తెలంగాణపై బాలకృష్ణ ప్రకటన ఆంతర్యం..?

తెలంగాణ అంశంపై మాట్లాడాల్సిన అవసరం బాలయ్యకు ఏం వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్న. అయితే, చాలా ముందు చూపుతోనే ఆయన ఆ ప్రకటన చేశారని అంటున్నారు. పార్టీ బాధ్యతలను తీసుకుని, క్రియాశీలకంగా వ్యవహరించాలని భావిస్తున్న ఆయన కీలకమైన అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించాల్సిన అవసరం ఉందనేది గ్రహించినట్లున్నారు. తాను పార్టీకి ముఖ్యమైన నాయకుడినని చెప్పుకోవడం దానికి ఒక కారణం.
అదిలా వుంటే, అసలు కారణం మరోటి ఉందని అంటున్నారు. పార్టీని గెలిపించాల్సిన బాధ్యతను భుజాన వేసుకుంటున్న ఆయన త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో రాజకీయ పర్యటనలు చేయలేదు. తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు దండిగానే ఉన్నారు. తెలంగాణలో కూడా ఆయన పర్యటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో తన పర్యటనలకు ఆటంకాలు కలగకూడదన్నా, తెలంగాణకు తాను వ్యతిరేకమనే భావన ప్రజల్లో ఉండకూడదన్నా తెలంగాణపై తన వైఖరి చెప్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఆయన ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. పర్యటనకు బయలుదేరే సమయంలో చెప్పడం కన్నా చాలా ముందుగానే తన వైఖరిని చెప్పడం ద్వారా తెలంగాణలో తనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని అనుకున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయన తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications