిత్వ వికాసంలో తాత్విక భావధారలో గతం బలమైన అంతచ్చేతనగా స్థిరపడిపోయింది. అంతచ్చేతన నుండి, ఆచరణ నుండి వాటిని తొలగించకుండా నూతన వ్యక్తిత్వ వికాసం సాధ్యం కాదు. నిరంతరం అంతచ్చేతనలో గతం గుదిబండగా మనిషిని కుంగదీస్తూనే ఉంది.

కులం ఎంత పనిచేస్తుందో...

నేటికీ గ్రామాల్లో, నగరాల్లో ఉద్యోగరంగాల్లో, రాజకీయ రంగంలో, కులాన్ని బట్టి గౌరవించడం, అవమానించడం, అవకాశాలు ఇవ్వడం, నిరాకరించడం స్పష్టంగా గమనించవచ్చు. వర్తమానంలో జీవించకుండా ప్రజాస్వామ్యాన్ని కూడా కులాలవారీగా ఆలోచించే వ్యవస్థ కొనసాగుతున్నది. వర్తమానంలో జీవిస్తున్నప్పటికీ వారి భావాలు, సంస్కృతి గతంలో కూరుకు పోయి పైకి రాలేకపోతున్నారు. అవి ప్రజలను వెనక్కి లాగుతున్నాయి. కంపార్ట్‌మెంటల్‌ ఆలోచనా విధానాన్ని, థాట్‌ పోలీసింగ్‌ను అలవాటు చేస్తున్నాయి.

ఇది మన పని కాదు. వాళ్ళతో పెట్టుకోవద్దు. వాళ్ళతో పోటీ పడలేము. ఈ రాజకీయాలు మనకు అచ్చిరావు. అంత పెట్టుబడి మనదగ్గర ఎక్కడుంది. మంచం ఉన్నంత మేరకు కాళ్లు చాపాలి. ఆకాశంలో ఎగిరే పిట్టలకు భూమ్మీద పొయ్యి పెట్టి సాంబారు కాసినట్టు అందని దానికి ఎదురుచూడవద్దు. అందని ద్రాక్షపండ్లు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా? ఐదు వేళ్లు ఒక్క తీరుగా ఉన్నాయా? ఎవరు చేసేపని వాళ్లే చేయాలి. చాకలివాళ్లు బట్టలు ఉతకకపోతే ఎలా? దళితులు మురికి కాలువలు, రోడ్లు, చెత్త సాఫ్‌ చేయకపోతే ఎలా? అని ఇప్పటికీ భావించేవారు కోట్లమంది ఉన్నారు. ఆ వృత్తుల్లోకి ఇతర కులాలవాళ్లు చేరడానికి ముందుకు రావడంలేదు.

ఒకాయన ఆర్‌.టి.సీ.లో టాయిలెట్లు శుభ్రపరిచే పనికి పూనుకున్నాడు. ఆయన కులంవాడే ఎన్‌.టి.ఆర్‌. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఆ కులంవాల్ల హవా కొనసాగుతున్నది. అలా ఆ కులంవాళ్లు అతన్ని తిట్టి సాంఘిక బహిష్కరణ చేసినంత పనిచేసి ఆ పని మాన్పించారు. వేరే పని ఇప్పించారు.

కులాలవారీగా చూసే చూపు...

ఒకాయన రిజర్వేషన్‌లో ఐఏఎస్‌ పాసై కలెక్టరుగా పని చేశాడు. ఆయనని ఆ జిల్లా నాయకులు, ఇతర కులాలవాళ్లు ఎంతగా అవమానించి హింసించా రంటే అతడు ఏడ్చేశాడు. అసమర్ధుడు, పనికిరానివాడు, రిజర్వేషన్‌ సరుకు ఇలాగే ఉంటుంది. చిన్న కులాలకు పెత్తనం ఇస్తే ఎంత గర్వం... వగైరాలతో జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేశారు. పత్రికలు నింపారు. ధర్నాలు చేశారు. ఈ అవమానాలు బయటికి చెప్పగలిగేవి కావు. ఆనాడు అంబేడ్కర్‌ భారతదేశంలోని అత్యున్నత విద్యావంతుడు. అతన్ని మించిన విద్యావంతుడు భారతదేశంలోనే లేరు. అయినప్పటికీ ఎన్నో అవమానాలకు గురయ్యాడు.

నేటికీ దేశంలో అదే దృక్పథం, చిన్నచూపు, అలవాటు, సంస్కృతి మనస్సుల్లో కొనసాగుతూనే ఉన్నది. ఆ కలెక్టర్‌ మరో జిల్లాకు బదిలీ అయ్యారు. ఆ జిల్లాలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, మరికొందరు అధికారులు, శాసనసభ్యులు దళితులు కావడంతో వారంతా కలెక్టరుకు మద్దతుగా నిలిచారు. దాంతో ఆ జిల్లాలో గొప్ప కలెక్టరుగా, మంచి సహృదయుడుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. ఇలా ఒకే వ్యక్తి ఒకచోట అసమర్ధుడిగా, మరోచోట గొప్ప పరిపాలనాదకక్షుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇందులో పని చేసే కులం, వర్గం, ప్రాంతం, అహంకారం, అభిజాత్యం, చిన్నకులాలపట్ల చిన్న చూపు బలంగా పని చేసింది.

వాస్తవిక జీవితం, సమాజం, దృక్పథాలు ఇలా కొనసాగుతున్నాయి. ఇలాంటి వీటన్నిటిని పట్టించుకోకుండా వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పడం, వాస్తవాలను విస్మరించి భ్రమలను, ఆచరణ సాధ్యం కాని, వ్యక్తిత్వాన్ని, లక్ష్యాలను, సంస్కృతిని, విలువలను, భాషా వ్యక్తీకరణను, బాడీ లాంగ్వేజ్‌ను కొన్ని కులాలకు అనుకూలంగా ఉండేవాటిని ముందుంచుతున్నాయి.

ఎవరు, ఏ కులంవారు, ఏ వర్గం వారు, ఏ ప్రాంతం వారు, ఏ భాషవారు అధికారంలో, ఆధిపత్యంలో ఉన్నారో వారిదే గొప్ప భాష, తెలివి, గొప్ప సంస్కృతి, బాడీ లాంగ్వేజ్‌ అని ఆదర్శీకరిస్తూ వారి ఆధిపత్యాన్ని, వారి వికాసాన్ని పెంచి పోషిస్తున్నారు. అందుకు రహదారులు వేస్తున్నారు. మిగతా వారు వాటిని అందుకోలేరు. కొంగ, నక్క, కూజ పల్లెం పాయసం కథవలె వారికి మాత్రమే ఉపయోగపడే, ఆచరణ సాధ్యమయ్యే, వారికి సంబంధించిన వాటిని అందరికీ ఆదర్శంగా తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు. పెంచి పోషిస్తున్నారు.

శ్రమను గౌరవించే మహిళల, బహుజనుల బాడీ లాంగ్వేజ్‌ వేరు

స్త్రీలు, ఆ బాడీ లాంగ్వేజ్‌ను అంగీకరించరు. అలాగే మిగతావారు కూడా అంగీక రించరు. స్త్రీల బాడీ లాంగ్వేజ్‌, ఉత్పత్తి కులాల, సేవా కులాల, బాడీ లాంగ్వేజ్‌, భాష, భావ వ్యక్తీకరణ ప్రత్యేకంగా ఉంటుంది. వారి డ్రెస్‌ కోడ్‌ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తమదైనదాన్ని ఎందుకు వదులుకోవాలి అనే ఆత్మ గౌరవం కూడా ఉంటుంది.

ఇలా ఆయా ఆధిపత్య సామాజిక వర్గాలను అనుకరించడం, ఆచరించడం పూర్తిస్థాయిలో సాధ్యం కాకపోయేసరికి తిరిగి ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌లోకి నెట్టివేస్తున్నాయి. తరతరాలుగా గౌరవాన్ని, ఆధిపత్యాన్ని, సంపదను, అనుభ వించిన కులాలు, వర్గాలు, సమాజాలు మరింత తేలికగా ఎదగడానికి, మానసికంగా వారి ఆధిపత్యాన్ని అంగీకరింప జేయడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఎదగాల్సిన కోట్లాది ప్రజలకు అనుకూలంగా ఉండడంలేదు.

English summary
An eminent writer, BS Ramulu stresses the importnace of indigenious perspectives in personality development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X