అతి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నేడు; పాటించాల్సిన నియమాలివే!!
పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదిన ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. సహజంగా మార్గశిర మాసం పుణ్యమా పుష్య మాసాల సంధిలో ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. భక్తులకు మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి కాబట్టి ఈ రోజును మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారు. నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం.
యోగనిద్ర నుండి మేల్కొన్న శ్రీమహావిష్ణువును ప్రాతః కాల సమయంలో ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే పుణ్య సమయం కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లోనూ, అత్యంత పవిత్రమైనది, ముఖ్యమైనది, విశేషమైనది వైకుంఠ ఏకాదశి. అన్ని ఏకాదశులను పాటించడం కుదరని వారు, కనీసం ఈ రోజైనా ఆచరించాలని చెబుతున్నాయి.

పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఏకాదశి వ్రతం, విష్ణుపూజ కోటిరెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశితో పాటుగా గీత జయంతి కూడా రావడం విశేషంగా చెప్పొచ్చు. వైకుంఠ ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు విషయానికి వస్తే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, సూర్యోదయానికి ముందే స్నానాలను పూర్తిచేసుకుని, శ్రీమహావిష్ణువు చిత్రపటానికి తులసీదళాలు, జాజిపూలు, పారిజాతాలు, మందారం వంటి పూలతో అలంకరించి ప్రాతఃకాలమే పూజ చేసుకోవాలి.
పూజలు ధూప, దీపాలను సమర్పించి ఆవుపాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. లేదంటే అరటి పండ్లు నైవేద్యం పెట్టినా సరిపోతుంది. స్వామికి పచ్చ కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి. ఈరోజు వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు కావున వీలుంటే దర్శనం చేసుకోవాలి. ఈ రోజంతా ఉపవాస దీక్షను ఆచరించాలి. శరీరం సహకరించని వారు పాలు, పండ్లు తీసుకుని ఉండవచ్చు. కానీ అన్నం మాత్రం తినకూడదు.
ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం ఈరోజు చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఇక ఇది వీలుపడని వారు గోవింద నామాలు చదువుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న మంచి ఫలితం వస్తుందని చెబుతున్నారు. ఈరోజు చేసిన విష్ణు దర్శనం, వ్రతం, దానం, ఉపవాసం చివరకు విష్ణు నామ స్మరణం సైతం కోటిరెట్ల ఫలితాన్ని ఇస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications