health tips: కొబ్బరి నీళ్లు తాగితే మంచిదే.. అయితే వారికి మాత్రం డేంజర్!!
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. అనేక అనారోగ్య సమస్యల నియంత్రణకు కొబ్బరినీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. కొబ్బరినీళ్ళతో చర్మం బిగుతుగా కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి నీళ్లు శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి కొబ్బరినీళ్లు. కళ్ళ కింద నల్లటి వలయాల లాంటి మచ్చలు కూడా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల తొలగిపోతాయి.
కొబ్బరి నీళ్లలో ఉండే అనేక పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ప్రోటీన్, సోడియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి- 2, విటమిన్ బి 3 కూడా ఉంటాయి. పుష్కలంగా పోషకాలు ఉన్నటువంటి కొబ్బరి నీళ్లను తాగితే మంచిది అన్న మాట వాస్తవమే అయినప్పటికీ కొంతమంది మాత్రం కొబ్బరి నీళ్లను తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కొన్ని వ్యాధులతో బాధపడే వారు కొబ్బరి నీళ్లను అసలే తాగొద్దని చెబుతున్నారు వైద్యులు.

సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్నవారు కొబ్బరి నీళ్లను అసలే తాగకూడదు ఎందుకంటే కొబ్బరి నీళ్లలో చాలా తక్కువ సోడియం, చాలా ఎక్కువ పొటాషియం ఉంటుంది ఇది వారికి హాని చేస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల కొబ్బరి నీళ్ళు మూత్రపిండాలకు కూడా హాని చేస్తాయి. అందుకే మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగకూడదు. అసలు కొబ్బరినీళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది. రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లను తాగకూడదు. ఒకవేళ వారు కొబ్బరి నీళ్లను తాగాలంటే వైద్యుల సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి.
శస్త్ర చికిత్స చేయించుకునేవారు, శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కొబ్బరి నీళ్లను తాగకుండా ఉంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇక అధిక బరువుతో బాధపడేవారు కొబ్బరినీళ్లను తాగరాదు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో అదనపు క్యాలరీలు ఉండడం వల్ల బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కొబ్బరి నీళ్లను అతిగా తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమస్యలు వస్తాయి. కొబ్బరినీళ్ళ అధిక వినియోగం వల్ల బీపీ ఉన్నవారికి పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మూత్రపిండాల సమస్యల వారు, బీపీ ఉన్నవారు, అధిక బరువుతో బాధపడేవారు, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్నవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications