solar eclipse2022: అమావాస్య నాడు సూర్యగ్రహణం సమయం ఇదే.. గ్రహణసమయంలో చెయ్యకూడని, చెయ్యాల్సిన పనులివే!!
ఈ సంవత్సరం అక్టోబరు 25వ తేదీన మంగళవారం నాడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. దీపావళి పండుగ నాడు సూర్యగ్రహణం ఏర్పడడంతో, ఈ సారి దీపావళి పండుగను అక్టోబర్ 24వ తేదీన సాయంత్రం అమావాస్య ఘడియలు ప్రారంభమైన తర్వాత నుండి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇక ఈ సంవత్సరం దీపావళి పండుగ తర్వాత రోజున సూర్యగ్రహణం రావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు.

సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఇదే
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీదికి వచ్చినప్పుడు లోకానికి వెలుగు నిచ్చే సూర్యుడిని రాహువు మింగేస్తాడు. అంటే అడ్డుపడతాడు. దీని వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం సూర్యగ్రహణం మధ్యాహ్నం 2.32 నుండి సాయంత్రం 6.32 నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. హిందూ ధర్మంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గ్రహణాలు పుట్టిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. గ్రహణ సమయం లో ఆలయాలనే మూసి వేస్తారు అంటే గ్రహణాలకు ఉండే ప్రభావం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.

సూర్య గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలివే
గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలను గురించి, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి పండితులు అనేక విషయాలను చెప్పారు. గ్రహణం సమయంలో ఎవరు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే వారికి అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది. పూర్తిగా కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గ్రహణం సమయంలో ఎవరు భోజనం చెయ్యకూడదు. గ్రహణ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు. అందరూ ఇంట్లోనే ఉండాలి. గ్రహణం సమయంలో సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావం శరీరంపై పడితే అది దుష్ప్రభావాలను చూపిస్తుంది కాబట్టి గ్రహణ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు.

గ్రహణం సమయంలో ఇళ్ళలో ఈ పనులు చెయ్యండి
ఇక గ్రహణం పట్టే ముందు పట్టు స్నానాన్ని, విడిచిన తరువాత విడుపు స్నానం చేయాలని చెబుతున్నారు. గ్రహణం సమయంలో ఇళ్ళల్లో ఉండే అన్ని ఆహార పదార్థాల పైన గరికను వేయాలని సూచిస్తున్నారు. సూర్యుడి మంత్రాన్ని జపించి, గ్రహణం తర్వాత ప్రతి ఒక్కరు స్నానం చేయాలని, ఇంటిని శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక గర్భిణీలు అయితే ముఖ్యంగా సూర్య గ్రహణం సమయంలో అత్యంత జాగ్రత్తతో మెలగాలని సూచిస్తున్నారు. సూర్యగ్రహణ సమయంలో గర్భిణీలు ఎలాంటి పనులు చేయకూడదు. కదలకుండా పడుకోవాలి. గ్రహణం సమయంలో పొరపాటున కూడా ఆహారం తీసుకోకూడదు. గ్రహణానికి ఆరు గంటల ముందే ఆహారం తీసుకోవాలి.

గర్భిణీలు సూర్య గ్రహణం సమయంలో జాగ్రత్త
గర్భిణి స్త్రీలు గ్రహణ సమయంలో కూరగాయలను కొయ్యటం, భోజనం చెయ్యటం, బరువైన పనులు చెయ్యటం చేస్తే , కడుపులోని బిడ్డపై ప్రభావం పడి ఏదో ఒక లోపంతో వారు పుడతారని చాలామంది విశ్వసిస్తారు. గ్రహణ సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు పాటించకపోతే అనర్థాలు జరుగుతాయని అందుకే పెద్దలు సూచిస్తారు. సూర్య గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై అతినీలలోహిత కిరణాలు పడతాయని, ఫలితంగా, ఆహారాన్ని తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతారు. అందుకే గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ ఆహారాన్ని తీసుకోకూడదు.

గ్రహణం పూర్తయిన తర్వాత చెయ్యాల్సింది ఇదే
పవిత్రమైన నది తీర ప్రాంతాలలో జపం చేసుకుంటే మంచిదని చాలామంది భావిస్తారు. సూర్యగ్రహణం వేళ ప్రతి ఒక్కరు కచ్చితంగా ఉపవాసం ఉండాలని, ఉపవాసం ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. చిన్న పిల్లలను బయటకు వెళ్లనివ్వకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. తులసి ఆకుల పైన నీళ్ళు ఉంచితే గ్రహణ ప్రభావం కొంతమేరకు తగ్గుతుందని చెబుతున్నారు. గ్రహణం పూర్తి అయిన తరువాత స్నానం చేసి శక్తికొలది పేదలకు దానధర్మాలు చేస్తే మంచిదని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications