న్యూఢిల్లీ/లక్నో: యుపిఏ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రికి కాంగ్రెసు పార్టీ చెక్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ యుపిఏలో ఉన్నప్పటికీ ఆమె వైఖరి కాంగ్రెసుకు పెద్ద తలనొప్పులు తీసుకు వస్తోంది. నాలుగు రోజుల క్రితం దినేష్ త్రివేది ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైనా మమత కాంగ్రెసుపై మండిపడ్డారు. పెంచిన ధరలు తగ్గించాలని యుపిఏ ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా తన పార్టీకి చెందిన రైల్వే మంత్రి త్రివేది రాజీనామాకు ఆమె డిమాండ్ చేశారు. మమత కారణంగా యుపిఏ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే ఆమెకు చెక్ చెప్పేందుకు కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మమతను బయటకు పంపించి ఇటీవలే ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమాజ్‌వాది పార్టీని యుపిఏలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇందులో భాగంగానే ములాయం సింగ్‌కు కాంగ్రెసు పార్టీ ఓ ముఖ్య నేత నుండి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆదివారం కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత ములాయం సింగ్ యాదవ్‌కు ఫోన్ చేసి సోమవారం ఢిల్లీ రమ్మని చెప్పారు. ములాయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ అంశంపై యుపి ముఖ్యమంత్రి, ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ములాయం సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారని చెప్పారు. యుపిఏతో పొత్తు విషయంలో ఆయనదే ఫైనల్ అని చెప్పారు. ఆయన నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు. కాగా ఎస్పీ యుపిఏలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని కాంగ్రెసు పార్టీ కూడా తెలిపింది.