14న చిరంజీవి బహిరంగ సభ, 10న అభిమానులతో సమావేశం

కాగా, రేపు మంగళవారం రాత్రి ఏడు గంటలకు చిరంజీవి తన పార్టీ శాసనసభ్యులతో సమావేశమవుతారు. ఢిల్లీ పరిణామాలపై ఆయన ఈ సమావేశంలో వివరిస్తారు. ఈ నెల 10వ తేదీన ఆయన హైదరాబాదులోని శిల్ప కళావేదికలో తన అభిమానులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ సమావేశం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి తలెత్తిన పరిణామాలపై ఆయన కార్యకర్తలకు, అభిమానులకు వివరణ ఇస్తారు. దీనికి ముందు ఈ నెల 9న తేదీన ప్రజారాజ్యం పార్టీ కార్యవర్గం సమావేశమై కాంగ్రెసులో విలీనం చేస్తూ ఓ తీర్మానం చేస్తుందని అంటున్నారు.
కాగా, ఆదివారం సాయంత్రం విలీనం విషయాన్ని ప్రకటించిన చిరంజీవి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెసు అధిష్టానానికి చెందిన వివిధ నాయకులతో ఆయన సమావేశమవుతున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. తనకు పూర్తి సహకారం అందించాలని ఆయన జైపాల్ రెడ్డిని కోరే అవకాశం ఉంది. సోమవారం రాత్రి ఏడు గంటలకు ఆయన కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవుతారు.