ఈ ప్రభుత్వం ఉంటేనేం, పోతేనేం: వైయస్ జగన్

వైయస్సార్ మృతికి దిగ్భ్రాంతికి గురై మరణించినవారి కుటుంబాలను తాను పరామర్శించడానికి వేలాది కిలోమీటర్లు తిరిగానని, తాను తిరిగినంతగా ఏ రాజకీయ నాయకుడు కూడా తిరగలేదని, ఎన్నో కుటుంబాలను పరామర్శించానని, ఈ సందర్భంగా పేదరికాన్ని దగ్గరగా చూసే అవకాశం కలిగిందని, పేదరికాన్ని ఎలా నిర్మూలించాలనే ఆలోచనలను రేకెత్తించిందని ఆయన అన్నారు. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా పేదరికం అందర్నీ పీడిస్తోందని ఆయన అన్నారు. పేద విద్యార్థులను ఎల్‌కెజీ నుంచి పిజి దాకా చదివించే బాధ్యతను తమ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకుంటుందని ఆయన అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆయన అన్నారు.
వైయస్సార్ స్ఫూర్తితోనే తాను ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు. ప్రతి పేదవాడికి ఎకరా భూమి ఇవ్వాలని ఆయన అన్నారు. పేద విద్యార్థులకు నెలక 500 రూపాయలు తమ పార్టీ ఇస్తుందని ఆయన చెప్పారు. అందుకు తాము వైయస్సార్ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. విద్యార్థి ఉన్నత చదువులకు వెళ్లే కొద్దీ ఆ మొత్తం పెరుగుతూ ఉంటుందని ఆయన చెప్పారు. బడ్జెట్ విపరీతంగా పెరుగుతుందని, అయినా సవాల్‌గా స్వీకరించి అమలు చేస్తామని ఆయన అన్నారు. వైయస్సార్ ఎజెండానే తమ ఎజెండా అని ఆయన చెప్పారు. వైయస్ స్వర్ణ యుగాన్ని మళ్లీ తేస్తానని ఆయన అన్నారు. అవ్వ, తాత, వితంతువుకు ప్రస్తుతం ఇస్తున్న 200 రూపాయలు సరిపోదని, కనీసం నెలకు 700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఇవాళ ఎన్నికలు లేవు, ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పేదరికాన్ని చూసి తనకు నోటి నుంచి ఆ మాట వస్తోందని ఆయన అన్నారు. వైయస్సార్ మరణించి రెండేళ్లవుతున్నా కాంగ్రెసు ఎన్నికల ప్రణాళికకు అర్థం లేకుండా పోయిందని ఆయన అన్నారు. రెండే రెండు వాగ్దానాలు చేసిందని, వైయస్సార్ మరణించిన రెండేళ్లకే ఆ నేతను, ప్రజలను ప్రభుత్వం మరిచిపోయిందని ఆయన అన్నారు. రేషన్ బియ్యం కోటాను 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. మహిళలకు తాము అధికారంలోకి వస్తే వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వడ్డీని ముందే చెల్లించి ఆ రుణం అందేలా చూస్తామని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరును ఆయన తప్పు పట్టారు. నిరుపేదలు ఉచితంగా అమలు చేసే విధంగా పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. వైయస్సార్ లాగానే తమ ముఖ్యమంత్రి ఉన్నాడని ప్రజలు అనుకోవాలని ఆయన అన్నారు.
రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని ఆయన అన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ముందుకు రాలేదని ఆయన అన్నారు. రైతు పక్షపాతి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటేనే రైతులను ఆదుకుంటారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తామని ఆయన చెప్పారు. రైతులకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనే రైతులు సమ్మె చేసే పరిస్థితి ఉందని, తాను వరి పండించలేనని రైతులు చెబుతున్నారని, 3000 వేల కోట్ల రూపాయలు మద్దతు ధర కోసం పక్కన పెడుతామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి ఎలా సహాయం చేయగలమో, ప్రతి ఒక్కరిలో చిరునవ్వులు చూడడానికి ఏం చేయాలో అధ్యయనం చేస్తామని, ఎన్నికలు వచ్చే లోగా ఏయే వర్గాలకు ఏయే విధంగా సహాయం చేస్తామో ముందుకు వస్తామని ఆయన చెప్పారు.