అసెంబ్లీ వాయిదాల పర్వం, సభలో ఏమీ మాట్లాడని చిరంజీవి

లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపైన తెలంగాణ రాష్ట్ర సమితి నేతల దాడి, సభలో రాష్ట్రప్రతి గవర్నర్ నరసింహం ప్రసంగాన్ని అడ్డుకోవడం తదితర సంఘటనలూ చోటు చేసుకున్నాయి. అయితే సమావేశాలు కేవలం తెలంగాణపై పట్టుతోనే పలుమార్లు వాయిదా పడింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, దానిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, అది రాష్ట్ర పరిధిలోని అంశం కాదని చెప్పినప్పటికీ తెలంగాణవాదులు వినిపించుకోలేదు. కేంద్రం పరిధిలో ఉన్నప్పటికీ శాసనసభలో తీర్మానం ప్రవేశ పెట్టాలని వారు డిమాండ్ చేయటం, ప్రభుత్వం నిరాకరించడం లేదా వారిని అసెంబ్లీనుండి బైకాట్ చేయడం జరిగింది. మిగిలిన వారు నినాదాలు చేయడం స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేయడం జరిగిపోయింది. దీంతో ప్రజా సమస్యలు పక్కకు వెళ్లాయి.
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ఈ నెల 17న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనా వాస్తవ కార్యకలాపాలు 18 నుంచి మొదలయ్యాయి. ఈ ఆరు రోజుల్లో సభ్యులు సభలో కూర్చున్నది కేవలం ముడు గంటల నలభై తొమ్మిది నిమిషాలే. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఈ సమావేశాలలో మాట్లాడింది కేవలం 12 నిమిషాలు. కాగా ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు మాట్లాడింది ఒకే ఒక్క నిమిషం. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అస్సలు మాట్లాడనే లేదు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన బడ్జెట్ ప్రసంగానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. సభలో ఎక్కువసేపు మాట్లాడిందీ ఆయనే. సాధారణంగా సమావేశాల్లో ప్రతిపక్షం ఎక్కువ సమయం తీసుకుంటుంది. కానీ, ఈ సమావేశాల్లో టీడీపీకి దక్కింది పావుగంట మాత్రమే.