Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చింతపట్ల క్విక్ బాక్సింగ్: లోకమే మెగా ఎగ్!

Quick Boxing: Chintapatla Sudarshan on political critics
ఇదో లోకం ఇదే లోకం అనుకుని సంతృప్తి పడకుండా ఇదా లోకం? అని ప్రశ్నించేవాళ్లుండబట్టే శాస్త్రజ్ఞానం నాగరికతా యింత ఎత్తుకి ఎక్కి వచ్చినయి. ఎందుకు? ఏమిటి? ఎలా? అని ప్రశ్నించే వాళ్లుండబట్టే లోకజ్ఞానం వెయ్యి తలల వెర్రిగా వర్ధిల్లుతున్నది.

అక్కడంతా హడావిడిగా గడబిడగా గగ్గోలుగా వుంది. అందరి ముఖాల్లోనూ అనేక ప్రశ్నలు ప్రతిబింబిస్తున్నవి. వాళ్ల కనుబొమలు ముడివడుతూ విడిపోతూ మళ్లీ ముడి పడుతూ వున్నవి. వాళ్లంతా సామాన్యులేం కాదు. శాస్త్ర విజ్ఞానంలో తలలు పండినవాళ్లు. ఆలోచించీ చించీ నెత్తి మీది జుట్టుని పీక్కున్నవాళ్లు.

కొందరి తలల మీద ఒక్క జుట్టు పోచ కూడా లేకుండా శుబ్బరంగా గుండ్రంగా కోడిగుడ్లల్లా మెరుస్తూ కనిపిస్తున్నాయి. గుడ్డు అన్న మాట వచ్చింది కదా యిక అసలు విషయం చెప్పాల్సిందే. అక్కడ జరుగుతున్న హడావిడంతా గుడ్డుకు సంబంధించినదే. గుడ్డుకి యింత యింపార్టెన్సా అని కళ్లు ఎగరేయకండి. వాటిలోనూ గుడ్డులుంటాయి. అసలు ఈ లోకమే ఓ మెగా ఎగ్ కదా. ఆకాశంలో గందరగోళంగా తిరిగిందే తిరిగి గ్రహాలన్నీ గుడ్డులు కాకపోతే మరేమిటి?

మెదళ్ల నిండా చిలవలు పలవలుగా అనేకం క్వశ్చన్లు నిండి ఉన్న మేధావులంతా ఒక్కసారిగా నోళ్లు మూసుకున్నారు. వేదిక మీద దేశీయ విజ్జాన శాస్త్రవేత్తల సంచాలకులు మైకందుకోవడం వల్ల నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది. ఎన్నో ప్రశ్నలు వేసీ వేసుకునీ వాటి జవాబుల కోసం రాత్రనకా పగలనకా, పిజ్జాలు బర్గర్లూ మినరల్ వాటరనకా రౌండ్ ది క్లాక్ ప్రయోగశాలలో పరీక్ష నాళికలా పనిచేసీ చేసీ ఆయన జుట్టు ఏనాడో సర్వస్వ హీనమైపోయి లోపల గట్టి మెదడుని కవచంలా కాపాడుతున్నది బాల్డ్ హెడ్డనబడు బట్ట తల. లైట్ల వెలుతురుకు మిలమిలా మెరుస్తున్నదదో గుడ్డు అనబడే ఎగ్గులా. ఓ నా దేశీయ శాస్త్ర విజ్ఝాన నిధుల్లారా గనుల్లారా ప్రశ్నా ధనుల్లారా అని మొదలుపెట్టిన ఉపన్యాసంలో ఆనాటి సమావేశానికి కారణాలను సవివరంగా చెప్పుకొచ్చారాయన.

లోకంలో అనేక ప్రశ్నలున్నాయి. సామాన్యులకు బుర్రలు బద్దలు కొట్టుకుంటే పగిలి రెండు వక్కలవుతుంది కానీ అన్ని ప్రశ్నలకి సమాధానం ఎంత మాత్రం చిక్కదు దొరకదు. లోకం అనే పెద్ద గిన్నెలో చేయి పట్టి కలయదిప్పి కెలికి అందరికీ అర్థమవని వాటిని అందుబాటులోకి రానివాటిని పట్టి బయటకు తీసి చూపెట్టాల్సిన వాళ్లం మనం. మనమంతా వేధావులం. మన బట్టతలలూ పిల్లిగడ్డాలూ సమాజంలో మనకో ఉన్నత స్థానాన్ని కల్పించాయి. ఇవ్వాళ్ల మన మీద ఒక్క పెద్ద బాధ్యత ఉన్నది. దేశీయ శాస్త్ర విజ్ఝానవేత్తలకు యిదొక పెద్ద మహా సవాల్. ఈ క్షణం నుంచీ మనమంతా ఈ సవాల్‌కి జవాబు వెకితే పనిలో లగ్నమవుదాం నిమగ్నమవుదాం అంటూ తన సీటు వైవు అడుగులు వేయబోయాడు అయితే వేదిక మీద వున్న మరో వేత్త ఏవేవో సైగలు చేయనారంభించాడు. అసలు సవాలేమిటో ఏది వెతికి పెట్టాలో చెప్పా పెట్టకుండా ఉపన్యాసం పరధ్యానంగా ముగించడమేమిటని సభలో వున్న ఉద్ధండ ప్రకాండులు గుసగుసలాడారు.

ఓ అయామ్ రియల్లీ సారీ అంటూ మళ్లీ మైకు ముందుకొచ్చారు దేశీయ విజ్ఝాన వేత్తల సంచాలకు, అరచేత్తో వొట్టి బట్ట తలను ట్యాప్ చేస్తూ యిప్పుడు గుర్తుకొచ్చింది. దేశం మన మీద పెట్టిన బరువు బాధ్యత సంగతి. తల మీద తట్టుకుంటే కానీ తత్వం బోదపళ్లేదు. ప్రస్తుతం మన మిషన్ మన ప్రాజెక్టు యేమిటంటే కోడిగుడ్డుకు ఈకలు పీకడమే. కోడిగుడ్డుకే కాదు ఏ గుడ్డుకైనా ఈకలు పీకడమే మన తక్షణ కర్తవ్యం. సామాన్య మానవులకు గుడ్లు కనిపిస్తాయి కానీ ఈకలు అసలు కనిపించనే కనిపించవు. కానీ మనలాంటి మేధావులకు అవి కనిపించే తీరాలి. పక్షులకు ఈకలు ఉన్నప్పుడు వాటి గుడ్లకు ఈకలు ఎందుకుండవు? వుండే వుంటాయి కానీ మామూలు ఐకి ఆ ఈకలు కనిపించవు కనుక మనం శాస్త్ర నేత్రాలతో పరిశీలించి పట్టెయ్యాలి, కోడి గుడ్డుకే కాదు యే గుడ్డుకైనా ఈకలు వెదికి పట్టుకుని పీకే సత్తా మనకున్నదని నిరూపించుకోవడానికి ఈ క్షణం నించే మనమందరం ప్రయోగశాలలో ప్రవేశించాలి. గుడ్డు ఈకలు పీకిన తరువాతే బయటి ప్రపంచాన్ని తిరిగి చూడాలి అంటూ వెనక్కి తిరిగి చూడకుండా ప్రయోగశాలలోకి నడిచి వెళ్లిపోయారు.

గుడ్డు ఈకలు పీకే ప్రాజెక్టుకు జిందాబాద్ .. డూ ఆర్ డై అని నినాదాలు చేస్తూ శాస్త్రవేత్తలందరూ గుడ్డు ఈకలు వెతికి పట్టుకుని పీకే పనిని మొదలు పెట్టారు.

పక్షులన్నిటిలో చాలా పక్షులు గుడ్లు పెడతాయి. పక్షులన్నింటికీ ఈకలు వున్నట్టే వాటి గుడ్లు అన్నిటికీ ఈకలు వుండాలని లేదు. అయితే కొన్ని గుడ్లకయినా ఖచ్చితంగా ఈకలు వుండి తీరాలి. ఈకలుండే ఆ గుడ్లు యే పక్షులవి?

ఏ గుడ్డుకి ఏ ఈక వుందో ఎవరికి ఎరుక? అనేక రకాల రకరకాల గుడ్డులు సేకరించబడి లారీలకెత్తబడి ల్యాబ్‌లకు పంపించబడ్డవి. నూటికి నూరు శాతం ఈకలు లేవని తేల్చిన గుడ్లని మాత్రం ఆమ్లెట్లు చేసుకు తింటూ శాస్త్రవేత్తలు గుడ్డుకి ఈకలు పీకే బృహత్తర కార్యక్రమాన్ని కంటిన్యూ చేశారు.

ఇంత మంది విజ్ఞానవేత్తలు యిన్ని గుడ్లు. ఏదో ఒక గుడ్డుకి ఈకలు వుండకపపేతాయా వాటిని వాళ్లల్లో ఎవరో ొకరు పీకకపోతారా మన ఖ్యాతిని ఖండఖండాలకు వ్యాపింపచెయ్యక పోతారా అని గుడ్డీకల ప్రాజెక్టుకు ఎంతో డబ్బు పోసిన దేశం ఎదురు చూడసాగింది. ప్రయోగశాలల్లో ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి.

ఒక్కోసారి మహా మహా శాస్త్రవేత్తలకు సాధ్యపడని పనులు రాజకీయ వేత్తలూ, మీడియా చాలా సునాసయంగా సాధించగలరు, గలదు. గుడ్డుకి ఈకలు పీకే పనిలో వాళ్లు విజయం సాధించేశారు. అధికారంలోకి రాని పార్టీల రాజకీయవేత్తలకు కోడిగుడ్లనే కాదు ఏ గుడ్డులకయినా ఈకలు పీకే పని ఓ పెద్ద పనేం కాదు. మీడియా మహానుభావులకది నల్లేరు బైకు నడక.

దేశంలో ఎన్నికలయ్యీ అవగానే ప్రభుత్వాలు ఏర్పడీ ఏర్పడగానే గుడ్డీకలు పీకే కార్యక్రమం మొదలు పెడ్తారు మిత్రపక్షాల పొలిటీషన్లు వాళ్లకి వంత పాడువాళ్లు. మంత్రివర్గం ఏర్పాటుతో షురూ అయ్యే గుడ్డు ఈకల పీకుట, రంధ్రాన్వేషణ కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చినవాళ్ల పనితీరు చూశాక మొదలు పెడితే నష్టమేమిటి? గుడ్డు కనిపించీ కనిపించక ముందే ఈకలు పీకడమెందుకు?

- చింతపట్ల సుదర్శన్

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+