ఢిల్లీ గ్యాంగ్ రేప్: నల్సార్ లా వర్సిటీ సిఫార్సులు

డిల్లీ ముఠా అత్యాచారం, హత్య తరువాత అత్యాచారాల నివారణ కోసం తీసుకోవలసిన సామాజిక, శాసనిక చర్యలు సూచించడానికి ఏర్పాటయిన జస్టిస్ వర్మ కమిషన్ కు నల్సార్ సమర్పించిన నివేదికలో మహిళల దుస్తుల స్వేచ్ఛను భంగపరచకుండానే రహదారులు, పార్కులు, పట్టణాలు గ్రామాలలోని విశాల మైదానాల్లో, విద్యాసంస్థల ఆవరణలలో భద్రతకు ఏర్పాట్లు చేయాలని అందుకు విదేశాలలో అనుసరిస్తున్న కొన్ని విధానాలను పరిశీలించాలని సూచించింది.
రేప్ వంటి లైంగిక దాడుల కేసులలో బాధితురాలికి వెంటనే కావలసిన వైద్య చికిత్సా సదుపాయాలు, అందుకు అనుగుణమైన తక్షణ ప్రతిస్పందన విధానాలను కల్పించాలి. లైంగిక దాడులు జరిగినపుడు పరోక్షంగా కూడా బాధితురాలిమీదకు తప్పును నెట్టే ప్రయత్నం చేయడం మంచిది కాదని నల్సార్ సూచించింది.
అత్యాచారం నిర్వచనం పరిధిని విస్తరించాలని, లింగచొరబాటుకు మాత్రమే పరిమితం కాకుండా లింగభేదంలేకుండా ఒక వ్యక్తి శరీరంలోని భాగాలలోకి మరొక వ్యక్తి అంగాలను, లేదా వస్తువులను జొప్పించే క్రియను అత్యాచారంగా పరిగణించాలని, లింగ భేదం ఆధారంగా అవమానించడం, అసభ్యంగా ప్రవర్తించడం మొదలైన లైంగిక దాడులన్నింటినీ నేరాలుగా లెక్కించాలని కూడా న్యాయవిశ్వవిద్యాలయం సూచించింది. అయితే నేర విచారణలో బాధితురాలైన మహిళ అంగీకారం ఉందని చెప్పి నేరస్తుడిని తప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేయడాన్ని ప్రోత్సహించకూడదని కూడా సూచించారు.
భార్యపై అత్యాచారం
భర్త అయినంత మాత్రాన అన్ని వేళలా అన్ని కాలాలలో భార్యతో లైంగిక సంభోగం జరపడానికి పెళ్లి ద్వారా అనుమతించిందని భావించడం సమంజసం కాదని, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా సంభోగం జరిపితే దాన్ని నేరంగా పరిగణించి తీరాలని నల్సార్ సూచించింది. లైంగిక దాడులకు గురైన బాధిత మహిళపైన రెండు వేళ్ల పరీక్ష పేరుతో వేళ్లను జొప్పించి రేప్ జరిగిందా లేదా అని పరిశీలించే వైద్య విధానాన్ని మెడికల్ రేప్ గా పరిగణించాలని, అందుకుశిక్షలు విధించాలని నల్సార్ సిఫార్సు చేసింది.
బాలల న్యాయం
డిల్లీ రేప్ నేరంలో ఒక 17 సంవత్సరాల వ్యక్తి ఉన్నంత మాత్రాన బాలన్యాయచట్టాన్ని సవరించి బాలుడనే నిర్వచనాన్ని 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించజూడడం అన్యాయమని, అంతర్జాతీయంగా అనేక పరిశోధనలుచేసిన తరువాత రూపొందించిన బాల వయో నియమాలను కేవలం ఈ ఒక్క సంఘటన కోసం మార్చడం సమంజసం కాదని నల్సార్ సూచించింది.
ఉద్యోగినులపై యజమానుల నేరాలు
పై స్థాయిలో అధికారింగా ఉన్నత హోదాలో ఉండి కింద ఉండే మహిళలపై అధిపత్య సమీకరణాలను ఆధారం చేసుకుని అత్యాచారాలు చేసే మగవారిపైన తీవ్రమైన నేరాలుచేశారనే ఆరోపణలు కఠిన శిక్షలు ఉండాలని కూడా నల్సార్ అభిప్రాయ పడింది. ఆమెను కాపాడవలసిన హోదాలో ఉండి రేప్ చేసినట్టయితే పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించే నియమాలు ఉండాలని సూచించారు. తండ్రి, పై అధికారి, పోలీసు, జైలు సూపరింటెండెంట్ వంటి స్థాయిలో ఉన్న అధికారి, ప్రయివేటు సంస్థల యజమానులు ఈ తీవ్ర నేరాల జాబితాలోకి రావలసి ఉంది. పనిప్రదేశాలలో లైంగిక వేధింపుల బిల్లును వెంటనే ఆమోదించాలని సూచించారు.
విధి ఉల్లంఘన నేరం కావాలి
నేరాల దర్యాప్తు విచారణ తదితర బాధ్యతలున్న వ్యక్తి తన విధినిర్వహణను ఉల్లంఘిస్తే దాన్ని ప్రత్యేక నేరంగా పరిగణించి శిక్షలు నిర్దేశించాలని కూడా సూచించారు. ఆసిడ్ దాడుల వంటి తీవ్రమైన నేరాలు మహిళలపై జరిపిన వారు భారీ పరిహారం చెల్లించాలనే నిబంధనలురూపొందించి ఖచ్చితంగా అమలు చేయాలని కూడా సిఫార్సు చేశారు. ఆసిడ్ దాడి, మహిళలపై నిరంతర వేధింపులు, వేటాడి వేధించడం, బహిరంగంగా అవమానించడం వంటి నేరాలను నిర్వచించాలి.
సామాజిక మార్పులు
పరిసరాల్లో నేర ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవడానికి పొరుగు వారిని భాగస్వాములను చేస్తూ ప్రాంతాల భద్రతా పరిశీలన జరిపించాలి. ఉదయాన్నే విసర్జనకు బహిర్భూములకు వెళ్లక తప్పని మహిళలపైన అత్యాచారాలు జరగడం నివారించాలంటే పారిశుధ్యపరంగా అందుకు కావలసిన సౌకర్యాలు చేయడం నేరాల నివారణకు చాలా ఉపకరించే చర్య. విశాల స్థలాలలో ఆడవారు మగవారు సమానంగా తిరుగాడడానికి వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చీకటిలో చాలా నేరాలు జరుగుతాయి. ప్రత్యామ్నాయం వీధిదీపాలు ఏర్పాటు చేయడమే. వెలుగు విస్తారంగా ఉంటే తిరుగాడడానికి జనం భయపడరు. జనం తిరగాడుతూ ఉంటే నేరాలు చేయడానికి భయపడతారు. విద్యాసంస్థల ఆవరణలు, ప్రజలు ఎక్కువగా గుమికూడే సంస్థలు సబ్ వేలు, పార్కులు, నిర్జన ప్రదేశాలుగాకాకుండా జనసమ్మర్ద ప్రదేశాలుగా మలిచి సౌకర్యాలు కల్పించి తద్వారా మహిళలకు కూడా ఆయా ప్రాంతాలను ఉపయోగించే హక్కు కల్పించాలి.
సామూహిక పోలీసు విధులు
నేరాలు నివారించడానికి వ్యవస్థాత్మక వ్యూహాలు ఉండాలి. సమస్యలు పరిష్కరించేందుకు స్థానిక యువకులు, పెద్దలను భాగస్వాములు చేస్తూ కావలసిన చర్యలేమిటో చర్చించే వెసులు బాట్లు ఉండాలి. భద్రత, సామాజిక శాంతి, నేరభయం వంటి పరిస్థితులు చర్చించాలి. ప్రభుత్వం, లాభాపేక్షలేని సేవా పరులు, ప్రయివేటు వ్యాపారులు, జనమాధ్యమాలను రంగంలోకి దింపి ఉమ్మడి ప్రయత్నాలుచేయాలి. బీటు పోలీసింగ్ ఇదివరకు ఉండేది. కీలకమైన ప్రతి ప్రాంతాన్ని ఎవరో ఒకరు పరిశీలించే పని చాలా ఉపయోగకరమైంది. లైంగిక దాడులు జరిగే చోట్లను గుర్తించి, నేరాలను సహించడం జరగదనే సందేశం పంపాలి. కాపలా పెంచాలి. అందరూ కలిసి గస్తీ తిరిగే పద్ధతులు ప్రారంభించాలి. మౌలిక సౌకర్యాలు పెంచడం కూడా ఒక ముఖ్యమైన చర్యలే అవుతాయి.
విశ్వవిద్యాలయ, తదితర ప్రజాసంస్థల పరిధులలో భయంలేని నడక లేదా నిర్భయ వాహన ప్రయాణాలు అనేవి కావలసిన సేవలు. విద్యార్థులు ఒక హాట్ లైన్ ఫోన్ చేసి భయానక ప్రదేశాలలో నడవడానికి తోడు పంపమని కోరే విధానాలు విదేశాల్లో అమలులో ఉన్నాయి. అటువంటి పద్ధతులు అవసరమైన చోట్ల ప్రవేశ పెట్టాలి. బ్లూలైట్ ఎమర్జన్సీ కాల్ బటన్స్ ను రోడ్డు ప్రక్కల మద్య మధ్య అమరుస్తారు. వాటికి వెంటవెంట ప్రతిస్పందించే బృందాలు ఉంటాయి. వారుమీట నొక్కితే చాలు కొన్ని నిమిషాల్లో సహాయక బృందాలుచేరుకుంటాయి. ఇటువంటి సౌకర్యాలు ఉండాలని నల్సార్ సూచించింది.












Click it and Unblock the Notifications