హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎపిఎస్ఆర్టీసీ) తమ బస్సు చార్జీలను పెంచింది. మొదటి 20 కిలోమీటర్ల వరకు ధరలలో మార్పులు ఉండవు. ఆ తర్వాత ధరలను పెంచారు. ఆర్డినరీ బస్సులకు 20 నుండి 40 కిలోమీటర్ల వరకు 1 రూపాయి, 40 నుండి 60 వరకు రూ.2, 60 నుండి 80 వరకు రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్ బస్సులకు పది కిలోమీటర్ల వరకు మినహాయింపు ఇచ్చి ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు 10 పైసల చొప్పున పెంచేందుకు నిర్ణయించుకుంది.
హైదరాబాదు వంటి నగరాలలో తిరిగే పట్టణ బస్సులలో సైతం స్వల్పంగా టిక్కెట్ రేట్లు పెరగనున్నాయి. పెరిగిన ఈ ధరలు గురువారం అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయి. కాగా మూడు వేల కొత్త బస్సులు ఆర్టీసి కొనేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్డీసీ ఎండి గురువారం భేటీ అయిన తర్జన భర్జనల అనంతరం పెంపు నిర్ణయాలు తీసుకున్నారు.