క్రోధి నామ ఉగాది పంచాంగం: సింహరాశి వారి కెరీర్ కు తిరుగులేదు... కానీ!!
క్రోధి నామ సంవత్సర ఉగాది ఈ సంవత్సరం సింహ రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది. సింహరాశి జాతకుల ఆదాయ వ్యయాలు ఎంత? ఏ రంగంలో ఉన్నవారికి శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి జాతకులు ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి? వంటి అనేక విషయాలను క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగం ఆధారంగా తెలుసుకుందాం.
సింహరాశి జాతకుల ఆదాయ వ్యయాలిలా
క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి జాతకుల ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2 అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరంలో సింహరాశిలో బృహస్పతి దశమ స్థానంలోనూ, శని సప్తమ స్థానంలోనూ, రాహువు అష్టమ స్థానంలోనూ, కేతువు వాక్ స్థానంలోను సంచరిస్తున్నారు. దీంతో సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయని చెబుతున్నారు.

సింహరాశిలో ముఖ్య గ్రహాల సంచారం వల్ల ఫలితాలు ఎలా
సింహరాశి జాతకులకు దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆవేశ పూరితమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని సలహా. వాక్ స్థానంలో కేతువు ఉండడం చేత గొడవలకు దూరంగా ఉండాలి. అష్టమ స్థానంలో రాహువు ప్రభావం చేత, సప్తమ స్థానంలో శని ప్రభావం చేత ఆరోగ్య విషయంలోనూ, కుటుంబ విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి
ఆర్థికపరంగా
ఆర్థికపరంగా సింహరాశి జాతకులకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం రైతాంగం నష్టపోతుంది. పంట దిగుబడి విషయంలో నష్టాలు కలుగుతాయి. సింహరాశి జాతకులకు ఆర్థికంగా ఆశాజనకంగా ఉండదు. అప్పుల బాధలు మాత్రం ఉండవు. ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోయినా కొద్దిపాటి ధనాన్ని సంపాదిస్తారు.
కుటుంబ పరంగా
ఇక సింహరాశి జాతకుల కుటుంబ జీవితం ఈ సంవత్సరం బాగుంటుంది. ప్రేమ పరమైన వ్యవహారాలు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య చిన్నచిన్న విభేదాలు వచ్చినప్పటికీ ప్రయత్నంతో వాటిని అధిగమించి కుటుంబంలో సామరస్యత సాధిస్తారు.
కెరీర్ పరంగా
సింహరాశి జాతకులకు ఈ సంవత్సరం ఉద్యోగాలలో అనుకూలమైన దశ కనిపిస్తుంది. దశమ స్థానంలో గురుడు అనుకూలంగా ఉండటం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. కానీ వీరికి ఆఫీసులో మాట అదుపులో ఉంచుకోవటం మంచిదని సలహా ఇవ్వబడింది.
ఆరోగ్యపరంగా
సింహరాశి జాతకుల ఆరోగ్యం ఈ సంవత్సరం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని, కొన్నిసార్లు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అని, ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సంవత్సరం సింహ రాశి జాతకులు ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్త.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications