మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!
మార్చి 19వ తేదీ నుండి పరాభవ నామ సంవత్సరం ప్రారంభమైంది. పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ద్వాదశ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలో ఈరోజు మన 2026- 27 సంవత్సరంలో మకరరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం.
మకర రాశి వారి ఆదాయ వ్యయాలు
2026-27సంవత్సరంలో మకరరాశి జాతకులకు ఆదాయం రెండు, వ్యయం ఎనిమిది. రాజపూజ్యం 1, అవమానం 2. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణా నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు, ధనిష్ట ఒకటి, రెండు పాదాలలో జన్మించినవారు మకరరాశికి చెందినవారు. మకరరాశి వారికి ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ వరకు గురుడు షష్ఠస్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ శుభఫలితాలను ఇస్తున్నాడు. ఆ తర్వాత సాధారణ ఫలితాలను ఇస్తున్నాడు.

మకర రాశి వారికి విశేష శుభ ఫలితాలు
డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుకేతువులు ద్వితీయ మరియు అష్టమ స్థానాలలో సువర్ణమూర్తులుగా ఉండి విశేష శుభ ఫలితాలను, యోగాలను అందిస్తున్నారు. డిసెంబర్ 6వతేదీ నుండి జన్మ, సప్తమ స్థానాలలో తామ్రమూర్తులుగా మారి సామాన్య ఫలితాలను ఇస్తున్నారు. గురువు ప్రభావంతో వివాహం, వర్తక వ్యాపారాలు, చట్టపరమైన భాగస్వామ్యాలు విజయవంతమవుతాయి. అవివాహితులకు సంపన్నమైన, తెలివైన, ఖ్యాతిగల భాగస్వామి లభిస్తారు. .
ఆర్థిక స్థితి
ఈ ఏడాది మకర రాశి వారికి స్థిరాస్తులు విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. భూములు మరియు గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇతర దేశాలలోనూ ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలోను మంచి ఆదాయం వస్తుంది. వ్యవహారాలు లాభాలను అందిస్తాయి. కెరీర్ లోను, ఆర్థిక విషయాలలోనూ సానుకూల ఫలితాలను చూస్తారు.
ఆరోగ్య స్థితి
మకర రాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఊబకాయం, మోకాళ్లు, పిక్కల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలతో మకర రాశి వారు ఇబ్బంది పడతారు. కనుక మకర రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మకరరాశి వారి తల్లిదండ్రులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
విద్యార్థులకు
మకర రాశి విద్యార్థులకు విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. దూరప్రాంతాలలో విద్యార్థులకు వీసాలు లభిస్తాయి. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ సమయం మకర రాశి విద్యార్థులకు సానుకూలంగానే ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు బాగుంటుంది.
వ్యాపారులకు
నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం, కెరీర్, ఆర్థిక విషయాల్లో చాలా సంతోషం, మెరుగుదల ఉంటాయి. ఫ్యాక్టరీ యజమానులు, మత్స్య సంబంధ వ్యాపారులు, భూమి అమ్మకం-కొనుగోలుదారులు, దళారులు, స్థిరాస్తి వ్యాపారులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. కిరాణా, పప్పులు, మిర్చి, సుగంధ వస్తువుల వ్యాపారులకు మంచి ఆదాయం ఉంటుంది. స్టేషనరీ, కాస్మెటిక్స్ వ్యాపారులకు అధిక సుంకాల వల్ల అమ్మకాలు తగ్గుతాయి. షాపింగ్ మాల్ వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యవసాయదారుల కృషికి తగిన ఫలితాలు, మంచి ఆదాయం లభిస్తుంది.ఉన్నతవ్యక్తుల పరిచయాల ద్వారా బలమైన వ్యాపార భాగస్వాములు వస్తారు.












Click it and Unblock the Notifications