బ్రాహ్మణి స్టీల్స్ వాటాలు విక్రయించడం లేదు: జిఎండి రామచంద్రా రెడ్డి
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: కడప జిల్లాలో తలపెట్టిన గాలి జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని బ్రాహ్మణి స్టీల్స్ వాటాలు అమ్మడం లేదని, వాటాలు ఎవరికీ అమ్మే ప్రసక్తే లేదని జిఎండి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు. తమకు 3,500 కోట్ల రుణం మంజూరైందని, అయితే బ్యాంకుల నుంచి నయా పైసా అప్పు కూడా తీసుకోలేదని ఆయన మంగళవారం స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే సకాలంలో బ్రాహ్మణి స్టీల్స్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇస్తామని ఆయన చెప్పారు.
బ్రాహ్మణి స్టీల్స్‌కు 30 రోజుల గడువు ఇస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. సంస్థ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోయినా, అసలే సమాధానం ఇవ్వకపోయినా ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అలాగే, బ్రాహ్మణి స్టీల్స్ వాటాలను ఉత్తమ్ గాల్వాకు విక్రయించినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. బ్రాహ్మణి స్టీల్స్ వాటాలు విక్రయించే ప్రసక్తి లేదని సంస్థ అధిపతి, గాలి జనార్దన్ రెడ్డి కూడా సోమవారం స్పష్టం చేశారు.