రాజీనామాలు: 100 మంది ఎమ్మెల్యేలు,14 మంది ఎంపిలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంగళవారం సాయంత్రం వరకు రాజీనామాలు చేసిన శాసనసభ్యులు సంఖ్య 100కు చేరుకుంది. ఇద్దరు బిజెపి శానససభ్యులు కూడా రాజీనామాలు చేశారు. దీంతో ఆ సంఖ్య 100కు చేరుకుంది. శానససభలో 119 తెలంగాణ సీట్లు ఉండగా, పోచారం శ్రీనివాస రెడ్డితో కలిపి 12 మంది తెరాస శాసనసభ్యులు రాజీనామా చేశారు. మంగళవారంనాడు 11 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు, నలుగురు సిపిఐ శాసనసభ్యులు, మంత్రి శంకర రావు రాజీనామా చేశారు. అంతకు ముందే పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా చేశారు.
తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు, రమేష్ రాథోడ్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను వారు స్పీకర్ మీరా కుమార్‌కు అందజేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసిన పార్లమెంటు సభ్యుల సంఖ్య 14కు చేరుకుంది. తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల సంఖ్య మంగళవారం మధ్యాహ్నానికి 131కి చేరుకుంది. తెరాస ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ దాసు రాజీనామా చేశారు. దిలీప్ రాజీనామాతో ఎమ్మెల్సీల సంఖ్య 18కి చేరుకుంది.
మజ్లీస్ శాసనసభ్యులు ఏడుగురు, లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ, సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి రాజీనామా చేసే అవకాశాలు లేవు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, కాంగ్రెసు శానససభ్యులు శశిధర్ రెడ్డి, మణెమ్మ, ఆకుల రాజేందర్ రాజీనామాలు చేయలేదు. కాగా, ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి రాజీనామా చేసే అవకాశాలున్నాయి.