మమత నిర్ణయం: డార్జిలింగ్‌లో 'బెంగాలీ' మంటలు

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

డార్జిలింగ్: గూర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటు నినాదం పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో మంటలు రేపింది. బెంగాలీ భాషా బోధన తప్పనిసరి చేస్తూ మమతా బెనర్జీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తిరిగి పునాదులు వేసింది. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించడంతోపాటు నిరసన తెలియజేస్తున్న వారిపై పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది.

గురువారం ఉద్యమకారులు పోలీసులతో భీకరంగా తలపడ్డారు. ఒక పోలీస్ ఔట్‌పోస్ట్, మరొక సెరికల్చర్ కార్యాలయం, ఇంకొక రైల్వేస్టేషన్‌కు.. ఒక మీడియా వాహానానికీ నిప్పు పెట్టారు. ఒకవైపు గూర్ఖాలాండ్ కోసం ఆందోళన తీవ్రమవుతుండగా, మరోవైపు గూర్ఖా జనముక్తి మోర్చా అధినేత బిమల్ గురుంగ్ అజ్నాతంలోకి వెళ్లిపోయారు. జీజేఎం కార్యాలయంలో, దాని అధినేత బిమల్ గురుంగ్ నివాసాలపై పోలీసులు జరిపిన దాడుల్లో పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

ఆందోళనకారులు తమపై పెట్రోల్ బాంబులు విసిరారని పోలీసులు పేర్కొన్నారు. ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్రం కోసం జీజేఎం నిర్వహిస్తున్న ఉద్యమం హింసాత్మకంగా పరిణమించి మమతాబెనర్జీ సర్కా‌ర్‌కు రాజకీయ సుడిగుండంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

గూర్ఖాల డిమాండ్ ఇదీ..

గూర్ఖాల డిమాండ్ ఇదీ..

డార్జిలింగ్ కొండప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని గూర్ఖాలు డిమాండ్ చేస్తున్నారు. జీజేఎం నేతృత్వంలో చేపట్టిన నిరవధిక బంద్ నాలుగో రోజుకు చేరుకున్నది. గురుంగ్ నివాసాలపై సోదాలు జరిపేందుకు వచ్చిన పోలీసులను ఉద్యమకారులు అడుగడుగునా రాళ్లదాడులతో అడ్డుకున్నారు. ప్రతిగా పోలీసులు కూడా ఆందోళనకారులపై రాళ్లదాడులు జరిపారు. పోలీసులపైకి ఆందోళకారులు రాళ్లను విసరగా పోలీసులు తిరిగి వాటినే ఆందోళనకారులపైకి విసరడంతో ఆ ప్రాంతంలో యుద్ధవాతావరణం నెలకొన్నది. కొన్ని వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. డార్జిలింగ్‌లో గురుంగ్‌కు చెందిన స్థావరాల్లో పోలీసులు జరిపిన సోదాల్లో 300కుపైగా ఆయుధాలు దొరికాయి. వాటిలో బాణాలు, పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి.

పలువురు కార్యకర్తల అరెస్ట్

పలువురు కార్యకర్తల అరెస్ట్

డార్జిలింగ్‌లోని సింగ్‌మడీ, పట్లేబాజ్‌లలో పోలీసులు సోదాల్లో పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. కచ్చితమైన సమాచారం మేరకు సోదాలు జరిపాం.. ఇవి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురిని అరెస్టు చేశాం అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అయితే గురుంగ్ నివాసంపై దాడులు జరుపలేదని పోలీసులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేధింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని గురుంగ్ ఢిల్లీలో మీడియాతో అన్నారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చేసిన ప్రకటనలను ఆయన తేలికగా కొట్టేశారు. పోలీసులు ఏం స్వాధీనం చేసుకున్నారు. కుక్రీలా? అవి గూర్ఖాల దగ్గర మామూలుగా ఉండేవే. వాటి నుంచి ప్రమాదమేమీ లేదు. ఇక బాణాలు సాంప్రదాయిక ఆయుధాలే కదా. పైగా వాటిని విద్యార్థుల పోటీల కోసం సేకరించాం అని గురుంగ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అణిచివేత చర్యలపై కేంద్రం జోక్యాన్ని కోరుతామని వెల్లడించారు. లక్ష్యానికి చేరుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదనపు పోలీసు బలగాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నిలువాలని ప్రజలకు ఇచ్చిన వీడియో సందేశంలో పిలుపునిచ్చారు. తన ప్రాణం ఉన్నంత వరకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తానని స్పష్టం చేశారు.

జీజేఎం ఆందోళనపై మమతా దీదీ కఠిన వైఖరి

జీజేఎం ఆందోళనపై మమతా దీదీ కఠిన వైఖరి

మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మాట్లాడుతూ కొంత మంది నేతల గూండాగిరిని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. డార్జిలింగ్ కొండల్లో శాంతి నెలకొల్పాలని తాము భావిస్తున్నామని చెప్పారు. బెంగాల్ శాంతియుతంగా ఉన్నదని తెలిపారు. గూండాగిరి చేసే వారి హింసాత్మక ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. బాంబులు, తుపాకులతో రాజకీయాలు చేయలేరని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని తెంచేసుకుంటున్నట్లు గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్ఎల్ఎఫ్) ప్రకటించింది. ఇక జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి, డార్జిలింగ్ ఎంపీ ఎస్ఎస్ అహ్లువాలియా గురువారం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో సమావేశమై పరిస్థితిని వివరించారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని వారు కోరారు.

అనూహ్య నిర్ణయంతో పర్యాటకులకు ఇలా కష్టాలు

అనూహ్య నిర్ణయంతో పర్యాటకులకు ఇలా కష్టాలు

డార్జిలింగ్ కొండ జిల్లాల పరిధిలో ఆందోళన కొనసాగుతుండటం విదేశీ పర్యాటకులకు ప్రాణ సంకటంగా మారింది. ఆందోళనకారులు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో పెద్ద పెద్ద హోటళ్లన్నీ మూత పడ్డాయి. అయితే ఆయా హోటళ్లలో బస చేసిన పర్యాటకుల ఆర్డర్ల మేరకు భోజన వసతి కల్పిస్తున్నారు. ఈ సంగతి తెలియని కొందరు విదేశీ పర్యాటకులు రోడ్డు పాలయ్యారు. జాయ్ అనే లండన్ వాసి మాట్లాడుతూ తనకీ ఆందోళన సంగతి తెలియదని, తాను హోటల్ నుంచి బయటకు వచ్చే సమయానికి నిరవధిక సమ్మె గురించి సంకేతాలే వెలువడలేదని తెలిపారు. చాలా మంది పర్యాటకులు ఉదయం అల్ఫాహారం తీసుకున్న తర్వాత పరిసర ప్రాంతాల్లో ప్రముఖ కట్టడాలు, స్థలాలను సందర్శించేందుకు వెళ్లారు. బయటే భోజనం చేయొచ్చన్నఆలోచనతో బయటకు వెళ్లిన పర్యాటకులు మధ్యాహ్న భోజనం దొరక్క ఇబ్బందుల పాలయ్యారు. రాత్రి వేళ డిన్నర్ కోసం ముందుగానే ఆర్డర్లు ఇవ్వాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి, రెండు రోజుల్లో డార్జిలింగ్ ను వీడాల్సి వస్తుందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
DARJEELING: How many people went without lunch in Darjeeling on Thursday? It would be difficult to ascertain the exact figure but there was no mistaking the pangs of hunger in the eyes of some tourists who were out on the streets. Joe, a youngster from London, kept turning his head from side to side as he walked down the Darjeeling Mall briskly.
Please Wait while comments are loading...