హైదరాబాద్: విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై సోమవారం శాసనసభ దద్దరిల్లింది. రెండు కంపెనీలకు బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించాయి. రెండు సంస్థలకు లాభం చేకూరే విధంగా ప్రభుత్వం అనుతులు ఇచ్చిందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. తవ్వకాలు అపాలని అన్ని పార్టీలు శాసనసభలో చేసిన తీర్మానాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన అన్నారు.
విశాఖ గనుల లీజును రద్దు చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇచ్చిన సమాధానంతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. మంత్రి సమాధానాన్ని నిరసిస్తూ సిపిఎం, సిపిఐ, బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు మాత్రం నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చే సమయంలో మంత్రి ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వం వేసిన కమిటీ ఆమోదించిన తర్వాత బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు.