చెన్నై: రాజకీయాల్లోకి వస్తున్నానని ఆదివారం ప్రకటన చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్, అంతకుముందు కొన్ని నిమిషాలు ధ్యానముద్రలో ఉన్నారు. పార్టీ పెడతానని, వచ్చే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని రజనీ చెప్పిన విషయం తెలిసిందే.
చదవండి: జయలలిత ఎఫెక్ట్: రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రానికి ముఖ్య కారణాలు ఇవే!
ప్రకటనకు ముందు ఆయన ధ్యానం చేశారు. ఆ తర్వాత ప్రసంగం ప్రారంభించారు. కర్మణ్యే వాధికారస్తే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జైహింద్ అంటూ ముగించారు. మరోవైపు, రజనీ ప్రసంగం మొత్తం పక్కా ప్రణాళికతోనే జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: చిరంజీవి నేర్పిన పాఠం: రజనీకాంత్-పవన్.. ఇద్దరి దారి ఒక్కటే, అవే విమర్శలు

ఎవరినీ నొప్పించకుండా
ఎవర్నీ నొప్పించకుండా, నేరుగా ఎవరి పేరును ఎత్తకుండా తన మనసులోని మాటను రజనీకాంత్ స్పష్టం చేశారని అంటున్నారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారో అనే విషయాన్ని రజనీకాంత్ వెల్లడించలేదు.

ద్రవిడ పార్టీలకు భిన్నంగా
తమిళనాడులో ద్రవిడ పార్టీలే ఇంతకాలం అధికారంలో ఉన్నాయి. రజనీకాంత్ మాత్రం సరికొత్త రీతిలో తన పార్టీని తీసుకురానున్నట్టు ప్రకటించారు. తాము అధికారంలోని వస్తే ఆధ్యాత్మికంగా పాలన ఉంటుందని చెప్పారు. అంటే, ద్రవిడ పార్టీలకు విభిన్నంగా తన శైలి ఉంటుందని చెప్పకనే చెప్పారు. మూస విధానాలకు ముగింపు పలుకుతానన్న కార్యాచరణ రజనీకాంత్ మాటల్లో పరోక్షంగా ధ్వనించింది.

రజనీకాంత్ ఆరంగేట్రంపై స్టాలిన్, దినకరన్
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన నేపథ్యంలో డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ స్పందించారు. రజనీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్కే నగర్ ఎమ్మెల్యే దినకరన్ కూడా రజనీని రాజకీయాల్లోకి స్వాగతించారు. రాజకీయాల్లో సూపర్ స్టార్‌ను చూడటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రజలు నిర్ణయిస్తారన్నారు. రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నట్లు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు.

రజనీకాంత్ సిద్ధంగానే
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మన సైన్యం సిద్ధంగా ఉంటుందని రజనీకాంత్ తన ప్రసంగం సమయంలో పేర్కొన్నారు. మార్పు కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని, తమిళ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లో కొత్తేమో కానీ.. రాజకీయాలకు తాను కొత్త కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పోయెస్ గార్డెన్‌కు మళ్లీ రాజకీయ కల
ఇదిలా ఉండగా పోయెస్ గార్డెన్ తిరిగి రాజకీయ కల సంతరించుకుందని అంటున్నారు. జయలలిత ఉన్నన్నాళ్లు తమిళ రాజకీయాలు ఆమె చుట్టూ తిరిగాయి. ఆమె నివాసం వేద నిలయం. ఇది పోయెస్ గార్డెన్‌లో ఉంది. దీంతో పోయెస్ గార్డెన్ పవర్ కారిడార్‌గా నిలిచింది. అయితే గత ఏడాది జయలలిత మృతి అనంతరం పోయెస్ గార్డెన్‌కు రాజకీయ కల తప్పింది. ఇప్పుడు రజనీ ఆరంగేట్రంతో మళ్లీ పోయెస్‌కు రాజకీయ కల వచ్చిందని చెబుతున్నారు.

1995 నుంచే
రజనీకాంత్ సినిమాల్లో పలుమార్లు రాజకీయ ప్రస్తావన వచ్చింది. రాజకీయాల్లోను ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని పార్టీలకు మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 1995లో వచ్చిన ముత్తు సినిమాలో ఓ పాటలో 'ఇప్పుడెందుకు నేను పార్టీ పెట్టాలి... కాలమే నిర్ణయిస్తుందని' రజనీపై ఆ లిరిక్ సాగుతుంది. 1996లో జయలలితను బహిరంగానే విబేధిస్తూ ఆమెకు ఓటు వేయవద్దని చెప్పారు. అన్నాడీఎంకే తిరిగి గెలిస్తే భగవంతుడు కూడా తమిళనాడును కాపాడలేరన్నారు. అప్పుడు జయలలిత ఓడిపోయారు.

పవర్ అంటే ఇష్టమని
బాబా సినిమాలో హీరో నాస్తికుడు. అనుకోకుండా ఆధ్యాత్మికం వైపుకు మరలుతాడు. ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో రాజకీయ ప్రక్షాళన కోసం రావాలని ప్రజలు కోరగా.. చివరకు జనం వైపు మొగ్గు చూపుతారు. నదుల అనుసంధానం నేపథ్యంలో బీజేపీ -అన్నాడీఎంకేకు ఓటు అని చెప్పారు. రాజకీయాల్లో సమర్థత, అనుభవం, కఠోర శ్రమతో పాటు కాలం కూడా కలిసి రావాలని రజనీకాంత్ 2008లో అన్నారు. 2014లో రజనీకాంత్ ఇంటికి మోడీ వెళ్లడం చర్చకు దారి తీసింది. పవర్ అంటే ఇష్టమని ఫిబ్రవరిలో ట్వీట్ చేశారు. దీంతో అధికారం అని అందరు అనుకున్నారు. కానీ తాను ఆధ్యాత్మిక వేదికపై ఆధ్యాత్మికత గురించి మాట్లాడానని చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!