హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాదం వెనక అనేక అనుమానాలున్నాయని ఆయన చెప్పారు. వైయస్ కు సంతాపం ప్రకటిస్తూ సోమవారం ముఖ్యమంత్రి కె. రోశయ్య శాసనసభలో ప్రతిపాదించిన తీర్మానంపై ఆయన మాట్లాడారు. వైయస్ లాంటి నేతను మళ్లీ తీసుకు రాలేమని ఆయన అన్నారు. వైయస్ ఆశయాలతోనే రాష్ట్రం ముందుకు సాగాలని ఆయన ఆశించారు.
మాట ఇస్తే దానిపై నిలబడే తత్వం వైయస్ రాజశేఖర రెడ్డిదని ఆయన అన్నారు. వైయస్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా బాధ కలుగుతుందని ఆయన అన్నారు. వైయస్ పేద ప్రజల పక్షాన నిలబడిన నాయకుడని ఆయన కొనియాడారు. అవసరం వచ్చినప్పుడు సాయం చేయకపోతే ఎలా అని అనేవారని ఆయన అన్నారు. వైయస్ మృతికి సంతాపం ప్రకటించాల్సి వస్తుందని, తాను మాట్లాడాల్సి వస్తుందని తాను అనుకోలేదని ఆయన అన్నారు. వైయస్ సంతాప తీర్మానంపై మాట్లాడుతూ ఆయన కంట తడి పెట్టుకున్నారు.