తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న వైయస్ జగన్ కు కౌంటర్ ప్రారంభమైంది. వైయస్సార్ రాజకీయ వారసుడు వైయస్ జగన్ కారనే వాదన ముందుకు వస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ఆస్తికి మాత్రమే వైయస్ జగన్ వారసుడని, రాజకీయ వారసుడు సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి అని అంటున్నారు. కడప జిల్లాకు చెందిన కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఈ వాదనను ముందుకు తెచ్చారు. వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు అధిష్టానాన్ని ఏనాడూ ధిక్కరించలేదని, అధిష్టానాన్ని గౌరవిస్తూ వచ్చారని, ఆ లక్షణం వైయస్ జగన్ కు లేదని గత కొంత కాలంగా కాంగ్రెసులోని జగన్ ప్రత్యర్థులు వాదిస్తూ వస్తున్నారు. పార్టీ అధిష్టానం మేరకు మంత్రి పదవి తీసుకుని కాంగ్రెసుతోనే ఉండాలని నిర్ణయించుకున్న వైయస్ వివేకానంద రెడ్డే అసలైన వైయస్ రాజకీయ వారసుడని చెప్పే దిశగా కాంగ్రెసు రాజకీయాలు సాగుతున్నాయి. అబ్బాయ్ జగన్ తో విభేదించి వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు అధిష్టానానికి అండగా నిలిచారు.