తిరుపతి: ఏం ఉద్ధరించారని సినీ నటుడు, రాజకీయ నాయకుడు చిరంజీవిని కేంద్రానికి పంపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు నాయకులను ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా కోవూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెళ్తూ ఆయన బుధవారం రేణిగుంట విమానాశ్రయంలో ఆగినప్పుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న కళంకిత మంత్రుల ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రయోజనాలు పొందారని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికల్లో అవినీతి సొమ్మును, పత్రికను, టీవీ చానెల్‌ను అడ్డం పెట్టుకుని కోవూరులో విజయం సాధించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, అది అవివేకమని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని కాంగ్రెసు నాయకులు అడవి పందుల్లా నాశనం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అనుభవం లేని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నీ తెలుసునని ఫోజులిస్తున్నారని, ఏమీ తెలియక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎపి అంటే ఎసిబి, సిబిఐ, హైకోర్టు, సుప్రీంకోర్టు తప్ప మరో మాట వినిపించడం లేదని ఆయన అన్నారు.