చిత్తూరు: తాను ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడే పరిస్థితిలో లేనని సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ మంగళవారం విలేకరులతో అన్నారు. చిత్తూరులోని వేంకటేశ్వర స్వామి ఆలయ మండల పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను విలేకరులు పలకరించారు. తనలో భక్తి భావం ఇంతకుముందు ఉండేది కాదన్నారు. చాలా ఆలస్యంగా తనలో భక్తిభావం మేల్కొందని అన్నారు. భక్తిభావం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పారు.
కాగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ ఆదికేశవులు నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవం జరిగి నలభై రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు ఐదు గంటల పాటు ఆలయంలో గడిపారు. కాగా ఇటీవల నోటుకు ఓటు కుంభకోణంలో అమర్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.