హైదరాబాద్: విఆర్ఓ పరీక్ష రాస్తున్న అభ్యర్థులను ఓ ప్రశ్న ఆదివారం తికమక పెట్టింది. ప్రశ్నాపత్రంలో 12వ ప్రశ్నగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అని ప్రశ్న వచ్చింది. అయితే ఇచ్చిన ఆప్షన్‌లలో మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి అయిన కన్నా లక్ష్మీ నారాయణ పేరు లేదు. దీంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. అప్షన్‌లలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి రఘువీరా రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి పేర్లు ఉన్నాయి. కన్నాకు ముందు వ్యవసాయ శాఖ మంత్రిగా దామోదర అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖను కన్నాకు అప్పగించారు. అంతకుముందు రఘువీరా రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డిలు వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న కన్నా పేరు మాత్రం లేదు. విస్తరణకు ముందు ప్రశ్నాపత్రాలు ముద్రించడంతో కన్నా పేరు అందులో లేదు. అయితే అధికారులు దీనిని గుర్తించక పోవడం గమనార్హం.
కాగా విఆర్ఓ పరీక్షల సందర్భంగా కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి. అదిలాబాద్ నర్సాపురం గ్రామానికి చెందిన అలేఖ్య అనే అభ్యర్థి పరీక్ష రాసేందుకు తన మేనమామ ద్విచక్ర వాహనంపై వస్తుండగా జారి క్రింద పడి మృతి చెందింది. ఈ ఘటన ఏడో నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. పలుచోట్ల నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. ఈ పరీక్షలకు 75 శాతం మంది హాజరయ్యారు. కాగా విఆర్ఏ పరీక్షలు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్నాయి.