హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక కొర్రీ పెట్టారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి ముందే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తేల్చాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై మాదిగ సామాజికి వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. ముందు వర్గీకరణ సమస్యను పరిష్కరించడానికి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పని చేయాలని ఆయన అన్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మరుగున పరిచేందుకే తెలంగాణ అంశాన్ని ముందుకు తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. మాదిగ సామాజికవర్గ ప్రజాప్రతినిధులు వర్గీకరణ అంశం కోసం కాకుండా తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జూలై 2న తలపెట్టిన మాదిగ మేధావులు, ఉద్యోగ వర్గాల సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.