హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం భేటీ అయ్యారు. మంగళవారం గాంధీ భవన్‌లో మర్యాదపూర్వకంగా తనను కలిసిన కడప నేతలను బుధవారం ఉదయం తన నివాసానికి రమ్మని బొత్స ఆహ్వానించారు. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన కుటుంబసభ్యులు బుధవారం ఉదయం బొత్సతో సమావేశమయ్యారు.
కడప జిల్లా పార్టీ పరిస్థితులు, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై వారు చర్చించారు. జిల్లాలో పార్టీని మరింత పటిష్ఠం చేయాలని పీసీసీ చీఫ్ వారికి సూచించారు. మిగతా జిల్లాలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో కడపకు ప్రత్యేక స్థానముందని, ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.