వెనక్కి తగ్గిన వైయస్ జగన్, పోటీ చేయబోమని ప్రకటన

ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, స్థానిక సంస్థల కోటా నుంచి జరగబోతున్న ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలూ తమ శక్తియుక్తుల్ని కేంద్రీకరిస్తున్నాయి. గెలవటానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకొచ్చిన తనకు కాంగ్రెస్‌లోని వైఎస్సార్ అభిమానులు, జన సంక్షేమాన్ని కాంక్షించే నాయకులు బహిరంగంగానే మద్దతు పలుకుతున్న సంగతీ రోజూ మీరు చూస్తున్నదనే అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయంగా పోరాడాలన్నా, ఏదైనా సాధించాలన్నా రాజకీయ పార్టీ అవసరం కాబట్టి వైఎస్సార్ పేరిట పార్టీ స్థాపన, దానికి సంబంధించిన నిబంధనావళి, విధివిధానాల రూపకల్పన ప్రక్రియను ఆరంభించామని, అది పూర్తవటానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.
పార్టీని ఏర్పాటు చేయటంతో పాటు సంస్థాగతంగా దాన్ని పటిష్టం చేయడం, స్థానిక స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కార్యవర్గాల్ని ఏర్పాటు చేసి బలోపేతం చేయటం వంటివన్నీ మొదట పూర్తి చెయ్యాలన్న ఆలోచనతో ఉన్నాం. అలా చేసిన తరువాతే ఏ ఎన్నికల్లోనైనా పోటీ పడాలన్నది తన మనోభిప్రాయమని, కాబట్టే వచ్చే నెల్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరినీ మేం పోటీకి దింపే యోచన చేయటం లేదని, అందుకని విజ్ఞులు, వైఎస్సార్ పట్ల అంతులేని అభిమానం కలిగి ఉన్న వారు ఈ ఎన్నికల్లో వారి ఆత్మసాక్షి ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు.