ఆజాద్‌ది నిజమైన ఎన్‌కౌంటరే: సుప్రీంకోర్టుకు సిబిఐ

2010, జూలై ఒకటో తేదీన ఆదిలాబాద్ జిల్లా వాంకిడి ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్, జర్నలిస్టు హేమచంద్ర పాండేల మృతదేహాలను గుర్తించడం, ఎదురుకాల్పుల్లోనే వారు చనిపోయినట్టు పోలీసులు చెప్పగా, కాదు పట్టుకొని చంపారని పౌర హక్కుల సంస్థలు ఆరోపించడం తెలిసిందే. దీనిపై హేమచంద్ర పాండే సహచరి బబితా పాండే, ప్రముఖ సామాజిక వేత్త అగ్నివేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే.
అయితే, సీబీఐ సమర్పించిన నివేదికను పరిశీలించాక మాత్రం, ఆజాద్ బూటకపు ఎన్‌కౌంటర్‌లో చనిపోలేదని సుప్రీంకోర్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చేసింది. పౌర హక్కుల సంఘం తరపున వాదించిన ప్రశాంత్ భూషణ్ కోరిక మేరకు, దర్యాప్తు తుది నివేదికను ఆయనకు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. కోర్టు రిజస్ట్రీలో నివేదికను చూసుకోవచ్చునని, అయితే అందులో వివరాలను మాత్రం బయటపెట్టరాదని షరతు విధించింది. సీబీఐ దర్యాప్తు నివేదికపై తమ అభిప్రాయం, అభ్యంతరాలను పిటిషనర్లు వెల్లడించేందుకు వీలుగా వచ్చే నెల 13వ తేదీకి విచారణను వాయిదా వేసింది.