జయశంకర్ వద్ద టిడిపి, కాంగ్రెసును అడ్డుకున్న కెయు విద్యార్థులు
Districts
oi-Srinivas G
By Srinivas
|
వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ సమితి విద్యార్థులు మంగళవారం తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులను వరంగల్‌లో అడ్డుకున్నారు. తెలంగాణ ఉద్యమ సారధి ఆచార్య జయశంకర్ మరణవార్త తెలిసి తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనమండలి సభ్యురాలు గుండు సుధారాణి, కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు రాజయ్య తదితరులు ఆయన మృత దేహాన్ని చూడటానికి వచ్చారు. అయితే కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు వారిని అడ్డుకున్నారు. జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ మృతదేహాన్ని తెలంగాణ ద్రోహులు చూడటానికి వీలులేదంటూ వారిని అడ్డుకున్నారు. వారిని జయశంకర్ మృతదేహం వద్దకు విద్యార్థులు వెళ్లనివ్వలేదు.
కాగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఆచార్య జయశంకర్ మరణవార్త పట్ల తన సంతాపం తెలిపారు. జయశంకర్ లోతైన ఆలోచనలు గల వ్యక్తి అని, విలువల కోసం కట్టుబడి ఉన్న వ్యక్తి అని కొనియాడారు. మృతి ఆయనను బాధించినట్లు చెప్పారు. ఆయన విద్యావేత్తగా, సామాజిక వేత్తగా పేరు గాంచాడని అన్నారు. ఆయనతో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని అన్నారు. కాగా ప్రముఖ దర్శకుడు శంకర్ జయశంకర్ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.